సామ్ న్యూ స్ట్రాటజీ: నో హీరోస్..ఐయామ్ ద హీరో!
కొంత మంది కెరీర్ ఒక దశ వరకే ఉంటుంది. మరి కొందరిది అంతకు మించి అన్నట్టుగా సాగుతూ వుంటుంది.;
కొంత మంది కెరీర్ ఒక దశ వరకే ఉంటుంది. మరి కొందరిది అంతకు మించి అన్నట్టుగా సాగుతూ వుంటుంది. మారుతున్న కాలాన్ని బట్టి తమని తాము మార్చుకుంటూ కొత్త తరహాలో ట్రై చేస్తూ ఉండటంతో కొంత మంది కెరీర్ ఎలాంటి ఒడిదుడులు లేకుండా సాగుతూ ఉంటుంది. అయితే ఆ మార్పులకు శ్రీకారం చుట్టని వారు మాత్రం తెరమరగైపోతుంటారు. కానీ సమంత మాత్రం మొదటి పంథాని ఎంచుకుని ప్రేక్షకుల అటెన్షన్‌ని తన వైపు తిప్పుకుంటోంది. 2023లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి సామ్ చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ `ఖుషి`.
ఇది బ్లాక్ బస్టర్ అనిపించుకోలేకపోయినా ఫరవాలేదు అనిపించింది. ఇక దీనికి ముందు చేసిన `శాకుంతలం` డిజాస్టర్ కావడం, మయోసైటీస్‌తో సామ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి కారణాలతో సామ్ కెరీర్ ఇక ముగిసినట్టేననే కామెంట్‌లు వినిపించాయి. దీంతో కొంత విరామం తీసుకున్న సమంత తానే నిర్మాతగా నిర్మించిన చిన్న మూవీ `శుభం`తో మాయా మాతాశ్రీగా గెస్ట్ క్యారెక్టర్‌లో మెరిసింది. `ఖుషి` తరువాత రెండేళ్ల విరామం తీసుకున్న సామ్ తన పంథా మార్చుకుని కొత్త తరహా సినిమాలకు శ్రీకారం చుడుతోంది.
ఇందులో భాగంగానే 'మా ఇంటి బంగారం' చేస్తోంది. నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తోంది. సమంత నటిస్తూ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాకు ఆమె భర్త, దర్శకుడు రాజ్ నిడిమోరు క్రియేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. అత్తగారింట్లోకి అడుగు పెట్టిన కోడలు..వారం రోజుల్లో అందరితో కలిసి పోతానని చెబుతుంది. అయితే తనని ఇష్టపడిని ఫ్యామిలీ కారణంగా తను ఎలాంటి సంఘటనల్ని ఎదుర్కొంది?..వాటి నుంచి తనని తాను ఎలా కాపాడుకుంది` అనే ఆసక్తికరమైన కథతో ఈ మూవీని తెరకెక్కించారు.
సినిమాలో సామ్ మరోసారి యాక్షన్ హీరో అవతారం ఎత్తడంపై చర్చ జరుగుతోంది. `ఏమాయ చేసావే`తో కెరీర్ ప్రారంభించి `ఖుషి` వరకు స్టార్ హీరోలు, క్రేజీ హీరోలతో కలిసి నటించిన సమంత ఇప్పుడు సరికొత్త పంథాని ఎంచుకుని హీరోలకు దీటుగా యాక్షన్ అవతారం ఎత్తిందని చెబుతున్నారు. నో హీరోస్..ఐయామ్ ద హీరో అనే స్ట్రాటజీతో సమంత సరికొత్త పంథాలో సినిమాలు చేసే ఆలోచనలో ఉందని, అందులో భాగంగానే `మా ఇంటి బంగారం` మూవీ చేస్తోందని అంటున్నారు.
దీనికి ప్రధాన కారణం హీరోలతో సంబంధం లేకుండా తానే హీరోగా యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీస్తోందని, ఈ మూవీలో సామ్‌పై షూట్ చేసిన యాక్షన్ ఘట్టాలు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆ ఫేజ్‌ని విజయశాంతి ఫిల్ చేసింది. హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుకుంటూ వచ్చింది. ఇప్పుడు అదే పార్ములాని ఫాలో అవుతూ సమంత ఇండస్ట్రీలో కొత్త తరహా సినిమాలని అందించడం ఖాయం అని `మా ఇంటి బంగారం` టీజర్ చూసిన వారంతా కామెంట్‌లు చేస్తున్నారు.