పెరిగిన నిర్మాణ వ్యయంపై కమల్ హాసన్ ఆందోళన..టాలీవుడ్ పెద్దలు ఆయన లేఖ చదివారా?
పెరిగిన నిర్మాణ వ్యయం వల్ల ముఖ్యంగా చిన్న- మధ్యతరహా చిత్రాల నిర్మాతలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కమల్ హెచ్చరించారు.
విశ్వనటుడు, దర్శక నిర్మాత కమల్ హాసన్ తాజాగా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఒక వివరణాత్మక బహిరంగ లేఖ రాశారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ సినిమాపై తీవ్రమైన ఆర్థిక ప్రభావాన్ని చూపుతాయని ఆయన హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా.. ఒక భారీ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్న సినిమా రంగాన్ని ఎలా సంక్షోభంలోకి నెట్టేస్తాయో ఆయన ఈ లేఖ ద్వారా వెల్లడిస్తూ .. తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం చిత్ర పరిశ్రమకు పెద్ద సవాలుగా మారుతుందని కమల్ పేర్కొన్నారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు భారీగా పెరుగుతాయని.. ఇది పరోక్షంగా సెట్ల నిర్మాణం, ప్రయాణ ఖర్చులు, రోజువారీ షూటింగ్ ఉత్పత్తి వ్యయాన్ని అమాంతం పెంచేస్తుందని ఉలగనాయగన్ వివరించారు. గ్లోబల్ మార్కెట్‌లో తలెత్తే అస్థిరత స్థానిక చిత్ర నిర్మాణ బడ్జెట్లను తారుమారు చేస్తుందని గుర్తు చేశారు.
పెరిగిన నిర్మాణ వ్యయం వల్ల ముఖ్యంగా చిన్న- మధ్యతరహా చిత్రాల నిర్మాతలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కమల్ హెచ్చరించారు. బడ్జెట్ అదుపు తప్పితే అది పరోక్షంగా కార్మికులు, సాంకేతిక నిపుణుల ఉపాధిపై కూడా ప్రభావం చూపుతుందని కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా విదేశీ షూటింగ్‌లు, అంతర్జాతీయ పంపిణీ వ్యవస్థ కూడా ఈ ఉద్రిక్తతల వల్ల ఆటంకాలకు గురవుతాయని ఆయన తన లేఖలో విశ్లేషించారు.
ఈ ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చిత్ర పరిశ్రమలోని అన్ని వర్గాల వాటాదారులు తక్షణమే స్పందించాలని కమల్ పిలుపునిచ్చారు. పరిశ్రమలో అందరినీ పిలిచి ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్లను ఎలా నియంత్రించుకోవాలో చర్చించాలని ప్రతిపాదించారు. కేవలం సమస్య వచ్చినప్పుడు స్పందించడం కాకుండా.. భవిష్యత్తులో ఎదురయ్యే ఇటువంటి విపత్తులను తట్టుకోవడానికి ముందస్తు ప్రణాళికలు, ఐక్యత అవసరమని ఆయన నొక్కి చెప్పారు.
సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదని.. అది వేలాది మందికి జీవనోపాధినిచ్చే ఒక వ్యవస్థ అని కమల్ హాసన్ తన లేఖలో పేర్కొన్నారు. సమస్య ముదిరే వరకు వేచి చూడకుండా ఇప్పుడే మేల్కొని పరిశ్రమ పెద్దలు తగిన చర్యలు తీసుకోవాలని ముందస్తు హెచ్చరిక చేశారు. ఈ కష్టకాలంలో చిత్ర పరిశ్రమ అంతా ఒక్కతాటిపైకి వచ్చి సమిష్టిగా పోరాడితేనే సినిమా రంగాన్ని కాపాడుకోగలమని ఆయన తన లేఖను ముగించారు. కమల్ హాసన్ ఇచ్చిన పిలుపు కేవలం కోలీవుడ్ వరకే కాదు.. భారతదేశంలోని అన్ని సినీపరిశ్రమలకు వర్తిస్తుంది. ఆయన పిలుపును టాలీవుడ్ హీరోలు, దర్శకనిర్మాతలు కూడా వినాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎగ్జిబిటర్లు, నిర్మాతల సమస్యల గురించి ఫిలింఛాంబర్ పెద్దలు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఆయిల్ క్రైసిస్ కారణంగా తలెత్తే పరిణామాలపైనా, బడ్జెట్ల అదుపు పైనా టాలీవడ్ లో చర్చించాల్సి ఉంటుంది.