పై కోర్టుకు వెళ్లినా కార్తీకి మోక్షం ఏదీ?
వివాదం పూర్వా పరాల్లోకి వెళితే.. నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ (జ్ఞానవేల్ రాజా) ఈ సినిమాను సంక్రాంతి కానుకగా (జనవరి 14న) విడుదల చేసేందుకు అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది.;
తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం `వా వాతియార్` తెలుగులో `అన్నగారు వస్తారు` పేరుతో విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతుండటంతో కార్తీ అభిమానులు గందరగోళంలో ఉన్నారు. అసలేం జరుగుతోంది? అంటూ ఆరాలు తీస్తున్నారు. ఈ ఉత్కంఠకు మద్రాస్ హైకోర్టు తాజా తీర్పుతో మరో షాక్ తగిలింది. నిన్న (జనవరి 9, 2026) జరిగిన విచారణలో కోర్టు నిర్మాతలకు ఎటువంటి ఊరట ఇవ్వలేదు.
వివాదం పూర్వా పరాల్లోకి వెళితే.. నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ (జ్ఞానవేల్ రాజా) ఈ సినిమాను సంక్రాంతి కానుకగా (జనవరి 14న) విడుదల చేసేందుకు అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. కానీ తీర్పు సానుకూలంగా లేదు. గతంలో ఉన్న ఆర్థిక వివాదాల నేపథ్యంలో నిర్మాత సుమారు 22 కోట్లు కోర్టులో డిపాజిట్ చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఆ మొత్తం పూర్తిగా చెల్లించే వరకు సినిమాను థియేటర్లలో కానీ, ఓటీటీలో కానీ విడుదల చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. పాక్షిక చెల్లింపుతో సినిమాను విడుదల చేసుకుంటామన్న నిర్మాత విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.
వ్యాపారవేత్త అర్జున్‌లాల్ సుందర్‌దాస్ (ప్రస్తుతం మరణించారు) తో జ్ఞానవేల్ రాజాకు మంచి సంబంధాలున్నాయి. కానీ అర్జున్‌లాల్ దివాలా తీయడంతో ఆయన ఆస్తులను కోర్టు ఆధీనంలోకి తీసుకుంది. ఆయనకు చెల్లించాల్సిన బాకీలను నిర్మాత జ్ఞానవేల్ రాజా ఇప్పటికీ వడ్డీతో సహా చెల్లించలేదని కోర్టు నియమించిన అఫీషియల్ అసైనీ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఇదే సమస్య వల్ల సూర్య నటించిన `కంగువ` విడుదలకు కూడా ఆటంకాలు ఎదురయ్యాయి. అప్పుడు కొంత మొత్తం చెల్లించి విడుదల చేసుకున్నారు. కానీ ఇప్పుడు కూడా అదే ఎదురొచ్చింది.
కార్తీ -కృతి శెట్టి జంటగా నటించిన `అన్నగారు వస్తారు` భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. సంక్రాంతి బరిలో విడుదల కావాల్సి ఉన్నా కోర్టు స్టే కారణంగా వాయిదాపడింది. నిర్మాతలు వెంటనే రూ.21 కోట్లకు పైగా మొత్తాన్ని డిపాజిట్ చేస్తేనే ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది.