తెలుగు సినిమా ఉన్నంత కాలం 'లక్ష్మీపతి' ఉంటాడు
కోటా శ్రీనివాస రావు మృతితో తెలుగు సినిమా గొప్ప నటుడిని కోల్పోయింది. శతాబ్దం కు ఒక్కరు ఇద్దరు మాత్రమే ఇలాంటి నటులు ఉంటారు.;
కోటా శ్రీనివాస రావు మృతితో తెలుగు సినిమా గొప్ప నటుడిని కోల్పోయింది. శతాబ్దం కు ఒక్కరు ఇద్దరు మాత్రమే ఇలాంటి నటులు ఉంటారు. కోటా వంటి నటుడు మళ్లీ పుట్టడం అనుమానమే. తెలుగు సినిమా ఉన్నంత కాలం గుర్తుండి పోయే కొన్ని సినిమాలు ఉంటాయి. అలాగే తెలుగు సినిమా ఉన్నంత కాలం కొన్ని పాత్రలను ప్రేక్షకులు నెమరవేసుకునే విధంగా ఉంటాయి. అలాంటి పాత్రల్లో ఒకటి 'లక్ష్మీపతి'. ఈ పాత్రను కోటా శ్రీనివాసరావు చేశారు. 'ఆహా నా పెళ్లంట' సినిమాలో కోటా శ్రీనివాసరావు పోషించిన లక్ష్మీపతి పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుంది. విలన్‌గా వరుస సినిమాలు చేస్తున్న కోటా శ్రీనివాస రావును తీసుకు వచ్చి లక్ష్మీపతి పాత్ర చేయించడం సాహసం అనే అభిప్రాయం వ్యక్తం అయిందట.
దర్శకుడు జంధ్యాల గట్టి నమ్మకంతో లక్ష్మీపతి పాత్రను కోటా శ్రీనివాసరావు తో చేయించారు. ఆహా నా పెళ్లంట సినిమా నిర్మాత రామానాయుడు సైతం ఒకింత అనుమానం వ్యక్తం చేశారట. పిసినారి గా నటిస్తూ నవ్వించడంతో పాటు, ఆయన ప్రవర్తనతో అసహ్యం కలిగించాల్సి ఉంటుంది. ఆ పాత్రను కోటా అద్భుతంగా పోషించాడు. ఒక మోస్తరు వరకు నవ్వు తెప్పించిన పిసినారితనం హద్దులు దాటి అసహ్యం కలిగించేలా చేశాడు. లక్ష్మీపతి పాత్రను కోటా తప్ప మరెవ్వరూ చేయలేరు. ఆ సినిమా తర్వాత ఎంతో మంది నటులు పిసినారి పాత్రలో నటించారు. కానీ ఏ ఒక్కరూ లక్ష్మీపతిని మరిపించలేక పోయారు. ఆ పాత్ర ఒక అద్భుతం, ఆ పాత్రలో నటించిన కోటా గొప్ప నటుడు.
తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాల పేర్లు చిరస్థాయిగా నిలిచి పోతాయి. అలాంటి సినిమాల్లో ఆహా నా పెళ్లంట సినిమా ఒకటి అనడంలో సందేహం లేదు. ఆ సినిమాకు అంతటి హిట్‌ను తెచ్చి పెట్టడంలో కీలక పాత్ర పోషించిన నటుడు కోటా అనడంలో సందేహం లేదు. తెలుగు సినిమా చరిత్రలో కోటా సినిమాలు, పాత్రలు కొన్ని సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గవిగా ఉంటాయి. అలాంటి పాత్రల్లో లక్ష్మీపతి పాత్ర ఒకటి ఉంటుంది అనడంలో సందేహం లేదు. లక్ష్మీపతి పాత్రను చేసినందుకు గాను కోటా శ్రీనివాసరావు విమర్శకుల ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. నటుడిగా కోటా స్థాయిని పెంచిన పాత్ర లక్ష్మీపతి.
27 నవంబర్ 1987లో విడుదలైన 'ఆహా నా పెళ్లంట' సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించారు. డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా రజిని హీరోయిన్‌గా నటించారు. ఇంకా ఈ సినిమాలో బ్రహ్మానందం, నూతన ప్రసాద్, రాళ్లపల్లి, గుండు హనుమంతరావు, సుత్తి వీరభద్రరావు, శుభలేక సుధాకర్, సుత్తివేలు ఇలా ప్రముఖ నటీనటులు నటించారు. రమేష్ నాయుడు సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో బ్రహ్మానందంతో కోటా శ్రీనివాసరావు కాంబో సీన్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో కోటా శ్రీనివాస రావును ఇప్పటికీ ట్రెండ్‌లో ఉంచుతుంది అంటే ఖచ్చితంగా అది ఆహా నా పెళ్లంట సినిమా కారణంగా అనడంలో సందేహం లేదు.