కంటెంట్ తో కొడుతున్న మలయాళం సినిమాలు.. ఇది కదా రికార్డ్ అంటే..
2025లో మలయాళం సినిమా ఇండస్ట్రీ గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ఒక కొత్త చరిత్ర రాసుకుంటోంది.;
2025లో మలయాళం సినిమా ఇండస్ట్రీ గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ఒక కొత్త చరిత్ర రాసుకుంటోంది. మొన్నటివరకు ఒక్క మలయాళం సినిమాకి కూడా దక్కని రికార్డులను ఈ ఏడాది వరుసగా మూడు చిత్రాలు అందుకోవడం విశేషం. మోహన్‌లాల్, దుల్కర్ సల్మాన్, కల్యాణి ప్రియదర్శన్ సినిమాలు కలిసి ఒక కొత్త రికార్డ్ సృష్టించాయి.
లేటెస్ట్ గా విడుదలైన లోకా చాప్టర్ 1 కేవలం 11 రోజుల్లోనే ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర 10 మిలియన్ డాలర్లు (₹91 కోట్లు) దాటేసింది. దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో, డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సూపర్ హీరో డ్రామా అద్భుతమైన విజువల్స్, మైథాలజికల్ టచ్, కల్యాణి ప్రియదర్శన్ పెర్ఫెమెన్స్ తో గ్లోబల్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది.
ఇప్పటివరకు ఈ రేంజ్‌లో మలయాళం సినిమా రికార్డులు అందుకోవడం జరగలేదు, కానీ ఈ ఏడాదిలో మాత్రం వరుసగా మూడు సినిమాలు 10 మిలియన్ క్లబ్‌లో చేరాయి. మోహన్‌లాల్ ఎంపురాన్ 13.75 మిలియన్ డాలర్లు (రూ.124.5 కోట్లు), తుదరమ్ 10.50 మిలియన్ డాలర్లు(రూ.94 కోట్లు) వసూలు చేశాయి. ఇప్పుడు లోకా 10.30 మిలియన్ డాలర్లు (రూ.91 కోట్లు) వసూలు చేసి ఆ జాబితాలో చేరింది.
ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే లోకా కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అంత తక్కువ ఖర్చుతో ఇంత భారీ స్థాయిలో వసూళ్లు సాధించడం ఇండియన్ సినిమాల్లోనే ఒక అరుదైన విషయమని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 11 రోజుల్లోనే 185 కోట్ల గ్రాస్ సాధించింది. రాబోయే కొన్ని రోజుల్లోనే 200 కోట్ల మార్క్ దాటడం ఖాయం అని ట్రేడ్ టాక్.
ట్రేడ్ నిపుణుల అంచనా ప్రకారం, లోకా 300 కోట్ల గ్రాస్ వరకు చేరే అవకాశముంది. అలాంటప్పుడు మోహన్‌లాల్ రికార్డులు మాత్రమే కాదు, మలయాళం సినిమాకు కొత్త గ్లోబల్ బెంచ్‌మార్క్ సెట్ అవుతుంది. ఒకవైపు కంటెంట్ ఆధారంగా, మరోవైపు స్టార్ పవర్ లేకుండా కూడా సినిమాలు సక్సెస్ అవుతాయనే నిజానికి లోకా పెద్ద నిదర్శనం. మొత్తం మీద, 2025 మలయాళం సినిమాకు గోల్డెన్ ఇయర్‌గా మారింది. వరుసగా వచ్చిన ఎంపురాన్, తుదరమ్, లోకా లాంటి భారీ బ్లాక్‌బస్టర్స్ ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా, ఇండియన్ సినిమాకు కూడా గర్వకారణమని చెప్పాలి. ఇక లోకా రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.