ఆయన స్థాయికి నేను కథ రాయలేను..!

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు కిషోర్‌ తిరుమల రెగ్యులర్‌గా మీడియా ముందుకు వస్తూ ఉన్నాడు. ఒక వైపు చివరి దశ పనులు చూసుకుంటూ మరో వైపు సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటున్నాడు.;

Update: 2026-01-08 13:30 GMT

'నేను శైలజ' సినిమాతో సెన్సిబుల్‌ దర్శకుడిగా పేరు దక్కించుకున్న దర్శకుడు కిషోర్‌ తిరుమల ఈ సంక్రాంతికి భర్త మహాశయులకు విఘ్నప్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో మరో విజయాన్ని కొట్టబోతున్నట్లుగా దర్శకుడు కిషోర్ తిరుమల చాలా నమ్మకం గా కనిపిస్తున్నాడు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో డింపుల్‌ హయతి, అషికా రంగనాథ్‌లు హీరోయిన్‌లుగా నటించారు. ఇద్దరి మధ్య నలిగిపోయే పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యే సబ్జెక్ట్‌తో రూపొందిన ఈ సినిమాతో రవితేజ హిట్‌ కొట్టడం ఖాయం అని ఆయన అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు కిషోర్‌ తిరుమల రెగ్యులర్‌గా మీడియా ముందుకు వస్తూ ఉన్నాడు. ఒక వైపు చివరి దశ పనులు చూసుకుంటూ మరో వైపు సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటున్నాడు.

రవితేజ హీరోగా...

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన నుంచి వస్తున్న అతి పెద్ద ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ ఇదే అంటూ వ్యాక్యలు చేశాడు. తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల వారిని అలరించడం తో పాటు, పక్కా సంక్రాంతి మూవీ అనిపించుకుంటుంది అన్నాడు. అంతే కాకుండా ఈ సినిమా రవితేజ అభిమానులను తప్పకుండా ఆకట్టుకుంటుంది అనే విశ్వాసం వ్యక్తం చేశాడు. గతంలో ఇలాంటి నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో స్క్రీన్‌ ప్లే విభిన్నంగా ఉండటంతో పాటు, ఆకట్టుకునే కథ ఉంటుంది అంటున్నాడు. ఈ సినిమా తర్వాత మరిన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమాలు తన నుంచి వస్తాయి అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో రవితేజ నటన అద్భుతంగా ఉంటుంది అని, ఎంతో మంది భర్తలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా, భర్తల అందరి తరపున మాట్లాడుతున్నట్లుగా ఉంటుందని సినిమా ట్రైలర్‌ ను చూస్తే అనిపిస్తోంది.

రజనీకాంత్‌తో సినిమా సాధ్యం కాదు..

ఇంకా కిషోర్‌ తిరుమల మాట్లాడుతూ... తనకు చిన్నప్పటి నుంచి రజనీకాంత్‌ సినిమాలు అంటే ఇష్టం. ముఖ్యంగా తాను 10వ తరగతిలో ఉన్న సమయంలో ఒంటరిగా రజనీకాంత్‌ భాషా సినిమాకు వెళ్లాను. ఆ సినిమాలోని రజనీకాంత్‌ స్టైల్‌ను చూసి షాక్ అయ్యాను. ఆ తర్వాత నరసింహా ఇంకా చాలా సినిమాలు రజనీకాంత్‌ గారిని నా దృష్టిలో అక్కడ పెట్టాయని అన్నాడు. ఇంటర్వ్యూలో మీరు ఏ హీరోకు కథను రాయలేను, ఆయన స్థాయి నాది కాదు అనుకుంటారు అంటూ ప్రశ్నించిన సమయంలో రజనీకాంత్‌ పేరును దర్శకుడు చెప్పాడు. ఆయన సినిమాలను చూస్తే ఇలాంటి వ్యక్తికి మనం ఎలాంటి కథను రాసినా ఆనదు, అయినా ఆయన కోసం కథ రాస్తే అక్కడి వరకు వెళ్తుందా అని కూడా నాకు నేను అనుకునేవాడిని. ఆయన స్థాయికి కథను రాయడం నా వల్ల కాదు అన్నట్లుగా కిషోర్ తిరుమల తనకు రజనీకాంత్‌ పై ఉన్న అభిమానంను చెప్పుకొచ్చాడు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో

ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా విషయానికి వస్తే రవితేజ గత చిత్రాలు నిరాశను మిగిల్చాయి. కనుక ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాడు. చాలా స్పీడ్‌గా ఈ సినిమా రూపొందింది. తక్కువ సమయంలోనే విడుదలకు రెడీ అయింది. రవితేజ గత చిత్రం చాలా ఆలస్యం అయిన కారణంగా ఈ సినిమా ను చాలా స్పీడ్‌గా ముగించారని తెలుస్తోంది. దర్శకుడు కిషోర్‌ తిరుమల తన మార్క్‌ సెన్సిబుల్‌ స్క్రీన్‌ప్లేను కొనసాగిస్తూనే వినోదాన్ని పండించబోతున్నాడు అంటూ ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతోంది. సినిమాకు ప్రమోషన్‌ జోరుగానే సాగుతోంది. సంక్రాంతికి ఉన్న ఇతర నాలుగు సినిమాలతో పోల్చితే ఈ సినిమాకు కూడా మంచి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కనుక చిరంజీవి అన్నట్లుగా ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్‌ అవ్వాలి, రవితేజ భర్తమహాశయులకు విజ్ఞప్తి సినిమాతో పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యమో కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News