రాక్ స్టార్ డైరెక్టర్ కొత్త సినిమా.. వర్కౌట్ అయిందా?
బాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ మైన్ వాపస్ ఆవుంగా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.
బాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ మైన్ వాపస్ ఆవుంగా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. నసీరుద్దీన్ షా, దిల్జీత్ దోసాంజ్, వేదాంగ్ రైనా, శార్వరి లాంటి స్టార్ కాస్ట్ నటించిన ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. దేశ విభజన నాటి పరిస్థితులను బేస్ చేసుకుని తీసిన ఈ పీరియాడిక్ ఎమోషనల్ డ్రామా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను గట్టిగానే పంచుకుంటున్నారు.
థియేటర్ల నుంచి వస్తున్న టాక్ ప్రకారం చూస్తే, ఈ సినిమా కథ మొత్తం 95 ఏళ్ల వృద్ధుడైన ఒక సిక్కు పెద్దాయన చుట్టూ తిరుగుతుంది. మంచాన పడిన ఆ పెద్దాయన తన గతాన్ని గుర్తు చేసుకుంటూ చేసే ప్రయాణం ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తోందని నెటిజన్లు చెబుతున్నారు. ముఖ్యంగా 1947 దేశ విభజన కంటే ముందు నాటి పంజాబ్ వాతావరణం, ఆ కాలంలో కీను అలానే అఫ్సానా మధ్య సాగే క్యూట్ లవ్ స్టోరీ ఈ జనరేషన్ కు కూడా బాగా రీచ్ అయ్యేలా తీశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో ప్రధానంగా వినిపిస్తున్న మాటలు ఇవే.. ఈ సినిమాలో వృద్ధుడి పాత్రలో నసీరుద్దీన్ షా నటన అద్భుతంగా ఉందని, ఆయన తన కళ్లతోనే ఎమోషన్ పండించారని ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు. లండన్ లో ఉండే ఎన్ఆర్ఐ మనవడిగా దిల్జీత్ దోసాంజ్ యాక్టింగ్ చాలా నేచురల్ గా ఉందని చెబుతున్నారు. ఇక యంగ్ ఏజ్ లో ఉండే కీను పాత్రలో వేదాంగ్ రైనా, అతనికి జోడీగా అఫ్సానా క్యారెక్టర్ లో శార్వరి తమ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
టెక్నికల్ గా చూసుకుంటే ఇంతియాజ్ అలీ తన పాత సినిమాల్లోని ఫ్లేవర్ ను ఈ సినిమాలో కూడా చాలా చోట్ల రిపీట్ చేశారని కొందరు చెబుతున్నారు. గతంలో తను తీసిన రాక్ స్టార్, తమాషా, జబ్ వియ్ మెట్ లాంటి సినిమాల్లోని మ్యాజిక్ ఈ కథలో కూడా కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. వీటికి తోడు ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ అయిందని, పాటలు వేరే లెవెల్ లో ఉన్నాయని మ్యూజిక్ లవర్స్ కామెంట్ చేస్తున్నారు.
అయితే పాజిటివ్ టాక్ తో పాటే కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మనవడి క్యారెక్టర్ కు సంబంధించిన స్టాండప్ కామెడీ ట్రాక్ మెయిన్ కథకు పెద్దగా సింక్ అవ్వలేదని కొందరు పెదవి విరుస్తున్నారు. అలానే బనితా సంధు క్యారెక్టర్ కాస్టింగ్ కూడా అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా కాకుండా ఒక డీప్ ఎమోషనల్ జర్నీలా సాగుతుందని చెబుతున్నారు.