'మండాడి' మూవీ రివ్యూ

మరి సుహాస్ తమిళ ఎంట్రీ ఎలా ఉంది? ఈ సినిమా విశేషాలేంటి? చూద్దాం పదండి.

Update: 2026-09-10 12:38 GMT

‘మండాడి’ మూవీ రివ్యూ

నటీనటులు: సూరి- సుహాస్- మహిమ నంబియార్- రవీంద్ర విజయ్- మిథున్ జైశంకర్ తదితరులు

సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్

ఛాయాగ్రహణం: ఎస్ఆర్ కదిర్

నిర్మాత: ఎల్రెడ్ కుమార్

రచన-దర్శకత్వం: మదిమారన్ పుహళేంది

తెలుగులో నటుడిగా మంచి పేరు సంపాదించిన సుహాన్.. ఇప్పుడు తమిళంలోకి అడుగుపెట్టాడు. అతను విలన్ పాత్ర పోషించిన చిత్రం.. మండాడి. కమెడియన్ టర్న్డ్ హీరో సూరి ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ ఈ రోజే తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజైంది. మరి సుహాస్ తమిళ ఎంట్రీ ఎలా ఉంది? ఈ సినిమా విశేషాలేంటి? చూద్దాం పదండి.

కథ: కళింగపట్నం అనే తీర ప్రాంత గ్రామంలో కాళి (సూరి).. సాట్టాపులి (సుహాస్) ఇద్దరూ జాలర్లు. తెరచాప పడవ పోటీల్లో కళింగపట్నానికి మంచి పేరు తెచ్చిన ఈ ఇద్దరు మిత్రులూ.. తర్వాత బద్ధ శత్రువులుగా మారిపోతారు. కాళి.. తాను ప్రేమించిన అమ్మాయికి కూడా దూరమై ఊరు విడిచి హైదరాబాదుకి వెళ్లి పని చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అలా ఎన్నో ఏళ్లు కళింగపట్నానికి దూరమైన కాళి.. తిరిగి తన ఊరికి రావాల్సి వస్తుంది. అంతే కాక సాట్టాపులికి పోటీగా ఒక టీంని పెట్టి తెరచాప పడవ పోటీల్లో బరిలోకి దిగుతాడు కూడా. ఇంతకీ మిత్రులుగా ఉన్న కాళి-సాట్టాపులి ఎందుకు శత్రువులయ్యారు.. కాళి ఎందుకు ఊరు విడిచి వెళ్లాడు.. తిరిగొచ్చాక మళ్లీ ఎందుకు పోటీల్లోకి దిగాడు.. అతను మళ్లీ గెలిచి ఊరిలో తన ఆధిపత్యాన్ని చాటాడా.. అన్న ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ: స్పోర్ట్స్ డ్రామాలను సరిగ్గా తీస్తే ప్రేక్షకుల భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లి అద్భుతమైన అనుభూతిని పంచుతాయి. ఇందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలున్నాయి. ఈ జానర్ సినిమాలకు నేపథ్యంగా ఎంచుకునే ఆట ఏదైనా కావచ్చు.. ఆసక్తికర సన్నివేశాలతో ముందు ప్రేక్షకులకు ఆ గేమ్ పట్ల క్యూరియాసిటీ కలిగేలా చేయాలి. ఆటలో మలుపులను తెర మీద రసవత్తరంగా ప్రెజెంట్ చేయగలగాలి. అలాగే ఆ ఆట కోసం హీరో-విలన్ తలపడుతుంటే.. దాని వెనుక ఒక బలమైన ఎమోషన్ ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ కుదిరితేనే స్పోర్ట్స్ డ్రామాలు బాగా పండుతాయి. ‘మండాడి’ సినిమాలో తెరచాప పడవ పోటీల నేపథ్యాన్ని ఎంచుకోవడం ద్వారా ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచడానికి చూసింది టీం. ఐతే ఆట కొత్తదే తప్ప ఇందులో కథాకథనాలు మాత్రం పాత చింతకాయపచ్చడిలాగే తయారయ్యాయి. ఇక ఆటకు సంబంధించిన సన్నివేశాలు అక్కడక్కడా కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించాయే తప్ప.. ప్రేక్షకుల్లో ఎక్కడా క్యూరియాసిటీ కలిగించేలా.. ఉత్కంఠ రేకెత్తించేలా మాత్రం రూపొందలేదు. మందగమనంతో సాగే ‘మండాడి’ చాలా వరకు ప్రేక్షకుల సహనానికి పరీక్షగానే నిలుస్తుంది.

