కచ్చితంగా 3 గంటల సినిమా ఉండాల్సిందేనా?

భారీ కథలు, పీరియాడిక్ చిత్రాలు, పాన్ ఇండియా సినిమాలు లేదా ఫాంటసీ వరల్డ్ ను చూపించే చిత్రాలకు ఎక్కువ రన్ టైమ్ అవసరం కావచ్చు.

Update: 2026-07-07 13:30 GMT

సినిమా ఎంత పెద్దది? ఎంత భారీ బడ్జెట్‌ తో తీశారు? ఎంత మంది స్టార్లు ఉన్నారు? అనే విషయాల కంటే.. ప్రేక్షకుడికి కథ ఎంత స్ట్రాంగ్ గా చెప్పారన్నదే ఇప్పుడు ముఖ్యంగా మారుతోంది. అయినప్పటికీ ఇటీవలి కాలంలో అనేక సినిమాలు మూడు గంటలకు దగ్గరగా లేదా అంతకంటే ఎక్కువ రన్ టైమ్ తో విడుదలవుతున్నాయి. దీంతో సినిమా నిడివిపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

నిజంగా ప్రతి భారీ సినిమా మూడు గంటలు ఉండాల్సిందేనా? లేక కథకు అవసరమైనంత రన్ టైమ్ ఉంటే సరిపోతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు మూడు గంటల సినిమా అంటే పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ గా భావించేవారు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల టేస్ట్ లు మారాయి. కథ చెప్పే విధానం, స్క్రీన్‌ ప్లే స్పీడ్, సినిమా నడిపే తీరు అన్నీ కీలకంగా మారాయి. అందుకే రన్ టైమ్ కంటే కథనం ప్రేక్షకుడిని ఎంతసేపు ఆసక్తిగా కూర్చోబెట్టగలిగిందన్నదే ముఖ్యమవుతోంది.

భారీ కథలు, పీరియాడిక్ చిత్రాలు, పాన్ ఇండియా సినిమాలు లేదా ఫాంటసీ వరల్డ్ ను చూపించే చిత్రాలకు ఎక్కువ రన్ టైమ్ అవసరం కావచ్చు. పాత్రలను స్ట్రాంగ్ గా పరిచయం చేయడం, ఎమోషన్స్ ను సరైన విధంగా చూపించడం, కథను పూర్తి స్థాయిలో చెప్పడం కోసం కాస్త ఎక్స్ట్రా టైమ్ అవసరమవుతుంది. అలాంటి సందర్భాల్లో మూడు గంటల నిడివి కూడా ప్రేక్షకుడికి భారంగా అనిపించదు. కానీ ప్రతి కథకు అంత సమయం అవసరం ఉండదు.

అనవసరమైన సన్నివేశాలతో కథను లాగడం ప్రేక్షకుడి ఆసక్తిని తగ్గించే ప్రమాదం ఉంది. అదే విషయాన్ని రెండు గంటల నుంచి రెండున్నర గంటల్లోనే ఎఫెక్టివ్ గా చెప్పగలిగితే అదే మంచి నిర్ణయంగా మారుతుంది. ఇప్పటి ప్రేక్షకుడు కూడా అవసరం లేని సన్నివేశాలను ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నారు. అంతే కాదు వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేస్తున్నారు. అదే సమయంలో ఓటీటీలు, సోషల్ మీడియా ఎఫెక్ట్ తో స్టోరీ వేగంగా సాగాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

వాస్తవానికి సినిమా రన్ టైమ్ ఎక్కువగా ఉంటే ప్రతి సీన్ కథను ముందుకు తీసుకెళ్లాలి. లేకపోతే సినిమా స్లోగా సాగుతోందనే అభిప్రాయం ఏర్పడి, అది టాక్‌ పైనా, వసూళ్లపైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు దర్శకులు కూడా నిడివి విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నారు. కథ నిజంగా కోరుకుంటే మూడు గంటల రన్ టైమ్ ఉండొచ్చు. కానీ కేవలం భారీ సినిమా అనే ఫీలింగ్ కోసం నిడివిని పెంచడం మాత్రం రిస్క్‌ గా మారొచ్చు.

కథకు అవసరమైనంత మాత్రమే చెప్పడం కూడా మంచి కథనంలో భాగమే. ఏదేమైనా చివరికి ఆడియన్స్ గుర్తుంచుకునేది సినిమా మూడు గంటలు నడిచిందా, రెండు గంటలు నడిచిందా అనేది కాదు. ఆ సమయంలో సినిమా తనను ఎంతగా ఆకట్టుకుంది, ఎలాంటి అనుభూతిని ఇచ్చిందన్నదే అసలు విజయం. అందుకే రన్ టైమ్ కాదు.. కంటెంట్‌ నే చివరికి సినిమా ఫ్యూచర్ ను నిర్ణయిస్తుంది. ఒకవేళ రన్ టైమ్ ఎక్కువ ఉన్నా ఎఫెక్టివ్ గా మూవీ తీయాలి.

Tags:    

Similar News