చిట్టెక్క రేపిన చిచ్చు .. 'కొండె'క్కనున్న పదవి ?!

కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి మీద ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమె తల్లి కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టినట్లయింది.

Update: 2026-09-03 03:59 GMT

కొండా సుష్మితా పటేల్ ఆలియాస్ చిట్టెక్క. మంత్రి కొండా సురేఖ కూతురు. కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి మీద ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమె తల్లి కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు పెట్టినట్లయింది. వచ్చే ఎన్నికల్లో తన కూతురు సుష్మిత పరకాల నుండి పోటీ చేస్తుందని, రాబోయే 20 ఏళ్లు పరకాల ఎమ్మెల్యేగా ఆమె ఉంటుందని ఆమె తండ్రి కొండా మురళి ప్రకటించారు.

ఆ తరువాత పరకాల పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, ప్రజలు ఆయనను గెలిపించాలని పిలుపునిచ్చారు. అప్పటికే ఆ నియోజకవర్గం మీద కన్నేసిన కొండా ఫ్యామిలీకి సీఎం వ్యాఖ్యలు రుచించలేదు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ పుట్టిన రోజు సంధర్భంగా జరిగిన వేడుకల్లో ఆమె కూతురు సుష్మిత సీఎం రేవంత్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలకు దిగింది.

‘పరకాల నియోజకవర్గం కొండా టెరిటరీ. ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి తిరిగి పోటీ చేస్తారని ఎలా ప్రకటిస్తాడు. అసలు టికెట్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ఎవరు ? నాకు టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా నిలబడతా. మీరు, మీ నాన్న, మీ తాత వచ్చినా పరకాల ఎమ్మెల్యేను నేనే.సీఎం సోదరుడికి రూ.200 కోట్ల భూమి కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీని పచ్చ కాంగ్రెస్ గా మారుస్తున్నారు. అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ మధ్య పోటీ నడుస్తుంది’ కొండా సుష్మిత ఆరోపించింది.

కొండా సుష్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని కొండా సురేఖ, తమ కూతురు వయసు 38 ఏళ్లు ఆమె స్వతంత్రంగా మాట్లాడుతుంది. ఆమె వద్ద ప్లాన్ బి ఏముందో తనకు తెలియదు అంటూ కొండా మురళి వ్యాఖ్యానించడం చర్చానీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ సంఘం కొండా సురేఖకు నోటీసు ఇవ్వడం, ఆమె తన కూతురి వ్యాఖ్యలతో సంబంధం లేదని వివరణ ఇవ్వడం, దానితో ఏకీభవించని క్రమశిక్షణ సంఘం ఆమెను పదవి నుండి తొలగించాలని సిఫారసు చేయడంతో గత రెండు రోజులుగా ఈ అంశం ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం వద్దకు చేరింది.

మంగళవారం ఢిల్లీకి వెళ్లిన కొండా సురేఖకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్ మెంట్ లభించలేదు. నిన్న మధ్యాహ్నం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన అనంతరం ఆమె తన మీద చర్య తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని, తాను పదేళ్లు సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి ఎలా చెబుతాడని, ఆయన వ్యాఖ్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని, బీసీ సామాజిక వర్గానికి చెందిన తన మీదనే ఎలా చర్యలు తీసుకుంటారని, నాకు ఇప్పటి వరకు రాజీనామా చేయాలన్న సంకేతాలు రాలేదని, వచ్చిన రాజీనామా చేసే ప్రసక్తే లేదని, ఒక వేళ బర్తరఫ్ చేస్తే ఏం చేయాలో తనకు తెలుసని వ్యాఖ్యానించింది.

కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను పదవి నుండి తొలగించడం ఖాయం అని తేలిపోయింది. అందుకే ఆమె మొన్నటి దాకా తన కూతురు చేసిన ఆరోపణలతో తనకేం సంబంధం అని చెప్పి, ఢిల్లీలో బుధవారం ఇంతకుముందు తన కూతురు చేసిన వ్యాఖ్యలనే చేసిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి.

కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లినప్పటి నుండి ఆమెకు ఇద్దరు ఏఐసీసీ సభ్యుల నుండి, రాష్ట్రానికి చెందిన కొందరు మంత్రుల నుండి మద్దతు లభించిందని, ఆమె మీద చర్యలు తీసుకుంటే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ చివరికి ఆమెకు పార్టీ అధ్యక్షుడు ఖర్గే కొద్ది సమయం మాత్రమే కలిసే అవకాశం ఇచ్చారు. దీంతో తన వాదనను కేసీ వేణుగోపాల్ కు వాట్సప్ లో, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలకు మెయిల్ రూపంలో పంపినట్లు వెల్లడించింది. మొత్తానికి ఇప్పుడు సురేఖ మంత్రి పదవి వ్యవహారం రాహుల్ చేతుల్లో ఉంది. ఏం జరుగుతుంది ? ఎప్పుడు పదవి నుండి తప్పిస్తారు ? అన్న ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News