'కాంతార' ఓటీటీ స్ట్రాటజీ.. ఈ లెక్క వేరప్పా!
'కాంతార చాప్టర్ 1'.. 2025లో ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన సునామీ అంతా ఇంతా కాదు.;
'కాంతార చాప్టర్ 1'.. 2025లో ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన సునామీ అంతా ఇంతా కాదు. అయితే, ఈ సినిమా సక్సెస్ కంటే, ఇప్పుడు దీని ఓటీటీ రిలీజ్ స్ట్రాటజీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మేకర్స్ ఈ సినిమాతో ఒకేసారి రెండు డిఫరెంట్ గేమ్స్ ఆడుతున్నారు.
విషయం ఏంటంటే, ఈ సినిమా థియేటర్లలో ఇంకా ఆడుతున్నా, ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మేకర్స్ సౌత్ మార్కెట్‌ను ఒకలా, నార్త్ మార్కెట్‌ను మరోలా ట్రీట్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ వెర్షన్లను నాలుగు వారాలకే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేసేశారు. దీంతో, సౌత్ ఆడియెన్స్‌కు థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్లే.
కానీ, హిందీ వెర్షన్ విషయంలో మాత్రం మేకర్స్ చాలా తెలివిగా వ్యవహరించారు. హిందీ ఆడియెన్స్‌కు 4 వారాల రూల్ పెట్టలేదు. ఆ వెర్షన్‌కు ఏకంగా 56 రోజుల లాంగ్ ఓటీటీ గ్యాప్ ఇచ్చారు. హిందీ వెర్షన్ ఈ నెల చివర్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ గ్యాప్ వల్లే అసలు మ్యాజిక్ జరుగుతోంది.
సినిమా ఓటీటీలోకి వచ్చేసినా, థియేటర్లలో కలెక్షన్ల వర్షం ఇంకా ఆరలేదు. ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌ల ట్రెండ్స్ ప్రకారం, 'కాంతార' సేల్స్ ఇంకా స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న ఈ కలెక్షన్లు మొత్తం ఎక్కడి నుంచి వస్తున్నాయనుకుంటున్నారు? ఆల్మోస్ట్ అన్నీ నార్త్ ఇండియా నుంచే. హిందీ ఆడియెన్స్‌కు ఓటీటీలో చూసే ఆప్షన్ లేదు కాబట్టి, వాళ్లు ఇంకా థియేటర్లకే వస్తున్నారు.
ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దీపావళికి, ఆ తర్వాత అక్టోబర్‌లో వచ్చిన ఏ కొత్త సినిమా కూడా 'కాంతార' డామినేషన్‌ను ఆపలేకపోయింది. అందుకే, సోషల్ మీడియాలో జనాలు ఒక పాయింట్ గట్టిగా రైజ్ చేస్తున్నారు. "ఒకవేళ సౌత్ వెర్షన్ల ఓటీటీ రిలీజ్‌ను కూడా లేట్ చేసి ఉంటే, ఈ సినిమా ఇంకా ఎక్కువ రోజులు ఆడి, మరిన్ని రికార్డులు కొట్టేది కదా" అని కామెంట్స్ చేస్తున్నారు.
'కాంతార' మేకర్స్‌కు తెలియకుండానే ఇండస్ట్రీకి ఒక పెద్ద లెసన్ నేర్పించారు. కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే, ఆడియెన్స్ థియేటర్లకు వస్తారు, ఓటీటీ కోసం వెయిట్ చేస్తారు. మరి, ఇప్పటికైనా మన ప్రొడ్యూసర్లు ఈ 4 వారాల ఓటీటీ విండో గురించి ఆలోచించి, లాంగ్ గ్యాప్స్ వైపు మొగ్గు చూపుతారో లేదో చూడాలి.