మద్రాస్ హైకోర్టులో కమల్ హాసన్ కు భారీ ఊరట.. ఏం జరిగిందంటే?
గత కొంతకాలంగా సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలను, పేరును, వారి బిరుదులను, వారి వాయిస్ ను ఉపయోగించి కొంతమంది వాణిజ్య పరంగా ఆదాయం పొందుతున్న విషయం తెలిసిందే.;
గత కొంతకాలంగా సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలను, పేరును, వారి బిరుదులను, వారి వాయిస్ ను ఉపయోగించి కొంతమంది వాణిజ్య పరంగా ఆదాయం పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటు టాలీవుడ్ చిరంజీవిని మొదలుకొని అటు బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ వరకు చాలామంది సెలబ్రిటీలు హైకోర్టును ఆశ్రయించి, తమ గౌరవానికి భంగం కలిగించకుండా కాపాడాలని విన్నవించుకున్న విషయం తెలిసిందే. అటు ఢిల్లీ హైకోర్టులో వీరంతా కూడా తమ తరఫు న్యాయవాదుల చేత వాదనలు వినిపించడంతో.. ఇకపై సెలబ్రిటీల అనుమతులు లేకుండా ఎవరూ కూడా వారి పేరు, ఫోటోలను, వీడియోలను, వారి వాయిస్ ను, వారి బిరుదులను కూడా ఎక్కడా ఉపయోగించకూడదని హైకోర్టు తీర్పునిచ్చింది.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తన అనుమతి లేకుండా ఫోటోలను టీ షర్టులపై ముద్రించడమే కాకుండా తన బిరుదును, ప్రసిద్ధ డైలాగులను ఉపయోగించి తన పరువుకు భంగం కలిగించారంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన సీనియర్ స్టార్ హీరో కమలహాసన్ కి చెన్నై హైకోర్టులో ఊరట కలిగింది . ఈ మేరకు తీర్పునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విషయంలోకి వెళ్తే చెన్నైకు చెందిన "నీయేవిడై" సంస్థ తన ఫోటో పేరు అలాగే ఉలగనాయగన్ అనే తన బిరుదును, ఇక తన ప్రసిద్ధ డైలాగ్ ను అనుమతి లేకుండా ఉపయోగించి టీ షర్టులను, షర్ట్ లను విక్రయిస్తున్నట్లు కమలహాసన్ తరఫున మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది.
ఇక న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి సమక్షంలో విచారణకు వచ్చిన ఈ పిటిషన్ పై ఆయన స్పందిస్తూ.. "వ్యక్తి హక్కును పరిరక్షించేలా కమలహాసన్ పేరు, ఫోటో, బిరుదులు అలాగే డైలాగులను నీయే విడై సంస్థతో పాటు మరే ఇతర సంస్థ కూడా అనుమతి లేకుండా ఉపయోగించకూడదు" అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు కమలహాసన్ అనుమతి లేకుండా వాణిజ్యపరంగా కమల్ హాసన్ పేరు, ఫోటోలను వాడొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ.. పిటిషన్ కు సమాధానం ఇవ్వాలని నీయే విడై సంస్థను ఆదేశించింది. ఇక అలాగే తదుపరి విచారణను ఫిబ్రవరి కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇకపోతే కార్టూనిస్ట్ లు మాత్రం కమల్ హాసన్ ఫోటోలను ఉపయోగించడం పై ఎలాంటి నిషేధం లేదని తన ఆదేశాలలో న్యాయమూర్తి వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఈ ఆదేశాలను తమిళ, ఇంగ్లీషు పత్రికలలో ప్రకటనగా ఇవ్వాలని కూడా ఆయన ఆదేశించారు. మొత్తానికైతే తన అనుమతి లేకుండా తన ఫోటోలను, పేరును వాడుకూడదని హైకోర్టు న్యాయమూర్తి చెప్పడంతో కమలహాసన్ కి భారీ ఊరట కలిగిందని చెప్పవచ్చు.
ఇకపోతే కమలహాసన్ ఒకవైపు హీరో గానే కాకుండా మరొకవైపు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు గానే కాకుండా రాజ్యసభ సభ్యుడుగా కూడా కొనసాగుతున్నారు. మరొకవైపు తన రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రజనీకాంత్ సినిమాను నిర్మించడమే కాకుండా త్వరలో రజనీకాంత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.