స్టార్ కిడ్స్ కు షాక్ ఇచ్చిన సీనియ‌ర్ న‌టుడు!

చిత్ర పరిశ్రమలో నెపోటిజం -స్టార్ కిడ్స్ రంగప్రవేశంపై నిరంత‌రం చర్చలు జరుగుతూనే ఉంటాయి.

Update: 2026-06-07 03:15 GMT

చిత్ర పరిశ్రమలో నెపోటిజం -స్టార్ కిడ్స్ రంగప్రవేశంపై నిరంత‌రం చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ నటుడు లలిత్ పరిమూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ యువ తరం నటీనటుల ప్రతిభపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవడానికి సినీ నేపథ్యం .. సినిమా అవకాశాలు సులభంగా లభించడం కొంతవరకు స‌హాయ ప‌డొచ్చు కానీ సుదీర్ఘ కాలం రాణించాలంటే నటనలో నైపుణ్యం మాత్రమే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. ప్రస్తుత తరం జాన్వీ కపూర్, అనన్యా పాండే, శనాయా కపూర్, అర్జున్ కపూర్ వంటి వారి పేర్లను ప్రస్తావిస్తూ లలిత్ పరిమూ నిర్మొహ మాటంగా త‌న అభిప్రాయాలను పంచుకున్నారు.

సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి రావడం వల్ల వారికి తొలి అవకాశాలు సులభంగా దక్కుతాయని అయితే కేవలం అందం, కుటుంబ ప్రతిష్టలతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోలేరని పేర్కొన్నారు. నటన అనేది నిరంతర ప్రక్రియ అని దానికి కఠోర శ్రమ, అంకితభావం ఎంతో అవసరమని యువ నటులకు సూచించారు.నటుడిగా రాణించాలంటే డైలాగులు చెప్పడం మాత్రమే సరిపోదని, పాత్రలోని లోతును అర్థం చేసుకుని జీవించాల్సి ఉంటుందని లలిత్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నాటకరంగం లేదా థియేటర్ ఆర్ట్స్ వంటి వాటిలో శిక్షణ పొందడం వల్ల నటనలోని మెళకువలు వంటబడతాయని నొక్కి చెప్పారు.

చాలా మంది స్టార్ కిడ్స్ గ్లామర్ ,సోషల్ మీడియా పాపులారిటీపైనే శ్రద్ధ పెడుతున్నారని అలా కాకుండా నటనపై మరింత దృష్టి పెడితేనే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం మనుగడ సాగించగలరని హితవు పలికారు. సినీ వారసత్వంతో వచ్చే నటులపై ప్రేక్షకులు ఎప్పుడూ ప్రత్యేకమైన అంచనాను కలిగి ఉంటారని, ఆ అంచనాలను అందుకో లేన ప్పుడు తీవ్రమైన విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తు చేశారు. తొలి చిత్రం తర్వాత ప్రతి నటుడు తన సొంత ప్రతిభను నిరూపించుకోవాల్సిందేనని అక్కడ తలిదండ్రుల పేరు.. బ్యాక్‌గ్రౌండ్ పని చేయదని స్పష్టం చేశారు. తమ లోపాలను తెలుసుకుని, నటనను మెరుగుపరుచుకోవడానికి నిరంతరం ప్రయత్నించే వారే నిజమైన నటులుగా ఎదుగుతారని వివరించారు.

లలిత్ పరిమూ టెలివిజన్ - వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా `శక్తిమాన్` సీరియల్‌లో ఆయన పోషించిన డాక్టర్ జాకాల్ పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు సుపరిచితమే. దాంతో పాటు ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించిన ఆయన థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చిన అనుభవంతోనే యువ తరం నటులకు ఈ విధమైన సలహాలను అందించారు.

Tags:    

Similar News