క్రిష్ ఆ మరకలు చెరపకపోగా..

ఒక కథకు, ఇంకో కథకు సంబంధం లేని విధంగా సినిమాలు తీస్తూ.. ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం చూపిస్తూ.. గొప్ప సందేశాన్ని కూడా అందిస్తూ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్నాడు క్రిష్;

Update: 2025-09-09 23:30 GMT

ఒక గమ్యం.. ఒక వేదం.. ఒక కృష్ణం వందే జగద్గురుం.. ఒక కంచె.. ఒక గౌతమీపుత్ర శాతకర్ణి.. వీటిలో ఏ సినిమా ఎంత వసూలు చేసింది.. కమర్షియల్‌గా ఏది ఎలాంటి ఫలితాన్ని అందుకుంది అన్నది అనవసరం.. ప్రతిదీ గొప్ప సినిమా అనడంలో సందేహం లేదు. ఒక కథకు, ఇంకో కథకు సంబంధం లేని విధంగా సినిమాలు తీస్తూ.. ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం చూపిస్తూ.. గొప్ప సందేశాన్ని కూడా అందిస్తూ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్నాడు క్రిష్.

కానీ ఇంత గొప్ప దర్శకుడికి కెరీర్ రెండో అర్ధంలో అస్సలు కలిసి రావడం లేదు. తన సినిమాలు వివాదాల్లో చిక్కుకోవడం.. ఆశించిన ఫలితాలు రాబట్టకపోవడం.. క్రిష్‌కు విమర్శలు తెచ్చి పెట్టడం.. ఇదీ వరస. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తర్వాత క్రిష్ నుంచి సంతృప్తికరమైన సినిమా ఒక్కటీ రాలేదు. ఎంతో కష్టపడి తీసిన ‘మణికర్ణిక’ నుంచి మధ్యలో తప్పుకున్నాడు. ఆ చిత్రాన్ని టేకప్ చేసిన కంగనా.. క్రిష్‌కు క్రెడిట్ రాకుండా చేసింది. దీంతో ఇక అప్పట్నుంచి తనేంటో రుజువు చేసుకోవడానికి.. మరకలు చెరిపేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు క్రిష్. కానీ ఇంకా కొత్త మరకలు తయారవుతున్నాయే తప్ప.. పాత మరకలు చెరగట్లేదు.

అద్భుతాలు చేస్తుందనుకున్న ‘యన్.టి.ఆర్’ బయోపిక్ రెండు సినిమాలతో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు క్రిష్. తర్వాత ‘హరిహర వీరమల్లు’ లాంటి భారీ చిత్రాన్ని నెత్తికెత్తుకున్నాడు. కానీ అది బాగా ఆలస్యం కావడంతో క్రిష్ బయటికి రావాల్సి వచ్చింది. జ్యోతికృష్ణ చేతుల్లో పడి అస్తవ్యస్తంగా తయారైన సినిమా డిజాస్టర్ అయింది. కానీ ఆ ఫలితంలో ఎంతో కొంత బాధ్యత క్రిష్ కూడా తీసుకోవాల్సి వచ్చింది.

ఐతే క్రిష్ పూర్తిగా సినిమా తీస్తే వ్యవహారం వేరుగా ఉండేదని.. ఆయన సత్తా ఏంటో ‘ఘాటి’తో చూస్తారని అభిమానులు అన్నారు. ప్రోమోలు చూస్తే అది నిజమే అనిపించింది. తీరా చూస్తే.. ఇది క్రిష్ కెరీర్లో మరో పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి మినిమం ఓపెనింగ్స్ లేవు. వీకెండ్లోనే తడబడింది. సోమవారం నుంచి వాషౌట్ అయిపోయింది. ఇది క్రిష్‌కు మామూలు దెబ్బ కాదు. దీన్నుంచి కోలుకుని మళ్లీ తనేంటో రుజువు చేసుకోవడం క్రిష్‌కు సవాలే.

Tags:    

Similar News