ఒకే స్టేజ్ పై పవన్- చిరూ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్ట‌ర్ బాబీ కొల్లి తెరకెక్కించనున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Mega158 పై అఫీషియ‌ల్ హడావిడి మొదలైంది.

Update: 2026-05-20 07:34 GMT

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్ట‌ర్ బాబీ కొల్లి తెరకెక్కించనున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Mega158 పై అఫీషియ‌ల్ హడావిడి మొదలైంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొనగా, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా త‌మ‌న్ పేరు ఖరారు కావడంతో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. మే 21న ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ముఖ్య అతిథిగా పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజరవుతుండటంతో ఈ వేడుకపై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. మెగాస్టార్- పవర్ స్టార్ ఒకే వేదికపై కనిపించబోతుండటంతో సోషల్ మీడియాలో ఆల్రెడీ భారీ డిస్క‌ష‌న్ మొదలైంది.

ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం ఇండస్ట్రీ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. గతంలో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు త‌మ‌న్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మాస్ ఎలివేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ సినిమాకి ఆయన సంగీతం అందించబోతుండటంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరోవైపు డైరెక్ట‌ర్ బాబీతో త‌మ‌న్‌కు ఇప్పటికే బలమైన సక్సెస్ ట్రాక్ ఉంది. వెంకీ మామ, డాకు మహారాజ్ లాంటి సినిమాల్లో వీరి కాంబినేషన్ మంచి ఫలితాలను అందుకుంది. ముఖ్యంగా మాస్ బీట్‌లు, ఎమోషనల్ స్కోర్, హీరో ఎలివేషన్ మ్యూజిక్ విషయంలో త‌మ‌న్- బాబీ కాంబోకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అదే మ్యాజిక్ ఇప్పుడు మెగా158లో మరింత భారీ స్థాయిలో కనిపించబోతుందనే టాక్ వినిపిస్తోంది.

ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ కథ, హై వోల్టేజ్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ మేళవింపుతో బాబీ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి- బాబీ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఏర్పడిన నమ్మకం ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలం చేకూరుస్తోంది. ఇక కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందనున్నట్లు సమాచారం. పూజా కార్యక్రమాల తర్వాత షూటింగ్ షెడ్యూల్‌పై పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశ‌ముంది. మరోవైపు త‌మ‌న్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు తగ్గ మాస్ బీజీఎం, ఫ్యాన్స్‌కు థియేటర్లలో ఊపు తెప్పించే పాటలు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవొచ్చని భావిస్తున్నారు. దీంతో #Mega158 టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది.

Tags:    

Similar News