ఒక రసవత్తర స్పోర్ట్స్ డ్రామాగా రూపొందడానికి అవసరమైన మసాలా ఉన్న సినిమానే ‘మండాడి’. కథ పరంగా ఇది బాగానే అనిపిస్తుంది. ఒకరి కోసం ఒకరు నిలబడే ఇద్దరు మిత్రులు.. ఇద్దరికీ ఒక ఆటలో గొప్ప నైపుణ్యం ఉంటుంది.. కానీ అందులో ఒక మిత్రుడు చేసిన ద్రోహం వల్ల సర్వం కోల్పోయి తన ఊరికి.. అలాగే తనకెంతో ఇష్టమైన ఆటకు కూడా దూరమైన ఇంకో మిత్రుడు.. చాలా ఏళ్ల తర్వాత ఆ ఆటలోకి రీఎంట్రీ ఇచ్చి ఛాంపియన్ గా నిలిచే కథ ఇది. స్పోర్ట్స్ డ్రామాలు చాలా వాటిలో ఉండే లైనేే ఇది. ఐతే దీనికి తెరచాపల పోటీలను నేపథ్యంగా తీసుకోవడం.. తీర ప్రాంతంలోని ఒక ఊరిలో జరిగే రాజకీయాలు-ఆధిపత్య పోరు లాంటి అంశాలను జోడించడం ద్వారా ముడిసరుకును బాగానే సిద్ధం చేసుకున్నాడు ‘మండాడి’ దర్శకుడు. కానీ నరేషన్ ఓల్డ్ స్టయిల్లో ఉండడంతో ఎక్కడా ఒక కొత్త సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలగదు. దీనికి తోడు కథలో ఏది ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని కూడా సరిగా చూపించలేకపోయాడు. హీరో 20 ఏళ్లు ఊరికి దూరం కావడానికి బలమైన కారణమే కనిపిస్తుంది కానీ.. అతను తిరిగి ఎందుకు వచ్చాడు.. పోటీలో ఎందుకు దిగాడు అన్నదానికి సరైన రీజన్స్ చూపించలేకపోయారు. అసలు తెరచాప పడవల ఉద్దేశమేంటి.. ఊరిలో వాటికి ఉన్న ప్రాధాన్యం ఏంటి.. ఆ పోటీలకు సన్నద్ధత ఎలా ఉంటుంది.. అందులో ఎలా నైపుణ్యం సంపాదిస్తారు అన్నది సరిగా చూపించలేకపోయారు. ఈ కథను మొదలుపెట్టిన తీరే చాలా సాధారణంగా అనిపిస్తుంది. హీరో ఊరిలోకి రీఎంట్రీ ఇచ్చాక ఇక్కడ అతడికి ఎదురయ్యే అనుభవాలేవీ అంత ఆసక్తికరంగా అనిపించవు. ఇంటర్వెల్ వరకు అసలు కథే పెద్దగా ముందుకు కదలదు. ప్రథమార్ధంలో ఏమాత్రం డ్రామా పండకపోవడంతో ‘మండాడి’ సహనానికి పరీక్షగా నిలుస్తుంది.

