ఇడియట్ ని కొట్టేలా మిస్టర్ ఇడియట్!
రవితేజ-పూరిజగన్నాధ్ కాంబినేషన్ లో రిలీజ్ అయిన `ఇడియట్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.;
రవితేజ-పూరిజగన్నాధ్ కాంబినేషన్ లో రిలీజ్ అయిన `ఇడియట్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇద్దరి కెరీర్ లోనూ ఆ సినిమా ఓ టర్నింగ్ పాయింట్. ఆ విజయంతోనే ఇద్దరు టాలీవుడ్ లో నిలదొక్కుకున్నారు. అప్పటివరకూ రవితేజ-పూరి జర్నీ వేరు.. ఇడియట్ తర్వాత ఆ ద్వయం జర్నీ వేరు. ఇద్దర్ని ఇండస్ట్రీలో బిజీగా మార్చేసిన విజయం అది. అప్పటి యువతని ఓ ఊపు ఊపేసిన చిత్రమిది.
మళ్లీ అలాంటి సినిమా చేయాలంటే ఆ ఇద్దరితోనే సాధ్యమా? అనిపించేలా చేసారు. అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ నీ ఢీ కొడతాం అంటున్నారు రవితేజ తమ్ముడు రఘు తనయుడు మాధవ్. యువ నటుడ్ని హీరోగా పరిచయం చేస్తూ పెళ్లి సందడి ఫేం గౌరీ రొణంకి మిస్టర్ ఇడియట్ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మాధవ్ పుట్టిన రోజు సందర్భంగా మాధవ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించారు.
అనంతరం సినిమాపై యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. అందులో భాగంగా సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు సినిమా విజయాన్ని కాంక్షిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. `మిస్టర్ ఇడియట్` రవితేజ `ఇడియట్` కంటే పెద్ద విజయం సాధించాలని..సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసారు. మరి ఇడియట్ కి..మిస్టర్ ఇడియట్ కి ఎలాంటి వ్యత్యాసం దర్శకురాలు చూపిస్తారో? చూడాలి. ఇక ఈ సినిమాకి రవితేజ సినిమా టైటల్ ని పెట్టడం ఆసక్తికరమే. హిట్ సినిమా టైటిల్ పెట్టాలంటే డేరింగ్ ఉండాలి.
అలాంటి ధైర్యం ఉండాలి అంటే కంటెంట్ అంత బలంగా ఉండాలి. పెళ్లి సందడి సినిమాతో గౌరీ యావరేజ్ విజయాన్ని అందుకున్నారు. అది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మరి మిస్టర్ ఇడియట్ మెయిన్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? అన్నది తెలియాలి. టైటిల్ ని బట్టి చూస్తే యూత్ నే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మరి రవితేజ లా మాధవ్ కూడా అదే ఎనర్జీ పెర్పార్మెన్స్ ఇస్తాడా? అంతకు మించి అనిపిస్తాడా? అన్నది చూడాలి.