కరీనా కపూర్ చదువుకుంది ఇంటరేనా?
చిన్న వయసులోనే నటన వైపు అడుగులు వేయడం వల్ల చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని.. అది తనలో ఎప్పటికీ వెలితిగానే మిగిలిపోయిందని పేర్కొన్నారు.
హీరోయిన్లు అంటే? దాదాపు అంతా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లే. పెద్ద పెద్ద చదువులు చదువుకుని వస్తుంటారు. డాక్టర్లు..ఇంజనీర్లు... మేనేజ్ మెంట్ కోర్సులు సహా ఇష్టమైన చదువులన్నీ చదివేస్తుంటారు. కానీ బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ చదువు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అవును కరీనా కపూర్ చదువు ఇంటర్మీడియట్ తోనే ఆపేసిందని ఎంత మందికి తెలుసు? ఈ విషయాన్ని స్వయంగా కరీనా కపూర్ వెల్లడించారు. చలనచిత్ర పరిశ్రమలో దశాబ్దాల తరబడి అగ్ర నటిగా రాణిస్తున్నా? తన జీవితంలో చదువు విషయంలో మాత్రం తీవ్రమైన అసంతృప్తి ఉందని కరీనా బాహాటంగా అంగీకరించారు. చిన్న వయసులోనే నటన వైపు అడుగులు వేయడం వల్ల చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని.. అది తనలో ఎప్పటికీ వెలితిగానే మిగిలిపోయిందని పేర్కొన్నారు.
నటనపై ఉన్న అమితమైన ఆసక్తితో ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత చదువుకు స్వస్తి చెప్పినట్లు కరీనా ఓ పాడ్‌కాస్ట్ లో వెల్లడించారు. `అప్పట్లో నాకు చదువును పూర్తి చేసే అవకాశం ఉన్నా? నటిగా నన్ను నేను నిరూపించుకోవాలనే తపనతో సినిమాల్లోకి వచ్చాను. నా నిర్ణయంపై చాలామంది విమర్శలు చేసి ఉండవచ్చు. కానీ ఆ సమయంలో నా మనసు చెప్పిన మాటనే విన్నాను` అని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.
తాను కోల్పోయిన ఆ విద్య ప్రాధాన్యతను ఇప్పుడు తన పిల్లలకు నేర్పిస్తున్నట్లు కరీనా స్పష్టం చేశారు. కుమారులు తైమూర్, జేహ్‌లు ముందుగా చదువును పూర్తి చేసిన తర్వాతే వారి ఇష్టానుసారం ఇతర రంగాల వైపు వెళ్లాలని తాను ఖచ్చితమైన నియమం విధించినట్లు చెప్పారు. తల్లిగా తాను పడిన పశ్చాత్తాపం తన పిల్లల భవిష్యత్తుకు ఒక పాఠంగా మారాలని కరీనా కోరుకుంటున్నారు. చదువు పూర్తి చేయలేకపోయాననే ఆవేదన వల్లనే `యునిసెఫ్` భారత్‌లో బాలికల విద్య కోసం చేపడుతున్న కార్యక్రమాలకు తాను మద్దతుగా నిలుస్తున్నానని కరీనా వెల్లడించారు.
2014 నుంచి యునిసెఫ్ తరఫున రాయబారిగా వ్యవహరిస్తూ సమాజంలో బాలికల విద్య, లింగ సమానత్వం , పిల్లలకు నాణ్యమైన విద్యనందించే అంశాలపై కరీనా నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. కరీనా సొంత అనుభవమే సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామి కావడానికి ప్రధాన ప్రేరణగా నిలిచిందని తెలిపారు.
కరీనా సినీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే జేపీ దత్తా దర్శకత్వంలో 2000లో రిలీజ్ అయిన `రెఫ్యూజీ` సినిమా తో వెండి తెరకు పరిచయమయ్యారు. 19 ఏళ్ల వయసులో అభిషేక్ బచ్చన్ సరసన కథానాయికగా నటించారు. ఆ సినిమాలో నటనతో కరీనా కపూర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నాటి నుంచి బాలీవుడ్‌లో కరీనా కెరీర్ వెనక్కి తిరిగి చూకుండా సాగిపోతుంది. ప్రస్తుతం కరీనా కపూర్ మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `దాయరా` అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో డిసిపి అజూని కోహ్లీ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.