తన కంపెనీని వదిలేసిన స్టార్లపై అగ్రనిర్మాత పంచ్‌లు!
నేటి తరం నటీనటుల మనస్తత్వం గురించి విశ్లేషిస్తూ కరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;
బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ తన టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ధర్మ కార్నర్‌స్టోన్ ఏజెన్సీ (డిసిఏఏ) నుండి నటీనటులు వరుసగా వైదొలగడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల తనకెంతో ఆప్తురాలైన జాన్వీ కపూర్ ఈ ఏజెన్సీ నుండి బయటకు వెళ్లడం కరణ్‌ను ఆలోచనలో పడేసింది. టాలెంట్ మేనేజ్‌మెంట్ అనేది ఒక కృతజ్ఞత లేని వృత్తి అని, ఇదొక విష వలయంలా మారిందని ఆయన ఆవేదన చెందారు. నటీనటులు ఒత్తిడి కారణంగా ఒక చోటు నుండి మరో చోటుకు నిరంతరం మారుతుండటం పరిశ్రమలో ఒక అనారోగ్యకరమైన ధోరణికి దారితీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
నేటి తరం నటీనటుల మనస్తత్వం గురించి విశ్లేషిస్తూ కరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా, ఆధునిక సాంకేతికత కారణంగా నేటి తారలు చాలా చంచలంగా మారుతున్నారని.. కష్టపడటం కంటే వేగంగా పెద్ద స్టార్లు అయిపోవాలని వారు తొందరపడుతున్నారని అన్నారు. రణవీర్ సింగ్, పరిణీతి చోప్రా, జాన్వీ కపూర్ వంటి స్టార్స్ తమ ఏజెన్సీలను మార్చడాన్ని ఆయన గుర్తు చేస్తూ, నేటి తరం నటులు నిరంతరం ఆందోళన, గుర్తింపు కోసం ఆత్రుత పడుతున్నారని.. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిపోయిందని విశ్లేషించారు.
సినిమా రంగంలో ఎవరికీ లాయల్టీ (విశ్వాసం) లేదని కరణ్ నేరుగా విమర్శించారు. ఒక నటుడి ఎదుగుదల కోసం సంస్థ తరపున రెండేళ్ల పాటు ఎంతో కష్టపడితే వారు అకస్మాత్తుగా వేరే ఏజెన్సీకి వెళ్లిపోవడం తనను బాధించిందని చెప్పారు. ఒకసారి బయటకు వెళ్లిపోయిన తారలు మళ్లీ పరిస్థితులు కుదరక తిరిగి తన కంపెనీకే వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. నటీనటులు వచ్చి వెళ్లే తీరును పాసింగ్ క్లౌడ్స్ (వెళ్లిపోయే మేఘాలు) తో పోల్చుతూ.. ఈ వ్యవస్థలో స్థిరత్వం లోపించిందని అసహనం వ్యక్తం చేశారు.
ఒక నిర్మాతగా తన బాధ్యతలను గుర్తు చేస్తూనే... భవిష్యత్తులో తన ప్రాధాన్యతలు ఎలా ఉంటాయో కరణ్ స్పష్టం చేశారు. చిత్ర నిర్మాణంలో తన సొంత ఏజెన్సీకి చెందిన నటులకే ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టారు. తన సంస్థలో భాగమైన వారిని ఒక కుటుంబంలా చూసుకుంటానని.. కాబట్టి తన సినిమాల్లో వారికే పెద్ద పీట వేస్తానని చెప్పారు. తన ఏజెన్సీ నుండి వెళ్లిపోయిన వారితో పనిచేయడానికి అభ్యంతరం లేకపోయినా.. ప్రాధాన్యత విషయంలో మాత్రం మార్పు ఉంటుందని హింట్ ఇచ్చారు.
గ్లామర్ ప్రపంచంలో ఉండే విపరీతమైన ఒత్తిడి నటీనటుల నిర్ణయాలను ప్రభావితం చేస్తోందని కరణ్ పేర్కొన్నారు. ప్రతిరోజూ ప్రజల నుండి ఎదురయ్యే విమర్శలు, జడ్జిమెంట్‌లు వారి మానసిక స్థితిని దెబ్బతీస్తున్నాయని.. అందుకే వారు తరచూ మార్పులు కోరుకుంటున్నారని ఆయన విశ్లేషించారు. ఏదేమైనా టాలెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో నమ్మకం కంటే వ్యాపార కోణమే ఎక్కువగా కనిపిస్తోందని.. ఈ విష వలయం నుండి బయటపడటం ఎవరికీ సాధ్యం కాదని ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు.