40 ఏళ్ల 'స్వాతిముత్యం' ఓ అద్భుతం!

ఇలాంటి క‌థ‌ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏ ద‌ర్శ‌కుడు, నిర్మాత సాహ‌సించ‌డు. ఇలాంటి డీ గ్లామ‌ర్ క్యారెక్ట‌ర్ల‌లో పైగా బిడ్డ‌కు త‌ల్లి, వితంతువు పాత్ర‌లో న‌టించ‌డానికి ఎవ‌రూ స‌హ‌సించ‌రు.;

Update: 2026-03-13 07:55 GMT

క‌ళాత‌ప‌స్వీ కె. విశ్వ‌నాథ్ డైరెక్టోరియ‌ల్ అద్భుతం `స్వాతిముత్యం`, అప్ప‌ట్లో తెలుగు సినిమా పోక‌డ‌ని, క‌థ‌ల గ‌మ‌నాన్ని మార్చి ఒక్క‌సారి ఆశ్చ‌ర్యంతో చేసేలా చేసిన సినిమా ఇది. హీరోయిన్ వింతువు. పైగా ఓ బిడ్డ‌కు త‌ల్లి. వ‌ట్టి అమాయ‌కుడైన హీరో..త‌న ప‌రిస్థితిని చూసి త‌న‌కు పెళ్లైతేనే బాధ‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంద‌ని చెప్పిన మాట‌లు న‌మ్మి త‌న‌కు తెలియ‌కుండా, త‌న ఆమోదం లేకుండానే పెళ్లి చేసుకోవ‌డం. వంటి క‌థ అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఇలాంటి క‌థ‌ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏ ద‌ర్శ‌కుడు, నిర్మాత సాహ‌సించ‌డు. ఇలాంటి డీ గ్లామ‌ర్ క్యారెక్ట‌ర్ల‌లో పైగా బిడ్డ‌కు త‌ల్లి, వితంతువు పాత్ర‌లో న‌టించ‌డానికి ఎవ‌రూ స‌హ‌సించ‌రు.

జాతీయ పుర‌స్కారం..మూడు నందీ అవార్డులు..

అలాంటి అసాధ్యాన్ని క‌ళాత‌ప‌స్వీ కె. విశ్వ‌నాథ్..క‌మ‌ల్ హాస‌న్‌, రాధిక‌ల‌తో సుసాధ్యం చేసి ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ క్లాసిక్ సినిమాగా `స్వాతిముత్యం` నిలిచేలా చేశారు. ఈ సినిమా 40 ఏళ్ల క్రితం స‌రిగ్గా ఇదే రోజు (1986 మార్చి 13)న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. క్లాస్ ప్రేక్ష‌కుల‌తో పాటు మాస్‌ని మెప్పించిన ఈ సినిమా విశేషాలెన్నో ఉన్నాయి. ఈ మూవీకి ముందు హీరో క్యారెక్ట‌ర్ అమాయ‌కుడైన శివ‌య్య కాబ‌ట్టి సినిమాకు`శివ‌య్య‌` అని పెట్టాల‌నుకున్నారు. అయితే ఫైన‌ల్‌గా `స్వాతిముత్యం` అని ఫిక్స్ చేశారు. తెలుగులో క‌మ‌ల్ హాస‌న్, రాధిక నటించిన స్ట్రెయిట్ మూవీ కావ‌డం, ఆబాల‌గోపాలాన్ని ఆక‌ట్టుకోవ‌డంతో దీనికి ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పుర‌స్కారం ద‌క్కింది.

అంతే కాకుండా నంది అవార్డుల్లో ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు విభాగాల్లో మూడు అవార్డులు ద‌క్కాయి. ఆస్కార్‌కు ఎంట్రీ సాధించిన తొలి ద‌క్షిణాది చిత్రం ఇదే కావ‌డం విశేషం. అంత‌కు ముందు మాస్కో ఫిలిం ఫెస్టివెల్‌లో ప్ర‌ద‌ర్శిత‌మై ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. అమాయ‌కంగా ఉండే హీరో మామూలు వ్య‌క్తిగా మారేలా ముందుగా క్లైమాక్స్‌ని ప్లాన్ చేశారు ద‌ర్శ‌కుడు కె.విశ్వ‌నాథ్‌. అయితే అది నిర్మాత ఏడిద నాగేశ్వ‌ర‌రావుకు న‌చ్చ‌లేదు. అంతే కాకుండా హీరోయిన్ క్యారెక్ట‌ర్‌ని ముగించ‌కుండానే ఈ క‌థ‌ని ఎండ్ చేయాల‌ని ముందు అనుకున్నారు. సుధీర్ఘ చర్చ‌ల త‌రువాత ముందు అనుకున్న దాన్నిమార్చి హృద‌యాన్ని బ‌రువెక్కించే స‌న్నివేశంతో ఎండ్ చేశారు.

