ధర్మ ప్రొడక్షన్స్ సేల్ చేయడానికి కారణం చెప్పిన కరణ్
అగ్రనిర్మాత కరణ్ జోహార్ గత ఏడాది ప్రతిష్ఠాత్మక ధర్మ ప్రొడక్షన్స్‌లోని సగం వాటాను ఆధార్ పూనవాలాకు అమ్మేసిన సంగతి తెలిసిందే.;
అగ్రనిర్మాత కరణ్ జోహార్ గత ఏడాది ప్రతిష్ఠాత్మక ధర్మ ప్రొడక్షన్స్‌లోని సగం వాటాను ఆధార్ పూనవాలాకు అమ్మేసిన సంగతి తెలిసిందే. తద్వారా అతడికి 1000 కోట్ల మేర నిధి సమకూరింది. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత వినోదరంగంలో ప్రవేశించేందుకు ధర్మ ప్రొడక్షన్స్ లో వాటాను కొనుగోలు చేసారు. మిగిలిన 50శాతం వాటా అపూర్వ మెహతా- కరణ్ జోహార్ లకు చెందుతుంది. అయితే ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ నుంచి ఇలా వాటా అమ్మడానికి కారణం ఏమిటో తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నించారు. కానీ కరణ్ నుంచి సరైన జవాబు లేదు.
తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ కరణ్ జోహార్ అసలు కారణం వెల్లడించారు. ఆధార్ పూనవల్లా నా ఫ్యామిలీ ఫ్రెండ్. దయగలవాడు. నాకు ఫోన్ చేసి అతడు సినీరంగంలోను విస్తరించాలని భావిస్తున్నట్టు చెప్పాడు. అయితే ఇది వ్యాపారం కాదని నేను అన్నాను. కానీ వినోదరంగంలో ఎదగాలనే తన ఆకాంక్షను వెలిబుచ్చాడు. అతడి రాకతో సృజనాత్మకత పరంగా మాపై ఎలాంటి నియంత్రణా లేదు. అయినా భాగస్వామి ఉన్నప్పుడే మరింత జవాబుదారీతనం పెరుగుతుంది.
అతడి రాకతో సంస్థ విస్తరణ కోసం మాకు పెట్టుబడి వచ్చింది. నేను వెంటనే పంపిణీ విభాగాన్ని తెరవగలిగాను. మ్యూజిక్ డిపార్ట్ మెంట్ ని పెద్దది చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. అధార్ అద్భుతమైనవాడు, కరుణామయుడు. వ్యాపారంలో పదునైన మనస్సు కలిగి ఉంటాడు. పెద్ద ఒప్పందాలు చేయాలంటే అతడిపైనే ఆధారపడతాము... అని తెలిపారు.
ధర్మ ప్రొడక్షన్స్ లో హోంబౌండ్ చిత్రాన్ని నిర్మించాము. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రమిది. కానీ భవిష్యత్ లో ఇలాంటి నిర్ణయం తీసుకోగలమని నేను అనుకోవడం లేదు. మా బ్యానర్ లో లాభదాయకమైన సినిమాలను నిర్మించేందుకే ప్రాధాన్యత ఉందని కరణ్ అన్నారు.
ధర్మ ప్రొడక్షన్స్ హిందీ చిత్రసీమలో పాపులర్ నిర్మాణ సంస్థ. దీనిని 1976లో యష్ జోహార్ స్థాపించారు. వారసత్వంగా కరణ్ చేతికి వచ్చాక ఇంకా చాలా పెద్దగా ఎదిగింది. ఇటీవల సన్నీ సంస్కారి కి తులసి కుమారి చిత్రాన్ని నిర్మించింది.