ఐతే హీరో ఫ్లాష్ బ్యాక్ దగ్గర్నుంచే ‘మండాడి’లో కదలిక వస్తుంది. ఇద్దరు మిత్రుల మధ్య ఎందుకు శత్రుత్వం వచ్చింది.. హీరో ఎందుకు ఊరు వదిలి వెళ్లిపోయాడు అన్నదాని మీద డ్రామాను బాగానే నడిపించారు. మంచివాడిగా మొదలయ్యే సుహాస్ పాత్ర ఉన్నట్లుండి ఎందుకు నెగెటివ్ టర్న్ తీసుకుంటుందన్నదానికి సరైన కారణం చూపించలేదు కానీ.. ఆ పాత్ర అలా మారాక ‘మండాడి’లో డ్రామా రక్తికట్టింది. సత్యరాజ్ పాత్రను కూడా ఫ్లాష్ బ్యాక్ లో బాగా ఉపయోగించుకున్నారు. ముప్పావుగంట పాటు సాగే ఫ్లాష్ బ్యాక్ తో గాడినపడ్డ ‘మండాడి’లో తర్వాత తెరచాప పోటీలతోనూ ఓ మోస్తరుగా ఎంగేజ్ చేస్తుంది. కానీ సముద్ర నేపథ్యంలో ఎంతో కష్టపడి తీసిన ఈ పోటీల సన్నివేశాల నుంచి ఇంకా ఎక్కువ మజాను ఆశిస్తాం. ఇటు పోటీలు కానీ.. అటు రన్నింగ్ కామెంట్రీ కానీ అనుకున్నంత కిక్కు ఇవ్వలేకపోయాయి. ఈ సన్నివేశాలు కట్టిపడేసేలా లేవు. అలా అని తీసిపడేసేలా కూడా ఉండవు. చాలా బోరింగ్ గా.. నెమ్మదిగా సాగే ప్రథమార్ధంతో పోలిస్తే ‘మండాడి’ సెకండాఫ్ చాలా బెటర్ అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ డ్రామా.. చివర్లో వచ్చే పడవ పోటీల సన్నివేశాలతో ద్వితీయార్ధం ఒక మోస్తరుగా ఎంగేజ్ చేస్తుంది. అంతే తప్ప ఒక స్పోర్ట్స్ డ్రామా నుంచి ఆశించే హై అయితే ఈ సినిమా ఇవ్వదు. పెర్ఫామెన్సులు.. కొన్ని సీన్ల కోసం ఒక లుక్కేయొచ్చు కానీ.. అంచనాలు తక్కువ పెట్టుకుంటే అంత మంచిది.

నటీనటులు: కాళి పాత్రలో సూరి చాలా సహజంగా నటించాడు. నిజంగా ఒక తీర ప్రాంతంలో జాలరి ఎలా ఉంటాడో అలా ఆ పాత్రలో అతను ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్లలో తన అనుభవాన్ని చూపించాడు సూరి. కొన్ని సీన్లలో తన నటన కదిలిస్తుంది. విలన్ పాత్రలో సుహాస్ అదరగొట్టాడు. ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని సీన్లలో సుహాస్ బలమైన ముద్ర వేశాడు. మిడిలేజ్డ్ పాత్రలో తన లుక్.. బాడీ లాంగ్వేజ్ అన్నీ బాగున్నాయి. నెగెటివ్ షేడ్స్ ను బాగా పండించాడు. హీరోయిన్ మహిమ నంబియార్ నటన పరంగా సినిమాలో మరో ఆకర్షణగా నిలిచింది. ఆమె లుక్ కూడా బాగా కుదిరింది. నటన సహజంగా సాగింది. రవీంద్ర విజయ్ ఓ ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నాడు. మిథున్ జై శంకర్ పర్వాలేదు. మిగతా ఆర్టిస్టులు ఓకే.

సాంకేతిక వర్గం: ‘మండాడి’కి సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. జి.వి.ప్రకాష్ కుమార్ పాటల్లో చెప్పుకోదగ్గవేమీ లేవు కానీ.. నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. మ్యూజిక్ పూర్తిగా తమిళ స్టయిల్లో సాగడం మాత్రం మన వాళ్లకు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. కదిర్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. సముద్ర నేపథ్యంలో సన్నివేశాల కోసం టీం పడ్డ కష్టం తెరపైన కనిపిస్తుంది. సుడిగుండం ఎపిసోడ్ మినహా అంతా సహజంగా అనిపిస్తుంది. వీఎఫెక్స్ పర్వాలేదు. రైటర్ కమ్ డైరెక్టర్ మదిమారన్.. ఎంచుకున్న కథలో విషయం ఉంది. తెరచాప పడవ పోటీల నేపథ్యం తీసుకోవడం బాగుంది. కానీ ఓల్డ్ స్టైల్లో.. చాలా స్లోగా సాగే నరేషన్ వల్ల సినిమా పరిధి తగ్గిపోయింది. ఈ కథకు రేసీ స్క్రీన్ ప్లే తోడై ఉంటే ప్రత్యేకమైన సినిమాగా తయారయ్యేదే. మదిమారన్ కథనంలో ఆ నైపుణ్యాన్ని చూపించలేకపోయాడు. దర్శకుడు అక్కడక్కడా మెరుపులు చూపించినా.. కన్సిస్టెన్సీ లేకపోయింది.

చివరగా: మండాడి.. నీటి మీద సోసో ఆట

రేటింగ్ - 2.25/5



Full View


Tags:    

Similar News