MAA పై దర్శకసంఘం బిగ్ పంచ్!
మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికల్లో ప్రతిసారీ సొంత బిల్డింగ్ నిర్మిస్తామనే ఎజెండాతో అభ్యర్థులు బరిలో దిగుతున్నా కానీ ఎవరూ అలాంటి ప్రయత్నాలు చేసిన పాపాన పోలేదు.
ఐదు దశాబ్ధాల సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది మూవీ ఆర్టిస్టుల సంఘం MAA. సుమారు 1000 మంది ప్రముఖ ఆర్టిస్టులతో ఈ అసోసియేషన్ దేశంలోనే అతి పెద్ద ఆర్టిస్టుల సంఘాలలో ఒకటిగా కొనసాగుతోంది. మూవీ ఆర్టిస్టుల సంఘంలో సభ్యత్వం కావాలంటే భారీ ఫీజుతో పాటు, ప్రతిభను నిరూపించుకున్న ప్రూఫ్‌లు ఉండాలి. అదంతా అటుంచితే సౌతిండియాలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన తెలుగు మూవీ ఆర్టిస్టుల సంఘం గడిచిన 50 ఏళ్ల లో సొంత భవంతిని నిర్మించుకోలేకపోవడం హాస్యాస్పదంగా మారింది. దీనిపై చాలా మంది సెటైర్లు కూడా వేస్తున్నారు. మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికల్లో ప్రతిసారీ సొంత బిల్డింగ్ నిర్మిస్తామనే ఎజెండాతో అభ్యర్థులు బరిలో దిగుతున్నా కానీ ఎవరూ అలాంటి ప్రయత్నాలు చేసిన పాపాన పోలేదు. ప్రయత్నించినా కానీ ఎవరూ సక్సెస్ కాలేదు.
అయితే మూవీ ఆర్టిస్టుల సంఘం భవంతిని నిర్మించేందుకు బాధ్యత వహిస్తానని, దానికి స్వయంగా నిధిని అందిస్తానని ఇంతకుముందు ఎన్నికల పోటీ సమయంలో మంచు విష్ణు హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల తర్వాత మళ్లీ దాని గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం హాస్యాస్పదమైంది. ఓవైపు నడిగర సంఘం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విశాల్ లాంటి నటుడు తమిళ ఆర్టిస్టుల కోసం భవంతిని నిర్మించారు. అయితే ఇప్పటికీ మూవీ ఆర్టిస్టుల సంఘానికి పునాది రాయి పడకపోవడంపై ఆర్టిస్టుల్లోనే బోలెడంత చర్చ సాగుతోంది.
ఇదిలా ఉంటే .. తాజాగా అందిన సమాచారం మేరకు మా అసోసియేషన్ కంటే ముందే దర్శకుల సంఘం తమకంటూ సువిశాలమైన ఒక సొంత భవంతిని నిర్మించుకునే ప్లాన్‌లో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు దర్శకరత్న డా.దాసరి నారాయణరావు జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం ద్వారా భారీగా నిధిని సేకరించే పనిలో ఉంది దర్శకసంఘం. 2024 మే4న దాసరి జయంతి సందర్భంగా భారీ ఈవెంట్ ని నిర్వహించాలని భావించినా కానీ ఎన్నికల కోడ్ వల్ల దానిని వాయిదా వేసారు. ఇప్పుడు మే 19న గచ్చిబౌళి ఎల్.బి. స్టేడియంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని, ఇండస్ట్రీ దిగ్గజాలంతా ఈ వేడుకలో పాల్గొనే ఛాన్సుందని కథనాలొస్తున్నాయి. ఇప్పటికే దర్శక సంఘం సంక్షేమం కోసం ప్రభాస్ లక్షల్లో డొనేషన్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా పలుమార్లు డొనేషన్లు ఇచ్చారు. ఇప్పుడు జరగనున్న మెగా ఈవెంట్లో కూడా ప్రముఖ స్టార్లంతా పాల్గొననున్నారని, భారీగా నిధిని సేకరించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ఈవెంట్ టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని చెబుతున్నారు. వేడుకలో ప్రముఖుల విరాళాలతో భారీ నిధి సమకూరుతుందని దర్శకసంఘం భావిస్తోంది.
ఆసక్తికరంగా చాలా కాలంగా ఇలాంటి ఒక ఈవెంట్ నిర్వహించాలని అనుకుంటున్న మా అసోసియేషన్ ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తోంది. అనుకున్నదానిని నెరవేర్చుకోలేకపోయింది. కానీ అంతకుముందే దర్శకసంఘం తెలివిగా భారీ ఈవెంట్ ని ప్లాన్ చేయడం స్టార్ల నుంచి సొంత భవంతికి అవసరమయ్యే నిధిని రాబడుతుండడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. మూవీ ఆర్టిస్టుల సంఘానికి చేతకానిది.. దర్శకసంఘం సులువుగా సాధించుకుంటోందని కూడా కామెంట్లు పడిపోతున్నాయి.