25 ఏళ్ల తర్వాత 8 జాతీయ అవార్డుల సినిమా రీరిలీజ్!
భారతీయ సినిమా చరిత్రను మలుపు తిప్పిన అద్భుత దృశ్యకావ్యం `లగాన్: వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఇండియా` విడుదలై పావు శతాబ్దం (25 ఏళ్లు) పూర్తి చేసుకుంది.
భారతీయ సినిమా చరిత్రను మలుపు తిప్పిన అద్భుత దృశ్యకావ్యం `లగాన్: వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఇండియా` విడుదలై పావు శతాబ్దం (25 ఏళ్లు) పూర్తి చేసుకుంది. నాడు బ్రిటీష్ పాలకుల పన్నుల అణచివేతకు వ్యతిరేకంగా ఒక సాదాసీదా పల్లెటూరి ప్రజలు క్రికెట్ మ్యాచ్ ద్వారా ఎదురుతిరిగిన కథాంశంతో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం ఎనిమిది జాతీయ అవార్డులను గెలుచుకోవడమే కాకుండా ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలో నిలిచి భారతదేశం గర్వించదగ్గ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు 25 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకుని ఈ క్లాసిక్ వండర్ మళ్లీ వెండితెరపై అలరించడానికి సిద్ధమైంది.
ఈ చారిత్రాత్మక విజయానికి గుర్తుగా `లగాన్` చిత్రాన్ని 12 జూన్ నుంచి మూడు రోజుల పాటు థియేటర్లలో ప్రత్యేకంగా రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ కోసం సరికొత్తగా కట్ చేసిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయగా.. అది వీక్షకులను పాత జ్ఞాపకాలలోకి తీసుకెళుతోంది. 1893 నాటి మధ్య భారత దేశంలోని దుమ్ము కొట్టుకుపోయిన గ్రామీణ వాతావరణం.. ధైర్యవంతులైన గ్రామస్తులు.., గర్వంతో కూడిన బ్రిటీష్ అధికారులు..., ఏఆర్ రెహమాన్ అందించిన మరువలేని సంగీతం.. అద్భుతమైన క్రికెట్ మ్యాచ్ దృశ్యాలు ఈ ట్రైలర్‌లో మరోసారి అభిమానులలో పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఆరోజులలో థియేటర్లలో చూడని నేటి తరం యువతకు సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు.
ఈ 25 ఏళ్ల వేడుకలను మరింత వినూత్నంగా సెలబ్రేట్ చేయడానికి `అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్` సోషల్ మీడియాలో #లగాన్ పోస్టర్ ఛాలెంజ్ పేరుతో ఒక క్రియేటివ్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఈ కాంటెస్ట్ ద్వారా అభిమానులు లగాన్ సినిమా యూనిక్ పోస్టర్‌ను తమ స్వంత శైలిలో రీ-క్రియేట్ చేసి పంపాల్సి ఉంటుంది. ఇందులో గెలుపొందిన విజేతలకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. వారు లగాన్ చిత్ర అసలు నటీనటులు,సాంకేతిక నిపుణుల తో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసే స్పెషల్ స్క్రీనింగ్‌లో పాల్గొనే సువర్ణావకాశాన్ని దక్కించుకోనున్నారు. ఈ వినూత్న ప్రమోషన్ సినిమాపై ఉన్న క్రేజ్‌ను మరింత రెట్టింపు చేసింది.
ఈ చిత్రంలో భువన్ పాత్రలో అమీర్ ఖాన్ ప్రదర్శించిన నటన ఆయన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ఆయనతో పాటు గ్రేసీ సింగ్ (గౌరి), బ్రిటీష్ నటీనటులు రాచెల్ షెల్లీ, పాల్ బ్లాక్‌థోర్న్‌లు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. వీరితో పాటు కుల్భూషణ్ ఖర్బందా, సుహాసిని ములే, రాజేంద్ర గుప్తా, ఎకె హంగల్, రఘుబీర్ యాదవ్, రాజేష్ వివేక్, ప్రదీప్ రావత్, యశ్‌పాల్ శర్మ వంటి తారాగణం ఈ చిత్రంలో విలేజ్ క్రికెట్ టీమ్‌గా మెప్పించారు. ఈ సమూహ నటన.. ప్రతీ పాత్రను డిజైన్ చేసిన విధానమే సినిమా అసాధారణ విజయానికి కారణం.
భారతీయ సినీ చరిత్రలో ఈ రీ-రిలీజ్‌కు మరొక ప్రత్యేకమైన చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. 2001 జూన్ 15న `లగాన్` చిత్రం థియేటర్లలో విడుదలైన అదే రోజున సన్నీ డియోల్ బాక్సాఫీస్ సంచలనం `గదర్: ఏక్ ప్రేమ్ కథ` కూడా విడుదలైంది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ క్లాష్ ఇది. రెండు సినిమాలు సంచలన విజయాలు సాధించి..., సమాంతరంగా రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు 2026 నాటికి ఈ రెండు మైలురాయి చిత్రాలు ఒకేసారి 25 వసంతాలను పూర్తి చేసుకోవడం విశేషం. ఆస్కార్స్‌లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో నామినేట్ అయిన మూడవ భారతీయ చిత్రంగా 49వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంతో పాటు 8 అవార్డులను కొల్లగొట్టిన `లగాన్` రీ-రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.