అగ్ర హీరోయిన్లు ర‌చ్చ‌కెక్క‌డం వెన‌క పాత క‌క్ష‌లు

అత‌డు సెల్ఫీ దిగాల‌నుకున్న‌ప్పుడు ముందే అనుమ‌తి తీసుకోవాల‌ని, అలా కాకుండా సెల్ఫీ కోసం జ‌యాబ‌చ్చ‌న్ మీది మీదికి వ‌చ్చాడ‌ని కొంద‌రు అన్నారు.;

Update: 2025-08-13 04:22 GMT

వ‌ర్త‌మానం ఎప్పుడూ గ‌తానికి భవిష్య‌త్ కి ముడిప‌డి ఉంటుంది. ఒక వ్య‌క్తి గ‌తం ఏంటో తెలిస్తే వ‌ర్త‌మానం, భ‌విష్య‌త్ ను అంచ‌నా వేయ‌గ‌లం. గ‌తంలో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు ఉంటే, దాని ప‌ర్య‌వ‌సానం మ‌ళ్లీ ఏదో ఒక‌ గొడ‌వ‌కు దారి తీయొచ్చు. పాత క‌క్ష‌లు లేదా క‌డుపు మంటలు ఉండి ఉంటే అది ఏదో రూపంలో వ‌ర్త‌మానంలో బ‌య‌ట‌ప‌డుతుంది.

ఇప్పుడు జ‌యాబ‌చ్చ‌న్ వ‌ర్సెస్ కంగ‌న ర‌చ్చ‌ను ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుందేమో.. అస‌లింత‌కీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏం గొడ‌వ జ‌రిగింది? అంటే.. తాజా ఈవెంట్లో ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ, నాటి మేటి క‌థానాయిక‌ జయా బచ్చన్ దూరంగా నెట్టి వేసారు. ఆ స‌మ‌యంలో జ‌యాజీ స‌హ‌నం కోల్పోయి చాలా కోపంగా రుస‌రుస‌లాడుతూ క‌నిపించారు. ఈ వీడియో క్ష‌ణాల్లో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయింది. అయితే జ‌యాబ‌చ్చ‌న్ లాంటి ఒక సీనియ‌ర్ సిటిజ‌న్ ఇంత‌టి ఆగ్ర‌హానికి గురి కావ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆమె ప్ర‌వ‌ర్త‌న‌పై నెటిజ‌నులు ఆగ్ర‌హించారు. ఒక సెల్ఫీ కోసం ప్ర‌య‌త్నించిన వ్య‌క్తిని అంత‌గా నిరాశ‌ప‌ర‌చాలా? అవ‌మానించాలా? అని కొంద‌రు ప్ర‌శ్నించారు.

అయితే ఈ వార్ కేవ‌లం సోష‌ల్ మీడియాల వ‌ర‌కే ప‌రిమితం కాలేదు. సీన్ లోకి వివాదాస్ప‌ద కంగ‌న ఎంట‌ర‌వ్వ‌డంతో అది మ‌రింత ర‌చ్చ‌కు తెర తీసింది. ఘ‌ట‌న‌పై కంగ‌న‌ స్పందిస్తూ, జయా బచ్చన్‌ను ``చెడిపోయిన విశేషాధికారం కలిగిన మహిళ!`` అని ఘాటుగా విమ‌ర్శించింది. అమితాబ్ జీ భార్య కాబట్టి ప్రజలు ఆమె కోపతాపాలను లేదా చ‌ర్య‌ల‌ను భరించారు. ఆ సమాజ్‌వాదీ టోపీ కోడి దువ్వెనలా కనిపిస్తోంది. ఆమె కోడిలా కనిపిస్తోంది! ఇది ఎంతటి అవ‌మానం!`` అంటూ సెటైర్లు వేసింది. అభిమానిని నెట్టివేసే స‌మ‌యంలో స‌మాజ్ వాదీ పార్టీ ఎంపీ జ‌యాబ‌చ్చ‌న్ తో పాటు తోటి పార్లమెంటేరియన్ శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది కూడా అక్కడే ఉన్నారు. అభిమాని సెల్ఫీ ఘ‌ట‌న త‌ర్వాత జ‌యాజీ, చ‌తుర్వేది క‌లిసి అక్క‌డి నుంచి లోనికి వెళ్లారు. కానీ దీనిని పొలిటిక‌ల్ రైవ‌ల్రీగా మార్చేస్తూ కంగ‌న ఘాటైన వ్యాఖ్య‌లు చేసింది.

