పెద్దాయ‌నే మ‌నోజ్‌ని పిలిపించుకుని.. దాస‌రి ఘాట్‌పై భూమా మౌనిక వ్యాఖ్య‌లు!

దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న డా.దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి ఆయన ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించిన సంగ‌తి తెలిసిందే.

Update: 2026-05-31 04:30 GMT

దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న డా.దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి ఆయన ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించిన సంగ‌తి తెలిసిందే. అయితే పిచ్చి తుప్ప‌లతో చెత్త పేరుకుపోయిన `దాసరి ఘాట్` దుస్థితిపై ప‌లు మీడియాల్లో వెలువ‌డిన క‌థ‌నాలు చూసాక అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ వీడియోల‌పై మనోజ్ తక్షణమే స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే, కార్మిక సిబ్బంది - జెసీబీ సహాయంతో స్వయంగా ఘాట్ వద్దకు చేరుకుని పరిశుభ్రత కార్యక్రమాలను ప్రారంభించి గురువు గారిపై తనకున్న అపారమైన గౌరవాన్ని, భ‌క్తిని చాటుకున్నారు.

ఈ సందర్భంగా మనోజ్ మంచు మాట్లాడుతూ- ''దాసరి నారాయణరావు గారు తనకు తండ్రి సమానులని.. ఒక గొప్ప డైరెక్టర్, యాక్టర్, స్క్రీన్ ప్లే రైటర్ , ఎడిటర్‌గా 24 శాఖలపై పట్టు సాధించిన ఇన్‌స్టిట్యూషన్'' అని కొనియాడారు. ఆయన దర్శకత్వంలో నా మొగుడు నాకే సొంతం, పుణ్యభూమి నాదేశం చిత్రాలలో నటించే భాగ్యం తనకు దక్కిందని గుర్తుచేసుకున్నారు. తనకు సినీ క్రాఫ్ట్ మీద ఇంత ప్రాణం ఉందంటే దానికి కారణం తన తండ్రి మోహన్ బాబుతో పాటు దాసరి గారేనని.. సినిమా ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా ఆయన ఒక సమాధానంగా నిలిచారని మనోజ్ గుర్తు చేసుకున్నారు.

పరిశ్రమలో పురుషాధిక్యత ఉన్న సమయంలోనే విజయశాంతితో `ఒసేయ్ రాములమ్మ` వంటి సామాజిక సందేశంతో కూడుకున్న చిత్రం తీసి దాసరి ప్రతి హీరోకి భయం పుట్టించారని మనోజ్ పేర్కొన్నారు. ప్రస్తుత థియేటర్ల సమస్యలకు ఆయన ఎప్పుడో మార్గం చూపించారని... థియేటర్లకు జనాలు వచ్చే అలవాటు తప్పకూడదనే ఉద్దేశంతో ఆయన ఏడాదికి 10-15 సినిమాలు చేస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పించారని తెలిపారు. ఈ ఏడాది తిథి ప్రకారం జూన్ 20న వర్ధంతి వస్తున్నందున కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారని...ఇందులో ఎవరినీ తప్పుపట్టలేమని చెబుతూ.. భవిష్యత్తులో ఈ ఘాట్‌ను చుట్టుపక్కల పిల్లలు ఆడుకునేలా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

మనోజ్ భార్య భూమా మౌనిక మంచు మాట్లాడుతూ... సినిమాల్లో సామాజిక సందేశాలను ఇస్తూ అసమానతలపై గొంతెత్తిన దాసరి గారు ఇండస్ట్రీకే కాక ప్ర‌జ‌ల కోసం కూడా ఎంతో సేవ చేశారని అన్నారు. మనోజ్‌కు ఆయనెంతో ఇన్‌స్పిరేషన్ అని...ప్రతి సందర్భంలోనూ ఆయన్ను గుర్తు చేసుకుంటూ ఉంటారని తెలిపారు. పెద్దాయనే స్వయంగా మనోజ్‌ను పిలిపించుకుని ఈ పవిత్రమైన ప‌ని చేయించుకున్నారని భావిస్తున్నామని.. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవడం తమ బాధ్యత అని మౌనిక పేర్కొన్నారు.

Tags:    

Similar News