షూటింగ్ సెట్‌లో తీవ్ర ఉద్రిక్తత!

90వ దశకంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను త‌న‌ నృత్యాలతో.. గ్లామర్‌తో శాసించిన అగ్ర కథానాయికలలో కరిష్మా కపూర్ ఒకరు.

Update: 2026-05-19 23:30 GMT

90వ దశకంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమను త‌న‌ నృత్యాలతో.. గ్లామర్‌తో శాసించిన అగ్ర కథానాయికలలో కరిష్మా కపూర్ ఒకరు. తెరపై ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపించే నటికి సంబంధించిన ఓ పాత వివాదం తాజాగా ఇండస్ట్రీ వర్గాలలో సంచలనం సృష్టిస్తోంది. ఓ సినిమా షూటింగ్ సెట్‌లో కరిష్మా కపూర్.. లెజెండరీ కొరియోగ్రాఫర్ మాస్టర్ సరోజ్ ఖాన్ బృందానికి చెందిన ఓ జూనియర్ డ్యాన్సర్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. అక్క‌డితో ఆగ‌కుండా అసభ్య పదజాలంతో దూషించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలానికి దారితీసింది.

వివాదం వివరాల్లోకి వెళితే.. `భారీ పాట చిత్రీకరణ జరుగుతోన్న సమయంలో కరిష్మా కపూర్ కొరియోగ్రఫీ స్టెప్స్‌ను సరిగ్గా ఫాలో అవ్వలేకపోయారు. ఆ సమయంలో సరోజ్ ఖాన్ అసిస్టెంట్ .. గ్రూప్ డ్యాన్సర్లలో ఒకరు కరిష్మాకు స్టెప్స్ నేర్పించడానికి ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో తీవ్రమైన ఒత్తిడి లేదా విసుగులో ఉన్న కరిష్మా కపూర్ సదరు డ్యాన్సర్‌పై ఒక్కసారిగా అరిచారు. అందరి ముందు అవమానకరంగా మాట్లాడారు. షూటింగ్ సెట్‌లో వందలాది మంది సిబ్బంది చూస్తుండగానే జరిగిన ఘోర పరాభవం సదరు డ్యాన్సర్‌ను మానసికంగా ఎంతో కుంగదీసింది.

తమ టీమ్ సభ్యురాలికి జరిగిన అవమానాన్ని కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ అస్సలు సహించలేకపోయారు. సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లు పడే కష్టాన్ని ఎల్లప్పుడూ గౌరవించే సరోజ్ ఖాన్.. కరిష్మా కపూర్ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక నటిగా ఎంత స్టార్ హోదా ఉన్నా? తోటి కళాకారులను ఇలా తక్కువ చేసి మాట్లాడటం సంస్కారం కాదని మండిపడ్డారు. ఈ వివాదం ఎంత ముదిరిందంటే? భవిష్యత్తులో తాను కరిష్మా కపూర్‌తో కలిసి ఎప్పటికీ పనిచేయబోనని సరోజ్ ఖాన్ సెట్ లోనే శపథం చేశారు. సరిగ్గా ఇదే సమయంలో బాలీవుడ్ మరో అగ్ర కథానాయిక, నృత్య కోకిల మాధురీ దీక్షిత్ పేరు కూడా ఈ వివాదంలోకి వ‌చ్చారు.

సరోజ్ ఖాన్‌కు అత్యంత ఆప్తురాలైన మాధురీ దీక్షిత్.. దశాబ్దాలుగా సరోజ్ మాస్టర్ కొరియోగ్రఫీలోనే ఎన్నో క్లాసిక్ హిట్స్ అందుకున్నారు. షూటింగ్ సెట్లలో మాధురి చూపించే క్రమశిక్షణ, డ్యాన్సర్ల పట్ల ఆమెకు ఉండే హుందాతనాన్ని గుర్తుచేస్తూ.. కరిష్మా కపూర్ ప్రవర్తనను మాధురితో పోల్చి చూశారు. అగ్ర నటీమణులుగా ఎదిగిన వారు సెట్లలో ఎలా నడుచుకోవాలో మాధురీ దీక్షిత్‌ను చూసి నేర్చుకోవాలంటూ అప్పట్లో కొందరు ఇండస్ట్రీ పెద్దలు వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమలో తెరపై కనిపించే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో ఇగోలు, ఘర్షణలు దాగి ఉంటాయనడానికి ఈ పాత ఉదంతం ఉదాహరణ.

నటీనటులు షూటింగ్ షెడ్యూల్స్ , క్యారెక్టర్ల వల్ల ఒత్తిడికి గురవడం సహజమే అయినా? ఆ ఒత్తిడిని తోటి కార్మికులపై చూపించడం సమర్థించదగినది కాదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరోజ్ ఖాన్ వంటి సీనియర్ టెక్నీషియన్ అంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవడం వెనుక కరిష్మా కపూర్ చేసిన వ్యాఖ్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Tags:    

Similar News