కిరణ్ అబ్బవరం లైనప్.. డైరెక్టర్ గా కూడా దీపావళి హిట్ ఇస్తుందా?
అయితే ఇప్పటికే హీరోగా రాణిస్తున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు నిర్మాతగా, దర్శకుడిగా కూడా తన ప్రతిభను చూపించేందుకు సిద్ధమవుతున్నారు.;
యంగ్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. ఇటీవల విడుదలైన చిత్రాలతో వరుస విజయాలు సాధించి, మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయన చేసే ప్రతి ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. అంతే కాదు ఆయన లైనప్ కోసం ఎప్పటికప్పుడు చర్చ జరుగుతోంది.
అయితే ఇప్పటికే హీరోగా రాణిస్తున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు నిర్మాతగా, దర్శకుడిగా కూడా తన ప్రతిభను చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం తిమ్మరాజు పల్లి టీవీ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఆ సినిమాను ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆ చిత్రంతో నిర్మాతగా ఆయన ఎలా మెప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు.. రియాలిటీ అనే కొత్త ప్రాజెక్ట్ ను కూడా కిరణ్ అబ్బవరం ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఆ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుందని సమాచారం. కథ, స్క్రీన్ ప్లే విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రియాలిటీ సినిమాను దీపావళి సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
గతేడాది దీపావళి పండుగకు విడుదలైన ఆయన క సినిమా మంచి విజయాన్ని సాధించడంతో, అదే సీజన్ ను మళ్లీ టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈసారి మాత్రం దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నిజానికి కిరణ్ అబ్బవరానికి సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే కథలు రాయడం, షార్ట్ ఫిలిమ్స్ ను డైరెక్ట్ చేయడం వంటి అనుభవం ఉంది. ఆ అనుభవమే ఇప్పుడు రియాలిటీ మూవీకిగాను ఉపయోగపడనుందని చెప్పాలి.
తనకు నచ్చిన కథను, తన శైలిలో తెరకెక్కించే అవకాశం రావడంతో ఆయన రియాలిటీ ప్రాజెక్ట్ పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం కెరీర్ కీలక దశలో ఉంది. హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే దర్శకుడిగా మారడం డేరింగ్ డెసిషన్ గా భావించవచ్చు. అయితే గతంలో సంపాదించిన అనుభవం, ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూ ఆయనకు ప్లస్ పాయింట్లుగా మారే అవకాశముంది.
మొత్తానికి, తిమ్మరాజు పల్లి టీవీ మూవీతో నిర్మాతగా, రియాలిటీ చిత్రంతో దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పించాలన్న టార్గెట్ తో కిరణ్ అబ్బవరం ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా దీపావళి బరిలో దర్శకుడిగా ఆయన ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి డైరెక్టర్ గా కొత్త జర్నీలో ఆయన సక్సెస్ సాధిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.