అయితే ఈ ఘ‌ట‌న‌లో జ‌యాబ‌చ్చ‌న్ ని స‌మ‌ర్థించేవారు లేరా? అంటే... ఎందుకు ఉండ‌రు. అత‌డు సెల్ఫీ దిగాల‌నుకున్న‌ప్పుడు ముందే అనుమ‌తి తీసుకోవాల‌ని, అలా కాకుండా సెల్ఫీ కోసం జ‌యాబ‌చ్చ‌న్ మీది మీదికి వ‌చ్చాడ‌ని కొంద‌రు అన్నారు. ఇది స‌రికాద‌ని కూడా అప‌రిచిత వ్య‌క్తి చ‌ర్య‌ను ఖండించారు.

ఇక కంగ‌న వ‌ర్సెస్ జ‌యాబ‌చ్చ‌న్ గొడ‌వ విష‌యానికి వ‌స్తే.. అది ఈనాటిది కాదు. ఆ ఇద్ద‌రికీ మ‌ధ్య పాత గొడ‌వ‌లున్నాయి. రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్థులుగా ఉన్నారు. తాజా ఇన్సిడెంట్‌ని క‌క్ష కోణంలో చూడాలా చూడ‌కూడ‌దా? అనేది అటుంచితే, క్వీన్ కంగ‌న ప్ర‌తిసారీ అమితాబ్ బ‌చ్చ‌న్ ని పొగిడేస్తూనే, ఆయ‌న భార్య జ‌యాబ‌చ్చ‌న్ ని అయిన‌దానికి కానిదానికి గిల్లడానికి అల‌వాటు ప‌డింది. ఇప్పుడు రాజ‌కీయం ప‌రంగాను జ‌యాజీ పార్టీ వేరు.. కంగ‌న పార్టీ వేరు. కంగ‌న భాజ‌పా- ఎన్డీయే త‌ర‌పున ఎంపీగా గెలిచి అధికారం చేప‌ట్టింది.

ఒకానొక సంద‌ర్భంలో జ‌యా బ‌చ్చ‌న్ సినీప‌రిశ్ర‌మ గురించి మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్ల‌పై కంగ‌న విరుచుకుప‌డింది. చిత్ర పరిశ్రమను జ‌యాబ‌చ్చ‌న్ `గట్టర్`తో పోల్చినప్పుడు కంగనా దానిని తిప్పి కొట్టారు. జ‌యాజీని ప్ర‌శ్నిస్తూ... నా స్థానంలో మీ కుమార్తె శ్వేతాను టీనేజ్ లో కొట్టి, మ‌త్తు మందు ఇచ్చి, లైంగికంగా వేధిస్తే, అభిషేక్ నిరంతరం బెదిరింపులు వేధింపుల గురించి ఫిర్యాదు చేసి ఒక రోజు ఉరి వేసుకుని దొరికితే మీరు కూడా అదే చెబుతారా? మాపై కూడా కాస్త‌ కరుణ చూపండి`` అంటూ ఘాటైన వ్యాఖ్య‌లు చేసింది. అప్ప‌టి నుంచి ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటూనే ఉంది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే ..కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల‌తో కంగ‌న తీవ్ర నిరాశ‌లో ఉంది. తాను స్వ‌యంగా న‌టించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించి నిర్మించిన‌ `ఎమ‌ర్జెన్సీ` ఫ్లాప్ షోగా మిగిలాక‌ మ‌రో సినిమాకి సంత‌కం చేయ‌లేదు. తదుప‌రి సినిమా గురించి ప్ర‌క‌టించాల్సి ఉంది.

Tags:    

Similar News