అగ్ర నిర్మాత పారితోషికం చెల్లించలేదని కోర్టుకు
ఈ చెల్లింపును పలు వాయిదాలలో చెల్లిస్తామని నిర్మాత మాటిచ్చారు. చివరి వాయిదా రూ. 1 కోటి సినిమా విడుదల కంటే ముందే చెల్లించాల్సి ఉన్నా కానీ అతడు చెల్లించలేదని శివకార్తికేయన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.;
సినీపరిశ్రమల్లో చెదురుముదురు వివాదాలు అప్పుడప్పుడూ హెడ్ లైన్స్ లోకొస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు నిర్మాతలతో స్టార్ హీరోల వివాదాలు చర్చగా మారుతున్నాయి. ఇప్పుడు స్టార్ హీరో సూర్య బంధువు, ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్‌రాజా రూ. 15 కోట్ల పారితోషికం చెల్లించలేదని ఆరోపిస్తూ కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
మిస్టర్ లోకల్ అనే సినిమాకు సంబంధించిన వివాదం ఇది. 15 కోట్ల పారితోషికం చెల్లింపులకు సంబంధించి సినిమా నిర్మాణం ప్రారంభం కాక ముందే, చాలా సంవత్సరాల క్రితమే ఒప్పందం కుదిరిందని శివకార్తికేయన్ చెబుతున్నారు. సినిమా ఆదాయానికి సంబంధించి నిర్మాత చెల్లించాల్సిన టీడీఎస్‌ను ఆదాయపు పన్ను విభాగానికి జమ చేయలేదని కూడా ఆయన ఆరోపించారు.
ది హిందూ కథనం ప్రకారం..2018 జూలై 6న నిర్మాతతో శివకార్తికేయన్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం, తనకు చెల్లించాల్సిన మొత్తం రూ. 15 కోట్లు.. దీనిలో 11 కోట్లు చెల్లించినా కానీ, మిగిలిన 4 కోట్ల బకాయిని చెల్లించలేదు. ఈ చెల్లింపును పలు వాయిదాలలో చెల్లిస్తామని నిర్మాత మాటిచ్చారు. చివరి వాయిదా రూ. 1 కోటి సినిమా విడుదల కంటే ముందే చెల్లించాల్సి ఉన్నా కానీ అతడు చెల్లించలేదని శివకార్తికేయన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.
`మిస్టర్ లోకల్’ చిత్రం 2019 మే 17న థియేటర్లలో విడుదలైంది. అప్పటికి కేవలం రూ. 11 కోట్లు మాత్రమే చెల్లించగా మిగిలిన బకాయిని చెల్లించాల్సి ఉందని, తాను పదేపదే గుర్తు చేసినా, వెంబడించినా కూడా చెల్లించలేదని ఆయన ఆరోపించారు. సినిమా విడుదల తర్వాత కూడా చెల్లించనందున కోర్టును ఆశ్రయించానని తెలిపారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 1న శివకార్తికేయన్‌కు ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు రావడంతో గొడవ మరింత ముదిరింది. అప్పటికే చెల్లించిన రూ. 11 కోట్లకు సంబంధించిన టీడీఎస్‌ను నిర్మాత జమ చేయడంలో విఫలమవడంతో ఈ నోటీసు జారీ అయింది. కోర్టులో ప్రత్యేక రిట్ పిటిషన్ వేసినా కానీ, శివకార్తికేయన్ బ్యాంక్ ఖాతా నుంచి 2019-20 మరియు 2020-21 అసెస్‌మెంట్ సంవత్సరాలకు గాను రూ. 91 లక్షలు ఆదాయపన్ను శాఖకు జప్తు అయ్యాయి. దీంతో అతడు ప్రస్తుత కేసును దాఖలు చేయాల్సి వచ్చింది.
అంతేకాదు ఈ వివాదం పరిష్కరించే వరకూ, జ్ఞానవేల్ నిర్మిస్తున్న రెబెల్, చియాన్ 61, పత్తు తల చిత్రాల నిర్మాణాన్ని ఆపేయాలని కూడా కోర్టును శివకార్తికేయన్ అభ్యర్థించారు. ముందుగా తన బకాయిని సెటిల్ చేయాలని కూడా డిమాండ్ చేసారు.
ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు ఈ చిత్రాలకు సంబంధించిన ఎలాంటి హక్కులను డిస్ట్రిబ్యూటర్లకు లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు అమ్మకుండా నిరోధించాలని కూడా అతడు ఇంజంక్షన్ కోరారు. ప్రస్తుతం ఈ కేసును విచారణకు జడ్జి లిస్టింగ్ చేశారు. నిర్మాతతో స్టార్ హీరో వివాదం సినీపరిశ్రమలో ఒప్పంద వివాదాలు, చెల్లింపులలో పారదర్శకతపై చర్చకు తెర తీయనుంది. మరోవైపు శివకార్తికేయన్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం `పరాశక్తి` విడుదల కోసం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం శివకార్తికేయన్ తన సినిమా రిలీజ్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.