అదే మూస స్క్రిప్టులు.. అందుకే తిరస్కారం!
ఇప్పుడు ప్రముఖ తమిళ దర్శకుడు తన మూస స్క్రిప్టులతో హీరోలను విసిగిస్తున్నాడని కథనాలొస్తున్నాయి.;
ఒకే మూసలో సినిమాలు తీసే దర్శకులు ప్రారంభం విజయాలు సాధించి ఉండొచ్చు. కానీ ఇది ఎల్లకాలం సాధ్యపడదు. ఇంచుమించు ఒకే లైన్ తీసుకుని, దానిలో సీన్లు మార్చి స్క్రిప్టులు రాసే పాతకాలపు మైండ్ సెట్లతోనే ఈ సమస్య. టాలీవుడ్ లో కొందరు యాక్షన్ ఫ్యాక్షన్ డైరెక్టర్లు కాలగర్భంలో కలిసిపోవడానికి కారణమిదే. సీనియర్ దర్శకులు చాలా మంది మాస్ ఎలిమెంట్స్, ఫ్యాక్షన్, యాక్షన్ అంటూ మూస ధోరణి నుంచి బయటపడకపోవడం వల్లనే కనుమరుగయ్యారు. అలా లైమ్ లైట్ కి దూరమైన దర్శకులు ఎవరు? అనేది అప్రస్తుతం. కానీ వీరంతా ఇప్పుడు లేరనేది వాస్తవం.
ఒక ప్రముఖ తెలుగు దర్శకుడు కామెడీ ఎంటర్ టైనర్ల పేరుతో వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఒకానొక దశలో ఆయన `బ్లాక్‌బస్టర్ డైరెక్టర్` అని ట్యాగ్ కూడా అందుకున్నాడు. ఆ తర్వాత అదే మూసను చూడటానికి ప్రజలు విసిగిపోయారు. అతడి సినిమాలను నిర్ధయగా తిరస్కరించారు. పెద్ద హీరో చివరి అవకాశం కల్పించినా కానీ, మళ్లీ అదే మూస ధోరణి కారణంగా ఫ్లాప్ ను ఎదుర్కొని పూర్తిగా పరిశ్రమకు దూరమయ్యాడు.
ఇప్పుడు ప్రముఖ తమిళ దర్శకుడు తన మూస స్క్రిప్టులతో హీరోలను విసిగిస్తున్నాడని కథనాలొస్తున్నాయి. అతడు కోలీవుడ్ లో వెటరన్ హీరోకి కథ వినిపించి ఓకే చేయించాడు. కానీ స్క్రిప్టును ఆకర్షణీయంగా మలచడంలో విఫలమవ్వడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు తప్పుకోవాల్సి వచ్చింది. ఒక పెద్ద హీరోతో సినిమాని ప్రకటించి తప్పుకోవడం అతడికి ఒక రకంగా అవమానం. కానీ అతడు తనకు తానే స్వయంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. దీనిపై ప్రజలు రకరకాలుగా ఊహిస్తున్నారు. సదరు దర్శకుడు అప్పటికే ఇద్దరు హీరోలకు ఇదే కథను వినిపించి రిజెక్ట్ అయ్యాడు. వాళ్లు రిజెక్ట్ చేసాక ఈ పెద్ద హీరోకి అదే స్క్రిప్టును వినిపించాడు. రొటీన్ హారర్ స్క్రిప్ట్ వర్కవుట్ కాదని భావించిన పెద్ద హీరో ప్రాజెక్ట్ ను ప్రకటించాక కూడా రిజెక్ట్ చేసాడంటూ ముచ్చటించుకుంటున్నారు. అతడు ఒక కొత్త స్క్రిప్టుతో ఈ పెద్ద హీరోని ఒప్పించి ఉండాల్సిందని, ఇప్పుడు గ్రేట్ ఛాన్స్ మిస్సయిందని కూడా గుసగుసలాడుతున్నారు.
సూపర్‌స్టార్ తన కెరీర్‌లో ఎప్పుడూ దెయ్యాలు, భూతాలు అంటూ హారర్ కాన్సెప్ట్ సినిమాలు చేయలేదు. సైకలాజికల్ థ్రిల్లర్ లో మాంత్రికుడిగా నటించారు. కనీసం కెరీర్ లో ఒకసారి అయినా హారర్ జానర్ ట్రై చేయాల్సింది! అని కూడా అందరూ భావించారు. కానీ స్క్రిప్టు తో ఒప్పించడంలోనే దర్శకుడు విఫలమయ్యాడు. అతడు ఎప్పటిలానే మరో రొటీన్ హారర్ స్క్రిప్టును వినిపించడం వల్లనే మూడోసారి కూడా రిజెక్షన్ ఎదురైంది. ఇప్పుడు ఈ హీరో వేరొక దర్శకుడిని వెతుకుతున్నారని తెలుస్తోంది.