ఫోక్ హారర్ మార్కెట్‌పై కరణ్ ఫోకస్!

బాలీవుడ్‌లో ప్రేమకథలు, ఫ్యామిలీ డ్రామాలు, అర్బన్ ఎంటర్‌టైనర్లకు చిరునామాగా నిలిచిన కరణ్ జోహార్ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జానర్ వైపు అడుగులు వేస్తున్నారు.

Update: 2026-06-16 16:30 GMT

బాలీవుడ్‌లో ప్రేమకథలు, ఫ్యామిలీ డ్రామాలు, అర్బన్ ఎంటర్‌టైనర్లకు చిరునామాగా నిలిచిన కరణ్ జోహార్ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జానర్ వైపు అడుగులు వేస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా హిందీ సినీ పరిశ్రమలో స‌క్సెస్‌ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్న కరణ్ జోహార్, తన ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా తొలిసారిగా మలయాళ సినీ పరిశ్రమలోకి ప్రవేశించడమే కాకుండా, ఫోక్ హారర్ నేపథ్యంలో రూపొందుతున్న ఒడియన్: ది ఏజ్ ఆఫ్ ఇల్యూషన్ సినిమాను నిర్మించడం ఆసక్తికర చర్చకు దారితీసింది.

ఇప్పటివరకు ధర్మా ప్రొడక్షన్స్ పేరంటే ప్రేక్షకులకు కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, ఏ దిల్ హై ముష్కిల్, రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ వంటి ప్రేమకథలే ఎక్కువ‌గా గుర్తుకు వస్తాయి. మధ్యలో కొన్ని హారర్ ప్రాజెక్ట్‌లను నిర్మించినప్పటికీ, భారతీయ జానపద గాథలు, పురాణ విశ్వాసాలు, రూపాంతర శక్తులు వంటి అంశాలతో కూడిన స్వచ్ఛమైన ఫోక్ హారర్ సినిమాను నిర్మించడం మాత్రం ఇదే మొద‌టిసారి.

అందుకే ఒడియన్: ది ఏజ్ ఆఫ్ ఇల్యూషన్ ప్రాజెక్ట్ కేవలం మరో సినిమా కాకుండా ధర్మా ప్రొడక్షన్స్ వ్యూహంలో వచ్చిన కీలక మార్పుగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, మంజు వారియర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భూతకాలం, బ్రహ్మయుగం వంటి ప్రశంసలు పొందిన హారర్ సినిమాల డైరెక్ట‌ర్ రాహుల్ సదాశివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండ‌టం విశేషం.

ఇటీవలి కాలంలో భారతీయ సినీ పరిశ్రమలో ఫోక్ హారర్ జానర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. స్థానిక పురాణాలు, జానపద గాథలను ఆధారంగా చేసుకుని రూపొందిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధిస్తున్నాయి. కన్నడలో కాంతారా, మలయాళంలో బ్రహ్మయుగం వంటి సినిమాలు ఈ ట్రెండ్‌కు బలమైన ఉదాహరణలుగా నిలిచాయి. ఇప్పుడ‌దే దారిలో ఒడియన్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. కేరళ జానపద గాథల్లో ప్రసిద్ధి చెందిన ఒడియన్ వంశానికి సంబంధించిన పురాణ కథల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. రూపం మార్చుకునే శక్తులు, క్షుద్ర విద్యలు, గ్రామీణ విశ్వాసాలు, భయానక వాతావరణం వంటి అంశాలు కథలో కీలకంగా ఉండనున్నాయి. ఈ నేపథ్యం కారణంగానే ఈ సినిమా సాధారణ హారర్ సినిమాలకు భిన్నంగా ఉండబోతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ధర్మా ప్రొడక్షన్స్ తొలి మలయాళ సినిమా కావడం, కరణ్ జోహార్ కెరీర్‌లో తొలి ఫోక్ హారర్ ప్రాజెక్ట్ కావడం, ప్రస్తుతం ఫోక్ హారర్ జానర్‌కు పెరుగుతున్న డిమాండ్.. ఈ మూడు అంశాలు కలిసి ఒడియన్: ది ఏజ్ ఆఫ్ ఇల్యూషన్ పై దేశవ్యాప్తంగా ఆసక్తిని పెంచేశాయి. ఈ సినిమా కరణ్ జోహార్‌కు కొత్త అధ్యాయాన్ని తెరుస్తుందా లేదా అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News