92 ఏళ్ల క్రితం ముత్తాత..92 ఏళ్ల తర్వాత మునిమనవడు!
ముత్తాత వేసిన బాటలో మునిమనవడు నడవడం అనేది అవకాశం మాత్రమే కాదు. అదొక గొప్ప బాధ్యత. రాముడి పాత్ర కోసం రణబీర్ కపూర్ ఎంతో శ్రమిస్తున్నాడు.;
భారతీయ సినీ చరిత్రలో కపూర్ ఖాందాన్ వారసత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఓ అరుదైన కాకతా ళీయం చోటు చేసుకుంది. ఇప్పుడీ కాకతాళీయం బాలీవుడ్ తో పాటు అభిమానుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సరిగ్గా 92 ఏళ్ల క్రితం రణబీర్ కపూర్ ముత్తాత భారతీయ సినిమా పితామహులలో ఒకరైన పృథ్వీరాజ్ కపూర్ పోషించిన అదే పవిత్రమైన శ్రీరాముడి పాత్రను ఇప్పుడు 92 ఏళ్ల తర్వాత ఆయన మునిమనవడు రణబీర్ కపూర్ పోషిస్తుండటం. ఈ చారిత్రాత్మక ప్రయాణం 1934లో ప్రారంభమైంది.
అప్పట్లో ప్రఖ్యాత దర్శకుడు దేబకీ బోస్ దర్శకత్వంలో `సీత` అనే సినిమా తెరకెక్కింది. ఆ చిత్రంలో పృథ్వీరాజ్ కపూర్ శ్రీరాముడిగా నటించి మెప్పించారు. ఆ కాలంలోనే ఈ సినిమా అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా సత్తాను చాటింది. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి ప్రతిష్టాత్మక వేదికపై ప్రదర్శించబడిన తొలి భారతీయ శబ్ద చిత్రం ఇదే కావడం విశేషం. అప్పట్లో పృథ్వీరాజ్ కపూర్ తన నటనతో రాముడి పాత్రకు ఒక ప్రత్యేక హుందాతనాన్ని తీసుకొచ్చారు. తాజాగా తొమ్మిది దశాబ్దాల అనంతరం అదే కుటుంబం నుండి వచ్చిన నాలుగో తరం నటుడు రణబీర్ కపూర్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రామాయణం` చిత్రంలో శ్రీరాముడిగా నటిస్తున్నారు.
ముత్తాత వేసిన బాటలో మునిమనవడు నడవడం అనేది అవకాశం మాత్రమే కాదు. అదొక గొప్ప బాధ్యత. రాముడి పాత్ర కోసం రణబీర్ కపూర్ ఎంతో శ్రమిస్తున్నాడు. తన ఆహార్యం నుండి మాట్లాడే తీరు వరకు ప్రతి అంశంలోనూ శ్రీరాముడి ఉదాత్తత ప్రతిబింబించేలా ప్రత్యేక శిక్షణ తీసుకుని రంగంలోకి దిగాడు. ఆధునిక సాంకేతికత , భారీ బడ్జెట్‌తో రూపొం దుతున్న చిత్రమిది. ఇందులో పృథ్వీరాజ్ కపూర్ కాలం నాటి ఆత్మీయతను, నేటి తరం విజువల్ వండర్‌ను కలిపి ప్రేక్షకులకు అందించే అవకాశం ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దిగ్గజ నటులు ఒకే పాత్రను రెండు వేర్వేరు శతాబ్దాలలో పోషించడం అనేది భారతీయ సినిమా చరిత్రలోనే అరుదైన రికార్డు.
అప్పటి `సీత` పాత్రలో దుర్గా ఖోటే సీతగా నటించి రికార్డు సృష్టించగా. ఇప్పటి `రామాయణం`లో సీత పాత్రలో దక్షిణాది నటి సాయి పల్లవి నటిస్తుంది. దీంతో అదే స్థాయి మ్యాజిక్‌ను నేటి సీత రిపీట్ చేస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. నితీష్ తివారీ తెరకెక్కిస్తోన్న `రామాయణం` రెండు భాగాలు గా ప్రేక్షకుల ముందుకు రానుంంది. మొదటి భాగాన్ని ఇదే ఏడాది రిలీజ్ చేయనున్నారు. అనంతరం రెండవ భాగం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.