స్టార్ ఫిలిం మేకర్ కి క్లారిటీ లేదా..?
బాలీవుడ్ గత కొంతకాలంగా తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎంతోమంది స్టార్ ఫిలిం మేకర్లు వరుస పరాజయాలను చవిచూస్తున్నారు.;
బాలీవుడ్ గత కొంతకాలంగా తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎంతోమంది స్టార్ ఫిలిం మేకర్లు వరుస పరాజయాలను చవిచూస్తున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ అందించిన నిర్మాతలు కూడా ఇప్పుడు మినిమం సక్సెస్ సినిమాలను నిర్మించలేకపోతున్నారు. కేవలం నిర్మాతలే కాకుండా దర్శకులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఇష్టపడుతున్నారో అర్థం కావడం లేదు అనేది బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కంప్లైంట్. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలను చేయకుండా సేఫ్ జోన్ లో సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తమకు కలిసి వచ్చిన కాంబినేషన్లను వెతుక్కుంటున్నారు. అంతేకాకుండా ఒక కాంబినేషన్ హిట్ అయితే అదే కాంబినేషన్లో మరిన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నారు.
కరణ్ జోహార్ బాలీవుడ్ లో....
కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన బాలీవుడ్ ఫిలిం మేకర్ అయినప్పటికీ సినిమాల గురించి తెలిసిన ప్రతి ఒక్క ఇండియన్ కి ఆయన సుపరిచితుడు. కేవలం నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా, టాక్ షో హోస్ట్గా కూడా ఆయన అందరికీ తెలిసిన వాడే. ఆయన దర్శకత్వంలో సినిమా వచ్చి చాలా కాలమైంది.. ఆయన హిట్ సినిమా తీసి చాలా రోజులైంది అంటూ ఆయన సన్నిహితులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు స్టార్స్ తమ వారసులను కరణ్ జోహార్ బ్యానర్లో పరిచయం చేసేందుకు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరణ్ జోహార్ బ్యానర్ లో సినిమా చేస్తే ఏ మేరకు సక్సెస్ దక్కుతుందో ఇప్పటికే అందరికీ అర్థమయింది. కొందరు మాత్రం కరణ్ జోహార్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడు ప్రేక్షకుల అభిరుచి తగ్గట్లుగా సినిమాలను నిర్మిస్తాడు. ఆయన దర్శకత్వంలో కూడా మరిన్ని సినిమాలు వస్తాయి అని ఆశతో ఎదురుచూస్తున్నారు. కరణ్ జోహార్ మాత్రం నిర్మాతగానే ఎక్కువ సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు.
కార్తీక్ ఆర్యన్ హీరోగా...
సాధారణంగా ఒక నిర్మాత ఒకేసారి మూడు నాలుగు సినిమాలను నిర్మిస్తాడు. కానీ ఆ మూడు నాలుగు సినిమాలను ఒకే హీరోతో నిర్మించే సాహసం మాత్రం చేయడు, కానీ కరణ్ జోహార్ అదే పని చేస్తున్నాడు. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో కరణ్ జోహార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో తూ మేరీ మై తేరా మై తేరా తు మేరీ సినిమా పూర్తయింది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కార్తీక్ ఆర్యన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కరణ్ జోహార్ బ్యానర్లో మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే నాగ్ జిల్లా అనే సినిమాలో కరణ్ జోహార్ నిర్మాణంలో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండు సినిమాలు కరణ్ జోహార్ బ్యానర్లో ఇప్పటికే చేసిన కార్తీక్ ఆర్యన్ మరో సినిమాకు సైన్ చేశాడు అంటూ బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
ఒకేసారి మూడు సినిమాలతో కరణ్ జోహార్
కార్తీక్ ఆర్యన్ హీరోగా కరణ్ జోహార్ నిర్మాణంలో రూపొందబోతున్న మూడవ సినిమాకి సందీప్ మోడీ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటి వరకు కరణ్ జోహార్ బ్యానర్లో కార్తీక్ ఆర్యన్ చేసిన రెండు సినిమాలు రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీస్ కాగా సందీప్ మోడీ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంగా ఉంటుందని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. కరణ్ జోహార్ ఈ ప్రాజెక్టు పట్ల చాలా ఆసక్తిగా ఉన్నాడట, అందుకే కార్తీక్ ఆర్యన్ తో నిర్మించిన మొదటి రెండు సినిమాలు విడుదల కాకముందే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడని సమాచారం అందుతుంది. సాధారణంగానే కరణ్ జోహార్ వంటి నిర్మాత బ్యానర్లో వచ్చే యాక్షన్ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఒకింత ఆసక్తి ఉంటుంది. ఆయన తన జోనర్ కి దూరంగా జరిగి ఈ సినిమా చేస్తున్నాడు అందుకే ఈ సినిమా సక్సెస్ అవుతుందనే ధీమా వ్యక్తం అవుతుంది. మరి కొందరు మాత్రం కరణ్ జోహార్ కి ఏ సినిమా నిర్మించాలో అనే క్లారిటీ లేకపోవడం వల్లే కార్తీక్ ఆర్యన్ తో వరుస సినిమాలను నిర్మిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.