ట్రైలర్ల లెంగ్త్ పెంచుతున్న మేకర్స్!
అయితే ఈ సుదీర్ఘ ట్రైలర్ల వల్ల లాభాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి.
సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచడానికి ట్రైలర్ అత్యంత బలమైన ఆయుధం. గతంలో రెండు నుండి రెండున్నర నిమిషాల వ్యవధిలో జాగ్రత్తగా కథ ఎక్కడ లీక్ అయిపోతుందో? అనే భయంతో ట్రైలర్లను కట్ చేసేవారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోతోంది. కథను దాచడం కంటే సినిమాలోని అసలు సిసలైన హైలైట్స్, క్యారెక్టర్ ఎలివేషన్లను చూపిస్తూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే లక్ష్యంగా మేకర్స్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే నాలుగు నిమిషాలకు పైగా నిడివి ఉన్న సుదీర్ఘ ట్రైలర్లను విడుదల చేసి సరికొత్త ప్రయోగాలకు తెరలేపుతున్నారు.
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి సరికొత్త రికార్డును సృష్టించారు. ఆయన దర్శకత్వంలో రిలీజ్ అయిన `సింగమ్ అగైన్` చిత్ర ట్రైలర్ ఏకంగా 4 నిమిషాల 58 సెకండ్ల నిడివితో విడుదలై అందరినీ ఆశ్చర్యపరిచింది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ట్రైలర్‌గా ఇది రికార్డు నెలకొల్పింది. అదే బాటలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన `వెల్కమ్ టు ది జంగిల్` సినిమా ట్రైలర్ సైతం 4 నిమిషాల 10 సెకండ్ల రన్‌టైమ్‌తో వచ్చి జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. భారీ తారాగణం ఉన్నప్పుడు అందరికీ స్క్రీన్ స్పేస్ ఇవ్వడం కోసమే ఇలా నిడివి పెంచాల్సి వస్తోందన్నది మేకర్స్ వాదన.
టాలీవుడ్‌లో సైతం ఈ లాంగ్-లెంగ్త్ ట్రైలర్ల సంస్కృతి జోరందుకుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన `సలార్` చిత్రం కోసం కట్ చేసిన 3 నిమిషాల 47 సెకండ్ల సుదీర్ఘ ట్రైలర్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అలాగే దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన `RRR` ట్రైలర్ కూడా 3 నిమిషాల 16 సెకండ్ల పాటు సాగి `ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇచ్చింది. ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రిలీజ్ అయిన `పెద్ది` చిత్రం సైతం 3 నిమిషాల 7 సెకండ్ల నిడివితో ఈ ట్రెండ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లింది.
అయితే ఈ సుదీర్ఘ ట్రైలర్ల వల్ల లాభాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. దాదాపు 4 నిమిషాల పాటు కంటెంట్‌ను చూపించినప్పుడు సినిమాలోని ప్రధాన ప్లాట్ పాయింట్లు, ట్విస్టులు ఏంటనేది సులభంగా రివీల్ అయిపోయే ప్రమాదం ఉంది. సినిమా కథ ఇదేనని ముందే ఒక అంచనాకు రావడం వల్ల థియేటర్లలో ప్రేక్షకుడికి లభించే సస్పెన్స్ ..థ్రిల్ ఎలిమెంట్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఎక్కువ విషయాలను ఒకే సీన్‌లోకి కుక్కడం వల్ల కొన్నిసార్లు ట్రైలర్ కట్ సరిగ్గా కుదరక నెగిటివ్ టాక్ వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు.
నేటి డిజిటల్ యుగంలో ప్రేక్షకుడిని థియేటర్ వైపు నడిపించాలంటే ఒకటి రెండు డైలాగులు, యాక్షన్ బిట్లు చూపిస్తే సరిపోవడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా ప్రపంచం ఎంత పెద్దదో? అందులోని డ్రామా ఎంత బలంగా ఉందో? చూపిస్తేనే జనాలు టికెట్లు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సైతం లీకేజీల భయాన్ని పక్కనబెట్టి ప్రమోషన్ల కోసం సరికొత్త వ్యూహాన్ని నమ్ముకుంటున్నారు. ఒక రకంగా ఇది సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు ముందే పరిచయం చేసే ఒక మినీ మూవీలా మారుతోంది.
ట్రైలర్ల లెంగ్త్ పెంచడం అనేది బాక్సాఫీస్ వద్ద హైప్ క్రియేట్ చేయడానికి ఒక మంచి సాధనమే అయినప్పటికీ అది కత్తి మీద సాము లాంటిదే. కథలోని అసలు గుట్టును దాస్తూనే ప్రేక్షకుడికి థియేటర్ అనుభూతిని కలిగించేలా ఎడిటింగ్ రూమ్‌లో మ్యాజిక్ చేయగలిగితేనే సుదీర్ఘ ట్రైలర్లు విజయవంతం అవుతాయి. లేదంటే సినిమా విడుదల కాకముందే ప్రేక్షకుడికి ఓవర్‌డోస్ ఇచ్చి నీరసపడేలా చేసే ప్రమాదం పొంచి ఉంది.