మహేష్ బాబు.. చిల్ మోడ్!
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీకి టైమ్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు.;
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఫ్యామిలీకి టైమ్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. లేటెస్ట్ గా ఈ మంగళవారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్స్ హడావిడి లేకుండా చాలా రిలాక్స్డ్ గా మహేష్ కనిపించడం ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది.
ఈ ఫొటోల్లో మహేష్ లుక్ అదిరిపోయింది. ఎప్పటిలాగే వైట్ షర్ట్, జీన్స్, తలపై క్యాప్ తో చాలా సింపుల్ గా, స్టైలిష్ గా కనిపించారు. ఆయన ముఖంలో చిరునవ్వు చూస్తుంటే, ఫ్యామిలీతో గడపడం ఆయనకు ఎంత రిలీఫ్ ఇస్తుందో అర్థమవుతోంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చాలా క్యాజువల్ గా ఈ గ్యాదరింగ్ జరిగింది.
ఈ ఫ్యామిలీ రీయూనియన్ లో మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్, సోదరీమణులు మంజుల ఘట్టమనేని, పద్మావతి ఘట్టమనేని సందడి చేశారు. అలాగే మంజుల భర్త సంజయ్ స్వరూప్, మేనల్లుళ్లు అశోక్ గల్లా, భారతి ఘట్టమనేని కూడా ఇందులో పాల్గొన్నారు. అందరూ కలిసి దిగిన ఫోటోలు చూడముచ్చటగా ఉన్నాయి.
అయితే ఈ ఫుల్ హౌస్ సెలబ్రేషన్ లో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు మాత్రం మిస్ అయ్యారు. వారే మహేష్ పిల్లలు గౌతమ్, సితార. గౌతమ్ ప్రస్తుతం పైచదువుల కోసం అమెరికాలో ఉండటం వల్ల రాలేకపోయాడు. సితార కూడా తన పర్సనల్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ గ్యాదరింగ్ కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరు కూడా ఉండుంటే ఆ సందడి వేరే లెవెల్ లో ఉండేది.
ఇక కెరీర్ విషయానికి వస్తే, మహేష్ బాబు ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' షూటింగ్ లో ఆయన బిజీగా ఉన్నారు. గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ ని పూర్తిగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ గ్లింప్స్ ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ఇక సినిమా షూటింగ్ ని వచ్చే ఏడాది వీలైనంత తొందరగా పూర్తి చేసి 2027 సమ్మర్ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చూస్తున్నారు.