మహేష్- జక్కన్న మూవీ.. హాలీవుడ్ దర్శకుడితో ఇలా..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రపంచాన్ని చుట్టేసే సాహస యాత్రికుడి కథతో సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో ఉండనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అదే సమయంలో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
అయితే తన మునుపటి చిత్రాల మాదిరిగా కాకుండా రాజమౌళి ఈసారి మహేష్ ప్రాజెక్ట్ ను పూర్తిగా గోప్యంగా ఉంచారు. అధికారిక ప్రకటనలు లేవు, ప్రెస్ మీట్లు లేవు, అధికారిక లాంఛ్ అప్డేట్ లేదు. పూజా కార్యక్రమాల ఫోటో కూడా బయటకు రాకుండా చూసుకున్నారు. కానీ షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్నారు జక్కన్న.
ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి ఫస్ట్ లుక్ లేదా టైటిల్ ను రివీల్ చేస్తారని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అది జరగలేదు. కేవలం ప్రీ లుక్ విడుదల చేశారు. మహేష్ బాబు ఫస్ట్ లుక్ నవంబర్ 2025లో వస్తుందని రాజమౌళి ప్రకటించారు. దీంతో అంతా సూపర్ స్టార్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు.
అయితే నవంబర్ లో మహేష్ ఫస్ట్ లుక్ రిలీజ్ వెనుక పెద్ద ప్లానే ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 19వ తేదీన అవతార్: ది ఫైర్ అండ్ యాష్ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వనున్న విషయం తెలిసిందే. దీంతో జేమ్స్ కామెరూన్ ప్రమోషన్స్ లో భాగంగా నవంబర్ లో ఇండియాకు వస్తారని సమాచారం.
అప్పుడు ఆయనతోనే రాజమౌళి.. మహేష్ ఫస్ట్ లుక్ తో పాటు గ్లింప్స్ ను రిలీజ్ చేస్తారని ఇప్పడు టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదు కదా అని చెబుతున్నారు. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజ్ కు సినిమాను తీసుకెళ్తున్నారని అంటున్నారు.
కాగా, గతంలో కామెరూన్.. రాజమౌళి గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రశంసించారు. మీరు ఎప్పుడైనా ఇక్కడ సినిమా తీయాలనుకుంటే మాట్లాడుకుందామని జక్కన్నతో అన్నారు. అప్పట్లో అందుకు సంబంధించిన వీడియో ఫుల్ వైరల్ అయింది.
అయితే ఇప్పుడు కామెరూన్ నిజంగా మహేష్ ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తే, అది తక్షణమే ప్రాజెక్ట్ ను ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తీసుకొస్తుంది. మహేష్ బాబును ఒక భారతీయ స్టార్ గా పరిచయం చేస్తుంది. అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే నవంబర్ లో రాజమౌళి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించవచ్చు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.