కమల్ సినిమా వస్తే.. ధనుష్, సూర్య ప్రాజెక్ట్స్‌కు బ్రేక్ పడుతుందా?
ఇప్పటికే కమల్ హాసన్ లైన్‌లో భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాలున్న నేపథ్యంలో, ఫ్యాన్స్ మాత్రం ఆయన్నుంచి ఒక పెర్ఫార్మెన్స్ డ్రివెన్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.;
కొలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ ప్రస్తుతం వేడెక్కుతోంది. కమల్ హాసన్ ఇండియన్2, థగ్ లైఫ్ సినిమాలతో డిజస్టర్లను ఎదుర్కొన్న తర్వాత, స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం కొత్త ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన లైన్‌లో కల్కి2 లాంటి భారీ ప్రాజెక్టులున్నప్పటికీ, ఈసారి ఆయన దృష్టి కేవలం కమర్షియల్ సక్సెస్‌పై కాకుండా, తన యాక్టింగ్ స్కోప్ ను మరోసారి నిరూపించే కథలపై ఉందని తెలుస్తోంది.
వెట్రిమారన్ తో కమల్ సినిమా?
ఈ క్రమంలోనే, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్‌తో కమల్ హాసన్ కలయికపై వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో ప్రత్యేక చర్చకు దారితీశాయి. క్లాస్ కథలను రియలిస్టిక్ ట్రీట్‌మెంట్‌తో చెప్పడంలో పేరుగాంచిన వెట్రిమారన్, క్యారెక్టర్ లో పూర్తిగా ఇమిడిపోయే లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కలిసి పని చేస్తే, అది సాధారణ ప్రాజెక్ట్ కాకుండా ఒక సినీ సంఘటనగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
వెట్రిమారన్ లైనప్ లో పలు ప్రాజెక్టులు
ఇప్పటికే కమల్ హాసన్ లైన్‌లో భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాలున్న నేపథ్యంలో, ఫ్యాన్స్ మాత్రం ఆయన్నుంచి ఒక పెర్ఫార్మెన్స్ డ్రివెన్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడా లోటును వెట్రిమారన్ ప్రాజెక్ట్ భర్తీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే, ఇది కేవలం మరో సినిమా కాకుండా, కమల్ కెరీర్‌లో కీలక మలుపుగా మారే ప్రాజెక్ట్ కావొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం వెట్రిమారన్, ధనుష్ తో వడ చెన్నై2, సూర్యతో వాడివాసల్ ను తెరకెక్కించాల్సి ఉంది. ఇవి రెండూ కూడా ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు సృష్టించిన ప్రాజెక్టులే. ముఖ్యంగా వడ చెన్నై 2 ఒక కల్ట్ క్లాసిక్‌కు సీక్వెల్ కావడం, వాడివాసల్ సూర్య కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమాగా భావించబడటం వల్ల, వీటి ప్రాధాన్యత మరింత ఎక్కువ.
ఇలాంటి పరిస్థితిలో కమల్ హాసన్ ప్రాజెక్ట్ ముందుకు వస్తే, వెట్రిమారన్ తన ప్రాధాన్యతలను మార్చుకోవాల్సిన పరిస్థితి రావొచ్చు. షెడ్యూల్ పరిమితులు, ప్రొడక్షన్ ప్లానింగ్ కారణంగా ఈ మూడు ప్రాజెక్టులను సమాంతరంగా నిర్వహించడం కష్టం కావచ్చు. ఫలితంగా వడ చెన్నై 2 లేదా వాడివాసల్ లో ఏదొక ప్రాజెక్టు ఆలస్యమయ్యే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇది కేవలం డిలే సమస్య మాత్రమే కాకుండా, కథ, క్యాస్టింగ్ లేదా ప్రొడక్షన్ స్ట్రాటజీల్లో కూడా మార్పులకు దారితీయొచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కలమ్- వెట్రిమారన్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు
మొత్తంగా చూస్తే, కమల్ హాసన్- వెట్రిమారన్ కలయిక ఒక వైపు భారీ ఎక్స్పెక్టేషన్స్‌ను రేకెత్తిస్తుంటే, మరోవైపు వెట్రిమారన్ ప్రస్తుత లైనప్‌పై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందనే కోణం కూడా సమానంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఏర్పడిన హైప్ మాత్రం కొలీవుడ్‌లో ఒక పెద్ద సినీ సంఘటనకు సంకేతాలిస్తోంది.