వేదిక ఏదైనా షో స్టాపర్ సితారే
వేదిక ఏదైనా.. షో ఏదైనా అక్కడ ఘట్టమనేని ఫ్యామిలీ ప్రత్యక్షమైతే వేడుకకు కొత్త కళ వచ్చేస్తుంది. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ బాబు కుటుంబం న్యూయార్క్‌లో భారీ ఈవెంట్లో ప్రత్యక్షమైంది;
వేదిక ఏదైనా.. షో ఏదైనా అక్కడ ఘట్టమనేని ఫ్యామిలీ ప్రత్యక్షమైతే వేడుకకు కొత్త కళ వచ్చేస్తుంది. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ బాబు కుటుంబం న్యూయార్క్‌లో భారీ ఈవెంట్లో ప్రత్యక్షమైంది. మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్, వారి పిల్లలు గౌతమ్ ఘట్టమనేని, సితార ఘట్టమనేనితో కలిసి పాప్ స్టార్ లేడీ గాగా కచేరీని ఆస్వాధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగిన ఈ కచేరీలో మహేష్ కుటుంబం ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా, ఈ ఫోటోగ్రాఫ్స్ లో సితార ప్రత్యేకంగా ఆకర్షించింది.
నమ్రత స్టేడియం నుంచి అరుదైన ఫోటోలను షేర్ చేసింది. తన పిల్లలతో కలిసి ఉన్న సెల్ఫీలను కూడా షేర్ చేసారు. అంతేకాదు లేడీ గాగ షోను తాను ఎంతగా ఇష్టపడ్డారో కూడా స్వీట్ నోట్ రాసారు. ``ఒక మాట: అత్యుత్తమ ప్రదర్శన .. లేడీ గాగ మీరు రాక్ స్టార్.. మీ ప్రదర్శనలోని ప్రతి బిట్‌ను నేను ఇష్టపడ్డాను.. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.. ఎక్కువగా ప్రేమిస్తున్నాను`` అంటూ ఎమోషనల్ అయ్యారు.
కచేరీ తర్వాత సితార కెమెరాకు పోజులు ఇచ్చినప్పుడు తన ముఖంలో ఎంతో ఆనందం కనిపించింది. ఇన్ స్టా ఫోటోగ్రాఫ్స్ లో సితార మోములో మెరుపులు ప్రత్యేకంగా కనిపించాయి. నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ ఈ పోస్ట్‌కి ప్రతిస్పందిస్తూ, ``చాలా మజ్జ్జ్జా (సరదా)`` అని రాశారు. తన వ్యాఖ్యకు రెడ్ హార్ట్ ఈమోజీలను కూడా జోడించారు. మహేష్ బాబు అభిమానులు ఆ ఫోటోలకు లైక్ లు కొట్టారు. కుమార్తె సితార అచ్చు గుద్దినట్టు మహేష్‌లా ఉందంటూ ప్రశంసించారు. ఇది పూర్తిగా మహేష్ బాబు పోజు! అని సితార ఫోజ్ గురించి కామెంట్ చేసారు ఒక నెటిజన్. `జిరాక్స్ కాపీ` అని ఒకరు షేర్ చేశారు.
క్రీడలు, పాప్ షోలు, కొత్త సంవత్సర వేడుకలు, ఎగ్జోటిక్ లొకేషన్లలో చిల్లింగ్ ట్రిప్ లు, పార్టీ ఏదైనా కానీ, సితార ప్రత్యక్షమైన ప్రతిచోటా అక్కడ షో స్టాపర్ గా మారుతోంది. ఈ శనివారం నాడు గౌతమ్ - సితారతో కలిసి యుఎస్ ఓపెన్ సెమీఫైనల్స్ చూసిన తర్వాత నమ్రత ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఈ మ్యాచ్ అత్యుత్తమమైనది అంటూ నమ్రత కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసారు. విజేతను అభినందిస్తూ, ఫైనల్ కూడా ఆడాలని నమ్రత ఆకాంక్షించారు. ఇంతలోనే లేడీ గాగా షో నుంచి తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను నమ్రత షేర్ చేయగా అవి వైరల్ గా మారుతున్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబు SSMB 29 షూటింగ్‌లో బిజీగా ఉన్నందున తన కుటుంబంతో పాటు అమెరికాకు వెళ్ళలేకపోయారు. ఈ సంవత్సరం నవంబర్‌లో ఈ భారీ పాన్ వరల్డ్ సినిమాకి సంబంధించిన పెద్ద అప్ డేట్ ని అందిస్తారని తెలుస్తోంది.