త్రిష వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రిచిన వారికి కంగ‌న కోటింగ్!

కొంత‌కాలంగా త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో న‌టి త్రిష చుట్టూ ప్ర‌కంప‌నాలు అన్నీ ఇన్నీ కావు. ద‌ళ‌ప‌తి విజ‌య్ స్నేహితురాలైన త్రిష‌ను అడ్డుపెట్టుకుని టార్గెట్ చేయ‌డం పెద్ద ర‌చ్చ‌కు కార‌ణ‌మ‌వుతోంది.

Update: 2026-09-08 22:30 GMT

కొంత‌కాలంగా త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో న‌టి త్రిష చుట్టూ ప్ర‌కంప‌నాలు అన్నీ ఇన్నీ కావు. ద‌ళ‌ప‌తి విజ‌య్ స్నేహితురాలైన త్రిష‌ను అడ్డుపెట్టుకుని టార్గెట్ చేయ‌డం పెద్ద ర‌చ్చ‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఇటీవ‌ల ద‌ళ‌ప‌తి ప్ర‌త్య‌ర్థి అయిన ఉద‌య‌నిధి స్టాలిన్ త్రిష‌ను కించ‌ప‌రిచే కామెంట్లు చేయ‌డంతో అది త‌మిళ‌రాజ‌కీయాల్లో ర‌చ్చ‌గా మారింది.

తమిళనాడు స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నటి త్రిష వివాదం అంతకంత‌కు ముదురుతూనే ఉంది. ప‌లువురు స‌హ‌నటీమ‌ణులు త్రిష‌కు మ‌ద్ధ‌తు ప‌ల‌క‌గా, అటు బాలీవుడ్ నుంచి త‌న‌కు మ‌ద్ధ‌తు పెరుగుతోంది. త్రిష‌కు మద్దతుగా బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ ఇప్పుడు వార్ లోకి వ‌చ్చారు. `కుల్లు`లో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ- పర్యవేక్షణ కమిటీ (DISHA) సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన కంగనా.. సమాజంలో విజయవంతమైన మహిళలపై సాగుతున్న ద్వంద్వ ప్రమాణాలను తీవ్రంగా ఖండించారు.

పనిచేసే మహిళలు, విజయవంతమైన నటీమణులు లేదా రాజకీయనాయకుల క్యారెక్టర్‌ను టార్గెట్ చేస్తూ వారిని అణచివేసే సంస్కృతి కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉందంటూ కంగనా ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం మహిళలను ఏ విధంగా చూస్తోందో ఎలా ప్రవర్తిస్తోందో లోతుగా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

త్రిష పేరును నేరుగా ప్రస్తావించకుండానే తమిళనాడు ఘటనను ఉదాహరణగా చూపిస్తూ కంగనా మాట్లాడారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలాంటి సంబంధం లేదా వ్యవహారం ఉన్నప్పటికీ నిందలు వేయడం లేదా క్యారెక్టర్ అసాసినేనేషన్ (అవమానించడం) చేయ‌డం విషయానికి వస్తే మాత్రం ఎల్లప్పుడూ మహిళనే ఎంచుకుని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు.

ఈ వివాదం వెనుక డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కావేరీ జలాల నిరసన సభలో చేసిన వ్యాఖ్యలు ప్రధాన కారణమయ్యాయి. సభలో జనాలు త్రిష పేరుతో నిన‌దించ‌గా ఉదయనిధి ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడారనే ఆరోపణలు వచ్చాయి. మహిళలను కించపరిచేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడమే కాకుండా ఉదయనిధి అరెస్ట్ వరకు పరిస్థితి దారితీసింది.

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పాలనలో ఆక‌ట్టుకుంటూ ప్ర‌త్య‌ర్థుల‌పై దూకుడు పెంచుతున్న తరుణంలో త్రిషతో ఉన్న బంధంపై రూమర్లు క్రియేట్ చేయ‌డం.. ఆయన భార్య విడాకులకు దరఖాస్తు చేయడం వంటి అంశాలు ఈ వివాదానికి మరింత తోడయ్యాయి. ఈ క్రమంలో కంగనా స్పందిస్తూ రాజకీయ లేదా వ్యక్తిగత వైషమ్యాల కోసం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం తగదని పిలుపునివ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇప్ప‌టికే స‌మాజంలో పితృత్వ ప‌రిపాల‌న‌ను వ్య‌తిరేకిస్తూ, స్త్రీ శ‌క్తి స్వేచ్ఛ‌ను ఎంక‌రేజ్ చేస్తున్న సెల‌బ్రిటీల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఇదే స‌మ‌యంలో కంగ‌న గ‌ళం గ‌ట్టిగా విన‌ప‌డుతోంది. ఇప్పుడు బ‌హిరంగంగా ఇలా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చి త్రిషకు మ‌ద్ధ‌తు ప‌ల‌క‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News