ది రాజా సాబ్: వేదికపై భావోద్వేగానికి గురైన మారుతి
అయితే ది రాజా సాబ్ ప్రీరిలీజ్ లో మారుతి మాట్లాడుతూ ఈ సినిమా ప్రభాస్ అభిమానులను ఎంతమాత్రం నిరాశపరచదని అన్నారు.;
ప్రభాస్ నటించిన హారర్ కామెడీ చిత్రం `ది రాజా సాబ్` సంక్రాంతి సందర్భంగా జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. భారీ పోటీ ఉన్నా ఈ సినిమా కంటెంట్ పై నమ్మకం, ప్రభాస్ స్టార్ డమ్ బాక్సాఫీస్ వద్ద మేనియా క్రియేట్ చేస్తాయనే నమ్మకం చిత్రబృందం లో ఉంది. విడుదల సమీపిస్తున్న తరుణంలో భారీ ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజా సాబ్ సంగతుల్ని ముచ్చటించింది చిత్రబృందం.
అయితే ది రాజా సాబ్ ప్రీరిలీజ్ లో మారుతి మాట్లాడుతూ ఈ సినిమా ప్రభాస్ అభిమానులను ఎంతమాత్రం నిరాశపరచదని అన్నారు. ఇక తనకు ఇంత పెద్ద అవకాశం కల్పించిన డార్లింగ్ ప్రభాస్ ముందు మారుతి ఎంతో ఎమోషనల్ అయ్యారు. మాటలు తడబడుతుండగా అతడు భావోద్వేగానికి గురయ్యాడు. ఆ సమయంలో వేదికపైకి వచ్చిన ప్రభాస్ మారుతిని హగ్ చేసుకుని, అతడిని ఓదార్చే ప్రయత్నం చేసారు. ప్రస్తుతం ఈ వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.
ఈ సినిమా కోసం మారుతి బృందం ఏకంగా మూడేళ్ల పాటు అహోరాత్రులు శ్రమించారు. ప్రభాస్ అంతటి పెద్ద హీరోతో సినిమా అనగానే మారుతి ఓకింత తీవ్రంగానే ఒత్తిడికి గురయ్యాడని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. నిర్మాత విశ్వప్రసాద్ రాజీ లేకుండా బడ్జెట్లు సమకూర్చారు. మొదట చిన్న సినిమాగా అనుకున్నది .. కేవలం చిన్న ఎంటర్ టైనర్ గా తీయాలని అనుకున్నది కథలో స్పాన్ పెరిగింది. తర్వాత బడ్జెట్ స్పాన్ పెరిగింది. విజువల్ ఎఫెక్ట్స్ పెరిగాయి. చివరికి ది రాజా సాబ్ ఫైనల్ అవుట్ పుట్ వచ్చాక రిలీజ్ తేదీని ఫిక్స్ చేసారు. సినిమాని ఈ దశకు తీసుకొచ్చేందుకు మారుతి ఎంతగానో శ్రమించారు. దీనికోసం చాలా ఒత్తిళ్లను అతడు ఎదుర్కొన్నాడు. అందుకే ప్రీరిలీజ్ వేదికపై మారుతి తన భావోద్వేగాన్ని దాచుకోలేకపోయాడు.
ఇదే వేదికపై మారుతి నేరుగా ప్రభాస్ ప్యాన్స్ కి ఒక బోల్డ్ ఛాలెంజ్ విసిరారు. ఈ సినిమా నిరాశపరిస్తే, తన ఇంటికి వచ్చి ప్రశ్నించమని ప్రభాస్ ఫ్యాన్స్ కి సవాల్ విసిరారు. ఈ సినిమాలోని ప్రభాస్‌ను చాలా సంవత్సరాల పాటు గుర్తుంచుకుంటారని వ్యాఖ్యానించిన మారుతి సినిమాపై అంచనాలను పెంచారు.