మనోజ్ ముందు జాగ్రత్త.. ఆ హీరోల ఎఫెక్ట్ పడిందా?

మంచు మోహన్ బాబు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టిన మనోజ్ హీరోగా సత్తా చాటి.. వ్యక్తిగత కారణాలవల్ల తొమ్మిదేళ్లు ఇండస్ట్రీకి దూరమయ్యారు..;

Update: 2025-11-04 19:30 GMT

మంచు మనోజ్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా అటు అభిమానులతోనే కాదు ఇటు సినీ సెలబ్రిటీలతో కూడా మంచి సత్సంబంధాలు కొనసాగిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. మంచు మోహన్ బాబు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టిన మనోజ్ హీరోగా సత్తా చాటి.. వ్యక్తిగత కారణాలవల్ల తొమ్మిదేళ్లు ఇండస్ట్రీకి దూరమయ్యారు.. ఇటీవలే మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. అందులో భాగంగానే భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదు అనిపించకున్న మనోజ్.. ఆ తర్వాత వచ్చిన మిరాయ్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసారు.

కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా తొలి ప్రయత్నంలో చేసిన చిత్రం మిరాయ్. తేజ సజ్జ హీరోగా, రితిక నాయక్ హీరోయిన్ గా .. జగపతిబాబు, శ్రియశరణ్ , గెటప్ శ్రీను తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ తెరకెక్కిన చిత్రం ఇది. సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా వందకోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది. జియో హాట్ స్టార్ వేదికగా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతూ.. మంచి రేటింగ్ అందుకుంటుంది. ఇందులో విలన్ పాత్ర పోషించి అందరిని అబ్బురపరిచారు మంచు మనోజ్. హీరోగా కంటే విలన్ పాత్రకి ఎక్కువ క్రేజ్ లభించింది.

అలా ఈ మిరాయ్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న మనోజ్ కి.. ఇప్పుడు బాలీవుడ్ నుండి వరుసగా అవకాశాలుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అవకాశాలను మనోజ్ సున్నితంగా తిరస్కరిస్తూ తెలుగులోనే సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. అంతేకాదు బాలీవుడ్ సినిమాలను తిరస్కరించి ఇప్పుడు ఒక టాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. మనోజ్ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి అని చెప్పవచ్చు.

వాస్తవానికి ఎవరైనా సరే బాలీవుడ్లో అవకాశాలు వచ్చాయి అంటే కచ్చితంగా రిజెక్ట్ చేయరు. పైగా బాలీవుడ్లో అవకాశం కోసం ఎదురుచూస్తారు కూడా.. అలాంటి బాలీవుడ్ నుంచి స్వయంగా అవకాశాలు తలుపు తట్టినా.. మంచు మనోజ్ మాత్రం తిరస్కరించడంతో పలు రకాల కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. గతంలో చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా బడా స్టార్ హీరోలు అంతా కూడా బాలీవుడ్ లో సినిమాలు చేసి డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు. అందుకే ఆ హీరోల చిత్రాల ఫలితాల ప్రభావం ఇప్పుడు మంచు మనోజ్ పై భారీ ప్రభావాన్ని చూపించిందని.. అందుకే ముందు జాగ్రత్తగా మేల్కొని బాలీవుడ్ చిత్రాలకు అంగీకరించడం లేదు అంటూ కొంతమంది నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మంచు మనోజ్ ఇప్పుడు బాలీవుడ్ అవకాశాలను తిరస్కరిస్తూ టాలీవుడ్ లోనే సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

మంచు మనోజ్ నటిస్తున్న చిత్రాల విషయానికి వస్తే.. అహం బ్రహ్మాస్మి.. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ఇది. 2025 డిసెంబర్ 20న విడుదల కాబోతోంది.అలాగే వాట్ ది ఫిష్.. వరుణ్ కొరుకుంద దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో పాటు నూతన దర్శకుడు నవీన్ కొల్లి దర్శకత్వం వహిస్తున్న రక్షక్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ సీరిస్ గా రూపుదిద్దుకుంటున్న బ్లాక్ స్వోర్డ్ లో మనోజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

Tags:    

Similar News