2026లో కంబ్యాక్ ఇచ్చిన హీరోలు!

బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిర‌గ‌రాసి త‌మ స్టార్ పవర్‌ను మరోసారి నిరూపించుకుని అభిమానులకు పండగ వాతావరణాన్ని అందించారు.

Update: 2026-07-15 13:30 GMT

2026వ సంవత్సరం కొంత‌మంది స్టార్ల‌కు ప్ర‌త్యేకంగా గుర్తిండి పోయే ఏడాది కానుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. కొంతకాలంగా వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డ కొంత మంది అగ్రనటులు ఈ ఏడాది అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిర‌గ‌రాసి త‌మ స్టార్ పవర్‌ను మరోసారి నిరూపించుకుని అభిమానులకు పండగ వాతావరణాన్ని అందించారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఈ ఏడాది ప్రత్యేకమైన మలుపుగా మారింది. 'భోళా శంకర్' ప్లాప్ తర్వాత కొంతకాలం విరామం తీసుకున్నప్పటికీ 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ కావడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను సాధించి చిరంజీవి సత్తాను చాటి చెప్పింది. దీంతో సీనియ‌ర్ స్టార్స్ లో మెగాస్టార్ నెంబ‌ర్ వ‌న్ గా నిలిచారు. ఇప్పుడా రికార్డులు చిరంజీవి స‌మ‌కాలీకుల్లో ఎవ‌రు బ్రేక్ చేస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. రామ్ చరణ్ విషయానికి వస్తే ఆయన కెరీర్‌లో 'పెద్ది' చిత్రం మైలురాయిగా నిలిచింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ చేసిన ఈ ప్రయోగం ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను పొందింది. ఈ సినిమా దక్షిణాదిన అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచి.. చరణ్‌ను బాక్సాఫీస్ ఛాంపియన్‌గా నిలబెట్టింది.

కఠినమైన శిక్షణతో చ‌ర‌ణ్ పోషించిన పాత్ర అభిమానులను అమితంగా అలరించింది. 'గేమ్ ఛేంజ‌ర్' త‌ర్వాత చ‌ర‌ణ్ ఖాతాలో ప‌డిన హిట్ చిత్ర‌మిది. యువ హీరోల విషయానికి వస్తే అఖిల్ అక్కినేని ఈ ఏడాది 'లెనిన్' చిత్రంతో భారీ కమర్షియల్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ సాధించడంతో అఖిల్ కెరీర్‌లో కీలక విజయంగా మారింది. కథా ఎంపికలో అఖిల్ జాగ్రత్తలు ఈ చిత్రంతో పండాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 'ఏజెంట్' ప్లాప్ త‌ర్వాత అఖ‌ల్ కి ద‌క్కిన విజ‌య‌మిది.

అలాగే శర్వానంద్ కెరీర్‌ను మళ్ళీ గాడిలో పెట్టారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన 'నారీ నారీ నడుమ మురారి' చిత్రంతో బాక్సా ఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. కుటుంబ కథా చిత్రాలకు .. కామెడీకి పెట్టింది పేరైన శర్వానంద్ ఈ విజయంతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చారు. ఈ ఏడాది విడుదలైన చిత్రాలు మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నాయి. చివ‌రిగా 2026లో తెలుగు హీరోలు పాత పద్ధతులకు స్వస్తి పలికి కొత్త రకమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం విశేషం. సీనియర్లు తమ అనుభవంతో, జూనియర్లు తమ ఉత్సాహంతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం పరిశ్రమకు మంచి పరిణామం. రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన చిత్రాలతో ఈ స్టార్ హీరోలు ప్రేక్షకులను అలరిస్తారని అభిమానులు ఆశీస్తున్నారు.

Tags:    

Similar News