మా ఫ్యామిలీని అంటే ఊరుకోను... మెగా కోడలు ఫైరింగ్
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు ముందుకు వస్తున్నారు.;
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు ముందుకు వస్తున్నారు. ఒకరకంగా సాయం కోరితే తానున్నానని చెప్పిన పెద్దమనిషిగా గౌరవం అందుకుంటున్నారు. ఒక స్టార్ గా లెజెండరీ హోదాలో ఉన్నారు. ఆయన వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఎంతో సమున్నత స్థానానికి చేరుకున్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవాకార్యక్రమాలతో ఆయన ప్రజలలో సామాజిక కర్తగా గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఆయనపై ఒక జర్నలిస్ట్ చేసిన కామెంట్ ఇటీవల మీడియాలో పెద్ద చర్చగా మారింది.
ఇటీవల చిరు తనయుడు రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు కవలలు (ఒక బాబు, ఒక పాప) జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒక మీడియా సమావేశంలో చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. అయితే ఒక జర్నలిస్ట్ చిరంజీవి పాత వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ట్విట్టర్‌లో విమర్శలు చేశారు. అబ్బాయి పుట్టినందుకు ఇంత హడావుడి చేస్తున్నారు.. అదే క్లిన్ కారా (మొదటి పాప) పుట్టినప్పుడు ఇంత సెలబ్రేషన్ లేదు`` అనే అర్థంలో ఆ ట్వీట్ ఉంది.
అయితే సదరు జర్నలిస్ట్ ఈ ట్వీట్ వేయడానికి ముందు ఒక ఘటనను గుర్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 2025లో జరిగిన ఒక కార్యక్రమంలో మెగాస్టార్ సరదాగా మాట్లాడుతూ.. తనకు నలుగురు మనవరాళ్లు ఉన్నారని.. ఇంట్లో ఉంటే తనకి `లేడీస్ హాస్టల్ వార్డెన్` లా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. అలాగే ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్లడానికి రామ్ చరణ్‌కు అబ్బాయి పుడితే బాగుంటుందని.. మళ్ళీ అమ్మాయి పుడుతుందేమోనని భయంగా ఉందని జోక్ చేశారు. ఆ సమయంలో చిరు కేవలం సరదాగా మాట్లాడినా దానిపై ఒక వర్గం చాలా రచ్చ చేసింది. ఇప్పుడు జర్నలిస్ట్ కామెంట్ దానిని అనుసరించి సెటైరికల్ గా ఉండటంతో దీనిపై మెగా ఫ్యామిలీ తరపున కోడలు లావణ్య త్రిపాఠి ఘాటుగా స్పందించారు.
లావణ్య త్రిపాఠి ఘాటు స్పందన:
తన మామగారిపై వచ్చిన ఈ విమర్శలపై లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. ఎక్స్ లో షేర్ చేసిన వీడియోలో లావణ్య ఈ విధంగా స్పందించారు..``సాధారణంగా నేను ఇలాంటి ట్వీట్లను పట్టించుకోను.. కానీ మీ నుండి ఇది ఆశించలేదు. ఒక కుటుంబం ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం `వెరీ బ్యాడ్ టేస్ట్`. ఆయన తన కుటుంబంలోని మహిళలను, ముఖ్యంగా తన మనవరాళ్లను ఎంత గౌరవంగా, ప్రేమగా చూసుకుంటారో మీకు తెలియదు. ఆయన చేసే దాంట్లో 1శాతం కూడా చాలా తక్కువ మంది పురుషులకే సాధ్యం. కాబట్టి మీకు పూర్తిగా తెలియని వ్యక్తుల గురించి కామెంట్ చేయకపోవడం మంచిది`` అని అన్నారు. దీనిపై ప్రముఖ జర్నలిస్ట్ ప్రశ్నించినప్పుడు లావణ్య పైవిధంగా స్పందించారు. ఆ జర్నలిస్టు బ్యాడ్ టేస్ట్ గురించి నిలదీసారు. ముఖ్యంగా కుటుంబం ఆనందంగా ఉన్నప్పుడు ఆయన ఈ కామెంట్ చేయడం సరికాదని లావణ్య ఘాటుగా స్పందించారు.
మెగా ఫ్యామిలీ కోడలిగా లావణ్య తన మామగారి వ్యక్తిత్వాన్ని సమర్థిస్తూ నెగటివిటీకి చెక్ పెట్టే ప్రయత్నం చేయడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. తన కుటుంబాన్ని బయటి వ్యక్తులు ఏదైనా అన్నప్పుడు బాహాటంగా ఖండించడం మెగా తమ్ముళ్లలో జోష్ నింపింది. వారంతా వదినమ్మ లావణ్యను సమర్థిస్తున్నారు.
రామ్ చరణ్ - ఉపాసనలకు 01 ఫిబ్రవరి 2026న కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. కవలల్లో ఒకరు అమ్మాయి.. ఒకరు అబ్బాయి. మొత్తానికి మెగా, అల్లు కుటుంబాలలో ఎవరిపైన కామెంట్ చేసినా తను స్పందిస్తానని స్పష్ఠంగా చెప్పారు లావణ్య. మెగా కుటుంబం ఆనందంగా ఉన్న సందర్భంలో పాత విషయాలను లాగి వివాదం సృష్టించడం సరికాదని చెబుతూనే జర్నలిస్టును సున్నితంగా లావణ్య హెచ్చరించారు.