Valentine's Day Special: మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ ఎవర్‌గ్రీన్ లవ్ స్టోరీ
తమ ప్రేమ విషయాన్ని చాలా సంవత్సరాల పాటు బయటకు తెలియకుండా జాగ్రత్తగా దాచుకున్నారు.;
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత అందమైన.. ప్రేమ కథలలో మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ ల ప్రేమ కథ ఒకటి. స్టార్‌డమ్, విజయాలు ఉన్నా కూడా చాలా సాధారణంగా, హుందాగా తమ జీవితాన్ని గడుపుతున్న జంటగా వీరు అందరికీ ఆదర్శంగా నిలిచారు.
1990ల కాలంలో ఇద్దరూ తమ తమ కెరీర్‌లలో బిజీగా ఉన్న సమయంలో వీరి పరిచయం జరిగింది. నమ్రత 1993లో మిస్ ఇండియా యూనివర్స్‌గా గెలిచి, తర్వాత హిందీ సినిమాల్లో నటించారు. మహేష్ బాబు మాత్రం హీరోగా తన సినీ ప్రయాణాన్ని వంశీ సినిమాతో ప్రారంభించారు. 2000 సంవత్సరంలో ఒక సినిమా ముహూర్తం సమయంలో వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ ఒక్క పరిచయమే మెల్లగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది.
తమ ప్రేమ విషయాన్ని చాలా సంవత్సరాల పాటు బయటకు తెలియకుండా జాగ్రత్తగా దాచుకున్నారు. మీడియా హడావుడి, ప్రచారం లేకుండా, ప్రశాంతంగా తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్లారు. నాలుగేళ్ల వయస్సు తేడా ఉన్నా కూడా, ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం వల్ల వారి ప్రేమ మరింత బలపడింది. 2004లోనే తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు.
2005 ఫిబ్రవరి 10న ముంబైలో సంప్రదాయ తెలుగు పద్ధతిలో మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల మధ్య చాలా సింపుల్‌గా ఈ పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ జీవితమే తనకు ముఖ్యమని ఆమె భావించారు.
వివాహానంతరం కొంత కష్టకాలం కూడా ఈ జంట ఎదుర్కొంది. కెరీర్ ఒత్తిడులు, వ్యక్తిగత బాధలు వచ్చినా..ఒకరికి ఒకరు అండగా నిలబడి వాటిని దాటుకున్నారు. 2006లో గౌతమ్, 2012లో సితార జన్మించడంతో వారి కుటుంబం మరింత ఆనందంగా మారింది.
ఈ రోజు మహేష్ బాబు విజయాల వెనుక నమ్రత పాత్ర చాలా కీలకమని ఆయన స్వయంగా చెబుతుంటారు. తనను నేలమీద నిలబెట్టే వ్యక్తి నమ్రతేనని మహేష్ పలుమార్లు చెప్పారు. ప్రేమ, నమ్మకం, కుటుంబ విలువలతో సాగుతున్న మహేష్–నమ్రత ప్రేమ కథ నిజంగా ఒక ఎవర్‌గ్రీన్ లవ్ స్టోరీ.