మిర్జాపూర్ బూతులు.. దివ్యేందుతో చరణ్ ఫన్ చూశారా?

మిర్జాపూర్ అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది మున్నా భయ్యా స్టైల్, ఆ గ్యాంగ్‌ స్టర్ యాటిట్యూడ్, అలాగే బోల్డ్ డైలాగ్స్‌.

Update: 2026-05-28 04:00 GMT

మిర్జాపూర్ అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది మున్నా భయ్యా స్టైల్, ఆ గ్యాంగ్‌ స్టర్ యాటిట్యూడ్, అలాగే బోల్డ్ డైలాగ్స్‌. ఇప్పుడు అదే ఇమేజ్‌ తో ఫేమస్ అయిన బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు శర్మ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటంతో మూవీపై మరింత ఆసక్తి పెరిగింది. తాజాగా వారిద్దరూ కలిసి పాల్గొన్న చిట్‌ చాట్‌ లో మిర్జాపూర్ బూతులపై చరణ్ చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పెద్ది మూవీ దివ్యేందు శర్మ రామ్ బుజ్జి అనే పవర్‌ ఫుల్ నెగిటివ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌ లో ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మిర్జాపూర్ తర్వాత మరోసారి ఇంత రఫ్ క్యారెక్టర్‌లో కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల జరిగిన ఓ స్పెషల్ చిట్‌ చాట్‌ లో ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమన్ ఇరానీ.. దివ్యేందు గురించి మాట్లాడాలని చరణ్‌ ను అడిగారు. అప్పుడు చరణ్ తన కామెంట్స్ తో నవ్వులు పూయించారు. "మిర్జాపూర్‌ కు సౌత్‌ లో కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మీ క్యారెక్టర్‌, మీ స్వాగ్‌, మీ గ్యాంగ్‌స్టర్ స్టైల్ అందరినీ ఆకట్టుకున్నాయి. కానీ రియల్ లైఫ్‌ లో మాత్రం మీరు జెంటిల్‌ మ్యాన్" అంటూ చరణ్ ఫన్ చేశారు.

వెంటనే రెస్పాండ్ అయిన దివ్యేందు.. హైదరాబాద్ ప్రేక్షకుల ప్రేమ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. పెద్దిలో క్రికెట్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతున్నప్పుడు భారీగా ప్రేక్షకులు వచ్చారని చెప్పారు. "నేను గ్రౌండ్‌ లోకి ఎంటర్ అయ్యిన వెంటనే ఆడియన్స్ చాలా గట్టిగా రెస్పాండ్ అయ్యారు. వాళ్లకు నేను అంతగా తెలుసా అని నేను కూడా షాక్ అయ్యా. హైదరాబాద్‌ లో నాపై చాలా ప్రేమ కనిపించింది" అని తెలిపారు.

అక్కడే చరణ్ మరోసారి తనదైన స్టైల్‌ లో జోక్ వేశారు. "మిర్జాపూర్ గాలియా (బూతులు) హైదరాబాద్‌ లో కూడా ఐకానిక్ అయిపోయాయి" అంటూ చెప్పడంతో బొమన్, దివ్యేందు నవ్వుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో చరణ్ చెప్పింది నిజమేనని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు

మరోవైపు మిర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించిన దివ్యేందు శర్మ.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. పెద్దినే ఆయనకు టాలీవుడ్ డెబ్యూ మూవీ కావడం విశేషం. ఇప్పుడు ఆయనకు హైదరాబాద్‌ లో దక్కిన రెస్పాన్స్‌, చరణ్‌ తో ఉన్న ఫన్ బాండింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారాయి. మరి సినిమాలో తన యాక్టింగ్ తో ఎంతలా మెప్పిస్తారో వేచి చూడాలి.



Tags:    

Similar News