కింగ్ నాగార్జున 100వ మూవీ క్రేజీ డిటైల్స్‌!

ఇందులో భాగంగానే త‌న వంద‌వ ప్రాజెక్ట్‌కు సైలెంట్‌గా శ్రీ‌కారం చుట్టారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున న‌టిస్తూ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నాడు.;

Update: 2026-03-03 01:30 GMT

టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్స్‌లో రేసులో ముందు వ‌రుస‌లో నిలుస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌, విక్ట‌రీ వెంక‌టేష్‌. చిరంజీవి `మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌` మూవీతో ఈ సంక్రాంతికి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా రూ.300 కోట్లు రాబ‌ట్టి త‌న స‌త్తా చాటుకున్నారు. ఇక నంద‌మూరి బాల‌కృష్ణ `భ‌గ‌వంత్ కేస‌రి, `డాకు మ‌హారాజ్ వంటి సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ సూప‌ర్ హిట్‌ల‌ని తన ఖాతాలో వేసుకున్నారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌లై `అఖండ 2` కూడా మంచి వ‌సూళ్ల‌నే రాబ‌ట్టింది.

ఇక వెంకీ మాము గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. గ‌త ఏడాది సంక్రాంతి బ‌రిలో `సంక్రాంతికి వ‌స్తున్నాం` అంటూ భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్నారు. అయితే వీరి త‌ర‌హాలో కింగ్ నాగార్జున మాత్రం స‌క్సెస్‌ల‌ని సొంతం చేసుకోలేక `కుబేర‌`, కూలీ` లాంటి సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూ వ‌స్తున్నారు. దీంతో ఆయ‌న అభిమానులు కొంత నిరాశ‌కు లోన‌వుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే కింగ్ నాగార్జున మ‌ళ్ల త‌న‌దైన మార్కు సూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్‌తో ట్రాక్‌లోకి రావాల‌నే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు.

ఇందులో భాగంగానే త‌న వంద‌వ ప్రాజెక్ట్‌కు సైలెంట్‌గా శ్రీ‌కారం చుట్టారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున న‌టిస్తూ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి త‌మిళ ద‌ర్శ‌కుడు న‌వీన్ (ఆర్‌. కార్తీక్) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. #king100 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈమూవీకి `లాట‌రీ కింగ్‌` అనే టైటిల్‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టుగా తెలిసింది. అంతే కాకుండా ఇందులోని కీల‌క పాత్ర‌లో ట‌బు న‌టిస్తుండ‌గా కింగ్‌కు జోడీగా స్టార్ హీరోయిన్ శ్రీ‌లీల న‌టించే అవ‌కాశం ఉంద‌ని ఇన్ సైడ్ టాక్‌.

పీరియాడిక్ డ్రామాగా, ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా దీన్ని అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇందులో నాగార్జున ప‌వ‌ర్‌ఫుల్ కింగ్‌గా క‌నిపించ‌నున్నార‌ట‌. గ‌త కొంత కాలంగా త‌న‌దైన మార్కు సినిమాని అందించాల‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తూ వ‌చ్చిన నాగార్జున ఈ మూవీని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌కుండా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం స‌రికొత్త నేప‌థ్యాన్ని ఎంచుకుని పీరియాడిక్ ఫిక్ష‌న‌ల్ స్టోరీతో దీన్ని తెర‌పైకి తీసుకొస్తున్నార‌ట‌.

భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలోని కీల‌క అతిథి పాత్ర‌ల్లో నాగ‌చైత‌న్య‌, అఖిల్ కనిపించి అక్కినేని అభిమానుల్ని స‌ర్‌ప్రైజ్ చేయ‌నున్నార‌ని, మ‌రోసారి అక్కినేని ఫ్యామిలీ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `మ‌నం`ని గుర్తు చేయ‌బోతున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం టీమ్ క‌ర్ణాట‌క‌లోని మైసూర్‌కు వెళుతోంది. అక్క‌డే ఛారిత్రక క‌ట్ట‌డాల నేప‌థ్యంలో ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ని చిత్రీక‌రించ‌బోతున్నారు. ఈ షెడ్యూల్ సినిమాకు అత్యంత కీల‌కం అని, సినిమాలో ఈ స‌న్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయ‌ని ఇన్ సైడ్ టాక్‌.

Tags:    

Similar News