మంచు మ‌నోజ్‌కు రామ్ చ‌ర‌ణ్ ఓకే చెబుతాడా?

ఒక‌ప్పుడు టాలీవుడ్ బిజీ హీరోల్లో ఒక‌డిగా ఉండేవాడు మంచు మ‌నోజ్. అప్పుడప్పుడు హిట్లు కూడా కొడుతుండేవాడు.;

Update: 2025-12-15 17:44 GMT

ఒక‌ప్పుడు టాలీవుడ్ బిజీ హీరోల్లో ఒక‌డిగా ఉండేవాడు మంచు మ‌నోజ్. అప్పుడప్పుడు హిట్లు కూడా కొడుతుండేవాడు. మంచు కుటుంబంలో అత్య‌ధిక స‌క్సెస్‌లు సాధించింది కూడా అత‌నే. కానీ ఉన్న‌ట్లుండి త‌న కెరీర్లో బాగా గ్యాప్ వ‌చ్చేసింది. వ‌రుస ఫ్లాపులు, వ్య‌క్తిగ‌త జీవితంలో ఒడుదొడుకుల వ‌ల్ల ఐదారేళ్ల‌ పాటు త‌న నుంచి సినిమానే రాలేదు. అస‌లు సినిమాల్లో న‌టించ‌కుండా ఇండ‌స్ట్రీకే దూరం అయిపోయిన‌ట్లు క‌నిపించాడు. కానీ గ‌త ఏడాది అత‌ను మ‌ళ్లీ ముఖానికి రంగేసుకున్నాడు. ఈ ఏడాది మ‌నోజ్ సినిమాలు రెండు రిలీజ‌య్యాయి. త‌న రీఎంట్రీ మూవీ భైర‌వం ఫ్లాప్ అయిన‌ప్ప‌టికీ.. మిరాయ్ మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఈ రెండు చిత్రాల్లోనూ అత‌ను చేసింది విల‌న్ పాత్ర‌లే కావ‌డం విశేషం. ముఖ్యంగా మిరాయ్‌లో ఫుల్ లెంగ్త్ నెగెటివ్ రోల్ చేసి మెప్పించాడు. దీంతో టాలీవుడ్‌కు స‌రైన విలన్ దొరికాడ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అలా అని మ‌నోజ్ నెగెటివ్ రోల్స్‌కే ప‌రిమితం కావ‌ట్లేదు.

డేవిడ్ రెడ్డి పేరుతో హీరోగా ఒక సినిమాను మ‌నోజ్ అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఇంకా ఈ మూవీ షూటింగ్ మొద‌లు కాలేదు. త్వ‌ర‌లోనే సెట్స్ మీదికి వెళ్ల‌నున్న ఈ చిత్రంలో రెండు స్పెష‌ల్ క్యామియో రోల్స్ ఉన్నాయ‌ట‌. అందులో ఒక‌టి మంచు మ‌నోజ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన‌ త‌మిళ స్టార్ హీరో శింబు చేయ‌నున్నాడ‌ట‌. ఇంకో పాత్ర కోసం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ను అడుగుతున్న‌ట్లు స‌మాచారం. చ‌ర‌ణ్‌తో మ‌నోజ్‌కు మంచి స్నేహ‌మే ఉంది. కానీ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్‌గా ఎదిగిన చ‌ర‌ణ్‌.. కెరీర్లో ఈ ద‌శ‌లో మ‌నోజ్ సినిమాలో క్యామియో రోల్ చేస్తాడా అన్న‌ది సందేహం. పాత్ర చాలా బాగుంటే, త‌న ఇమేజ్‌ను దెబ్బ తీయ‌ద‌నుకుంటే.. మ‌నోజ్ కెరీర్‌కు ఈ సినిమా బాగా ఉప‌యోగ‌ప‌డుతుందంటే ఆలోచించ‌వ‌చ్చు. డేవిడ్ రెడ్డి ఒక పీరియ‌డ్ ఫిలిం. ఇది బ్రిటిష్ వాళ్ల మీద పోరాడిన ఒక యోధుడి కథ ఇదట. హనుమరెడ్డి యక్కంటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొంద‌నున్న ఈ చిత్రానికి పేరున్న టెక్నీషియ‌న్లు ప‌ని చేయ‌నున్నారు.

Tags:    

Similar News