అప్పుడు పారిపోయాడు.. కానీ ఫుల్ టాలెంట్ ఉంది: అల్లు అరవింద్
అయితే టీజర్ లాంచ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.;
టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు సమర్పణలో మిత్రమండలి మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బీవీ వర్క్స్ బ్యానర్ పై బన్నీ వాస్ సమర్పిస్తుండగా.. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం ఫిమేల్ లీడ్ రోల్ లో కనిపించనున్నారు.
కొత్త డైరెక్టర్ విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్న మిత్రమండలి టీజర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే టీజర్ లాంచ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మిత్రమండలి మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. టీజర్ చాలా బాగుందని.. మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు.
"బన్నీ వాసు సమర్పణలో వస్తున్న మొదటి సినిమా.. నా మిత్రులు కలిసి నిర్మిస్తున్న మిత్రమండలి టీజర్ ను రిలీజ్ చేయడం బాధ్యతగా భావిస్తున్న. నేను ఎప్పుడూ ఎక్కువగా యంగ్ స్టెర్స్ తో టైమ్ స్పెండ్ చేస్తుంటా. దాని వల్ల మూవీ స్క్రిప్ట్స్ సెలెక్షన్ సహా పలు విషయాల్లో హెల్ప్ అవుతుంటుంది.ఒకసారి బన్నీ వాసు మిత్రమండలి మూవీ కథ వినమని దర్శకుడిని నా దగ్గరకు పంపించాడు" అని తెలిపారు.
"కానీ మీలాంటి పెద్ద వాళ్ల ముందు కథ చెప్పలేకపోతున్నా అని డైరెక్టర్ పారిపోయాడు. మరోసారి ప్రాక్టీస్ చేసి వస్తా అన్నాడు. అయితే కథ వినకుండానే డైరెక్ట్ గా మిత్రమండలి చూడబోతున్నా. అయితే మీ అందరి మాటలు వింటుంటే మాత్రం డైరెక్టర్ లో చాలా టాలెంట్ ఉందని క్లియర్ గా అర్థమవుతుంది" అని అల్లు అరవింద్ వేదికపై వ్యాఖ్యానించారు.
"అయితే నటుడు ప్రియదర్శి మాకు ఒక వెబ్ సిరీస్ చేశాడు. అప్పుడే అతడు మంచి స్థాయికి వెళ్లాడని అనుకున్నా నేను. ఆయనకు ఒక యాక్టర్ గా ఎంత చేయాలో.. ఎంత చేయకూడదో బాగా తెలుసు. రీసెంట్ గా వచ్చిన కోర్ట్ మూవీలో సూపర్ గా నటించాడు" అని కొనియాడారు. న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఆ మూవీ సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
మిత్రమండలి హీరోయిన్ నిహారికకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉందని అల్లు అరవింద్ తెలిపారు. ఫేక్ ఐడి తో ఆమె ఫాలో అవుతున్నానని చెప్పారు. హీరోయిన్ గా డెబ్యూ చేస్తున్న ఆమెకు బెస్ట్ విషెస్ చెప్పారు. నిర్మాతలతో తనకు ఇప్పటికే మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.