ది ఒడిస్సి తర్వాత ఆ రికార్డు వారణాసి కే!
టాలీవుడ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ 'వారణాసి' గురించి ఓ అద్భుతమైన వార్త బయటకు వచ్చింది.
టాలీవుడ్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ 'వారణాసి' గురించి ఓ అద్భుతమైన వార్త బయటకు వచ్చింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ చిత్రం టెక్నికల్ పరంగా హాలీవుడ్ స్థాయిని తలపించేలా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా గురించి రాజమౌళి స్వయంగా వెల్లడించిన ఓ విశేషం ఇప్పుడు గ్లోబల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
ఈ చిత్రానికి సంబంధించిన టెక్నికల్ హైలైట్‌ను వివరిస్తూ హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన `ది ఒడిస్సీ` తర్వాత ప్రపంచంలోనే పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో షూట్ చేస్తోన్న రెండవ చిత్రంగా 'వారణాసి' చరిత్ర సృష్టిస్తోందని రాజమౌళి తెలిపారు. ఇప్పటి వరకు భారతీయ సినిమాల్లో ఏ చిత్రానికీ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించడం ద్వారా రాజమౌళి మరోసారి ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్తున్నారని ట్రేడ్ వర్గాలు కొనియాడుతున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోందని.. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయినట్లు రాజమౌళి స్పష్టం చేశారు. మిగిలిన 20 శాతం షూటింగ్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే మొత్తం చిత్రీకరణ పూర్తి కానుందని వెల్లడించారు. ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.
మహేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సాహసోపేత ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. `ఆర్ఆర్ఆర్` వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ఈ సినిమాను అనుభవించడం ప్రేక్షకులకు ఒక విజువల్ వండర్‌గా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
టెక్నికల్ పరంగానే కాకుండా కథాంశం పరంగా కూడా 'వారణాసి' సరికొత్త అనుభూతిని పంచనుందని సమాచారం. భారతీయ పౌరాణిక మూలాలను ఆధునిక హంగులతో మిళితం చేస్తూ రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ లుక్ .. ఆయన పాత్ర తీరు ఇప్పటి వరకు ఎవరూ చూడని విధంగా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి ఇండియన్ సినిమా గర్వించదగ్గ రీతిలో గ్లోబల్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రాజమౌళి మరో అద్భుతానికి శ్రీకారం చుట్టారు. క్రిస్టోఫర్ నోలన్ లాంటి గ్లోబల్ లెజెండరీ డైరెక్టర్ సరసన భారతీయ దర్శకుడిగా రాజమౌళి నిలవడం తెలుగు పరిశ్రమకు దక్కిన గొప్ప గౌరవం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.