క‌మ‌ల్‌హాస‌న్ మ‌న‌వ‌డిగా అల్లు అర్జున్‌..

ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ మ‌న‌వ‌డిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంద‌డి చేయ‌గా, రాధిక కొడుకుగా న‌టుడు కాంతారావు మ‌న‌వ‌డు కార్తీక్ అల‌రించాడు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన ఈ సినిమా 25 కేంద్రాల్లో 100 రోజులు ప్ర‌ద‌ర్శిత‌మైంది. బెంగ‌ళూరు, మైసూర్‌ల‌లో ఏడాదికి పైగా థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శితం కావ‌డం ఇప్ప‌టికీ ఓ రికార్డ్‌. 1986 జూన్‌లో ఈ సినిమా విజ‌యోత్స‌వ వేడుక‌ని హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఎన్‌.టి. రామారావు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించాక పాల్గొన్న తొలి సినిమా వేడుక ఇదే. ఆయ‌న‌తో పాటు చిరంజీవి, బాలీవుడ్ న‌టుడు రాజ్ క‌పూర్ ఈ వేడుక‌లో పాల్గొన్నారు.

1994లో విడుద‌లైన హాలీవుడ్ మూవీ `ది ఫారెస్ట్ గంప్‌`లోని హీరో పాత్ర `స్వాతి ముత్యం`లోని శివ‌య్య పాత్ర‌ని పోలి ఉంద‌ని, అలా మ‌న సినిమాలు హాలీవుడ్‌కూ స్ఫూర్తినిచ్చాయ‌ని క‌మ‌ల్ హాస‌న్ ఓ సంద‌ర్భంలో అన్నారు. ఇదే సినిమాని హిందీలో `ఈశ్వ‌ర్‌` పేరుతో రీమేక్ చేశారు. కె. విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు. అనిల్ క‌పూర్ హీరోగా న‌టించ‌గా విజ‌య‌శాంతి హీరోయిన్‌గా న‌టించింది. ఆమెకిదే తొలి హిందీ సినిమా. ఇక క‌న్న‌డ‌లో రాజేంద్ర‌బాబు ద‌ర్శ‌క‌త్వంలో కిచ్చా సుదీప్ హీరోగా `స్వాతిముత్తు`గా రీమేక్ చేశారు. ఇందులో మీన హీరోయాన్‌గా రాధిక పాత్ర‌లో న‌టించింది.

కె. విశ్వ‌నాథ్ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌..

అవార్టు సినిమాలు తీయ‌డం వేరు. క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు తెర‌కెక్కించ‌డం వేరు. కానీ సున్నిత‌మైన అంశం నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ని సొంతం చేసుకుని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. దానికి కార‌ణం ద‌ర్శ‌కుడు కె. విశ్వ‌నాథ్ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌. ఈ సినిమాతో కె. విశ్వ‌నాథ్, ఏడిద నాగేశ్వ‌ర‌రావుల కాంబినేష‌న్‌లో సినిమా అంటే అది మ‌రో ఆణిముత్య‌మ‌నే టాక్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో, ప్రేక్ష‌కుల్లో స్థిర‌ప‌డిపోయింది.

ఇందులో ఇళ‌య‌రాజా స్వ‌ర‌ప‌రిచిన పాట‌లు కూడా ఇప్ప‌టికీ ఆణిముత్యాలుగానే మిగిలిపోయాయి. సువ్వీ సువ్వీ సువ్వాల‌మ్మా..మ‌న‌సు ప‌లికే మౌన‌రాగం.., లాలీ లాలీ లాలీ లాలీ..., పాట‌లు ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉన్నాయి. అప్ప‌ట్లోనే క‌ల్ట్ క్లాసిక్ సినిమాకు అర్థం చెప్పిన టాలీవుడ్ చ‌రిత్ర‌లో మ‌ర‌పురాని, మ‌ర్చిపోలేని కల్ట్ క్లాసిక్ సినిమాగా `స్వాతిముత్యం నిలిచిపోయింది.

Tags:    

Similar News