ఘ‌ట్ట‌మ‌నేని జ‌య‌కృష్ణ ఆరంగేట్రం వెన‌క కిర‌ణ్ అబ్బ‌వ‌రం!

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మధ్య ఉన్న స‌త్సంబంధాలు కొత్త నటుడు జయకృష్ణ ఎంట్రీకి ప్రధాన కారణమైంది.

Update: 2026-07-28 03:40 GMT

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మధ్య ఉన్న స‌త్సంబంధాలు కొత్త నటుడు జయకృష్ణ ఎంట్రీకి ప్రధాన కారణమైంది. సూపర్ స్టార్ కృష్ణ మనవడైన జయకృష్ణను వెండితెరకు పరిచయం చేసే ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టడం వెనుక కిరణ్ అబ్బవరం కీలక పాత్ర పోషించారని అజయ్ భూపతి స్వయంగా తాజా ఇంట‌ర్వ్యూలో వెల్లడించారు. ఈ క్రమంలో ఈ కొత్త సినిమా ఎలా పట్టాలెక్కిందో చెబుతూ దర్శకుడు పలు ఆసక్తికర విషయాలను రివీల్ చేసారు.

అజయ్ భూపతి వద్ద ఒక సరికొత్త కథ సిద్ధంగా ఉందనే విషయం కిరణ్ అబ్బవరానికి ముందు నుంచే తెలుసు. నిజానికి కోవిడ్ సమయం కంటే ముందు నుంచే అజయ్ భూపతి, కిరణ్ అబ్బవరం కాంబినేషన్‌లో ఒక సినిమా చేయాలని చర్చలు జరిగాయి. అయితే అనుకోకుండా ఒకరోజు కిరణ్ అబ్బవరం వచ్చి ఈ కథకు జయకృష్ణ సరిపోతాడని.. నిర్మాత వైజయంతి మూవీస్ దత్ గారు - ప్రసన్న గారు కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నారని అజయ్ భూపతి దృష్టికి తీసుకెళ్లారు.

ఆ సమయంలో అజయ్ భూపతి వేరే ప్రాజెక్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నా.. కిరణ్ అబ్బవరం ప్రతిపాదించడంతో ఆలోచనలో పడ్డారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ పై అజయ్ భూపతికి అపారమైన అభిమానం ఉంది. కృష్ణ గారి మనవడు జయకృష్ణను కలిసేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. కిరణ్ అబ్బవరం ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ కాంబినేషన్‌కు తొలి అడుగు పడిందని చెప్పవచ్చు.

ఆ తర్వాత అజయ్ భూపతి జయకృష్ణను స్వయంగా కలిసి రెండు మూడు సార్లు విస్తృతంగా చర్చలు జరిపారు. జయకృష్ణతో మాట్లాడిన తర్వాత, అతనిలోని ఉత్సాహం.. కృష్ణ గారి కుటుంబంతో ఉన్న భావోద్వేగ అనుబంధం (ఎమోషనల్ రీజన్స్) కారణంగా ఈ సినిమా వెంటనే చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. జయకృష్ణ క్యారెక్టర్ - నటన పట్ల నమ్మకం కుదరడంతో ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు.

ఒక్కసారి ప్రాజెక్ట్‌కి ఒకే చెప్పిన తర్వాత వెనుకంజ వేయకుండా.. పూర్తి స్థాయిలో ఈ సినిమా పనుల్లో దిగిపోయానని అజయ్ భూపతి తెలిపారు. ఒకసారి రంగంలోకి దిగాక ఇక దేని గురించీ ఆలోచించలేదని... కిరణ్ అబ్బవరం అందించిన ప్రోత్సాహం.. జయకృష్ణపై ఉన్న నమ్మకమే ఈ సినిమా పట్టాలెక్కడానికి ముఖ్య కారణమని ఆయన ముగించారు. దాంతో ఈ అరుదైన కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్న ర‌మేష్ బాబు కుమారుడైన జ‌య‌కృష్ణ డెబ్యూ సినిమా ప్ర‌మోష‌న్స్ కి సూప‌ర్ స్టార్ మ‌హేష్ త‌న‌వంతు స‌హ‌కారం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ గురువారం (30జూలై) సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

Tags:    

Similar News