మరో క్రేజీ మ్యూజికల్ బయోపిక్ కి రంగం సిద్ధం
| 15వ శతాబ్దపు ఆధ్యాత్మిక కవి, సంఘ సంస్కర్త సంత్ కబీర్ జీవితంపై ‘కబీర’ పేరుతో మ్యూజికల్ బయోపిక్ తెరకెక్కనుంది. మహావీర్ జైన్ ఫిల్మ్స్ ప్రకటించిన ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తుండగా, తనిష్క్ బాగ్చి సంగీతం అందించనున్నారు. కబీర్ దోహాలకు జానపద, సూఫీ, శాస్త్రీయ సంగీతాల మేళవింపుతో కొత్త రూపం ఇవ్వనున్నారు. 2027 ప్రారంభంలో చిత్రీకరణ మొదలుకానుంది.
భారతీయ చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ ఇప్పుడు సరికొత్త శిఖరాలను అందుకుంటోంది. ఇటీవలే `హనుమాన్ అంశ్` వంటి ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్య చిత్రాల ప్రకటనలతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుండగా.. ఇప్పుడు మరో క్రేజీ మ్యూజికల్ బయోపిక్‌కు రంగం సిద్ధమైంది. మన పాఠశాల రోజుల్లో పాఠ్యాంశాలలో ఎంతో ఆసక్తిగా చదువుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక కవి, సంఘ సంస్కర్త `సంత్ కబీర్` జీవిత చరిత్రను వెండితెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
15వ శతాబ్దపు ప్రముఖ కవి, తత్వవేత్త సంత్ కబీర్ జీవితం- బోధనల ఆధారంగా మహావీర్ జైన్ ఫిల్మ్స్ `కబీర` పేరుతో ఒక భారీ మ్యూజికల్ డ్రామాను అధికారికంగా ప్రకటించింది. నాటి సమాజంలో పేరుకుపోయిన మతపరమైన మూఢాచారాలను.. కుల వివక్షను.. మనుషుల మధ్య ఉన్న డివైడ్ ఫ్యాక్టర్ ను తనవైన తాత్విక- ఆధ్యాత్మిక బోధనలతో నిలదీసిన కబీర్ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఈ చిత్రంలో అత్యంత భావోద్వేగభరితంగా ఆవిష్కరించనున్నారు.
15వ శతాబ్దపు పురాతన కాశీ నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. ఒక హిందూ తల్లికి జన్మించి.. ముస్లిం నేత కార్మిక కుటుంబంలో పెరిగిన కబీర్ ఆనాటి మతపరమైన కట్టుబాట్లకు అతీతంగా మానవత్వమే అసలైన మతమని.. ఆధ్యాత్మిక ఐక్యతే పరమార్థమని ఎలా చాటిచెప్పారో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. పాఠ్యపుస్తకాలకే పరిమితమైన కబీర్ జీవితంలోని ఆసక్తికర కోణాలను నేటితరం ప్రేక్షకులకు చేరువ చేయడమే ఈ చిత్ర ప్రధాన ఉద్దేశం.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే .. పరమాణు: ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్, తేరే బిన్ లాడెన్ వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు పొందిన అభిషేక్ శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నాటి కాశీ ఘాట్‌లు, చారిత్రక సాంస్కృతిక వాతావరణాన్ని అతడు వెండితెరపై రీక్రియేట్ చేయనున్నారు. ఇక మ్యూజికల్ బయోపిక్ కావడంతో సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తనిష్క్ బాగ్చి కబీర్ ప్రఖ్యాత దోహాలకు జానపద-సూఫీ- శాస్త్రీయ సంగీతాల మేళవింపుతో సరికొత్త ఆధ్యాత్మిక రూపం ఇవ్వనున్నారు.
మహావీర్ జైన్-అమిత్ ఉపాధ్యాయ సమర్పణలో మహావీర్ జైన్ ఫిల్మ్స్, సరళ్ వల్లభ్ భన్సాలీ, శ్రద్ధా సింగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సంత్ కబీర్ పాత్రలో ఎవరు నటిస్తారు? ఇతర ప్రధాన తారాగణం ఎవరనే వివరాలను ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. నటీనటుల ఎంపిక పూర్తి చేసి 2027 ప్రారంభంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
పాఠ్య పుస్తకాల్లో కబీర్ జీవిత చరిత్ర:
సంత్ కబీర్ జీవిత చరిత్ర, తత్వశాస్త్రం, దోహాలు భారతదేశంలోని పలు పాఠశాల, ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలలో తప్పనిసరిగా ఉంటాయి. ముఖ్యంగా సోషల్ స్టడీస్ (చరిత్ర), హిందీ సాహిత్య పాఠ్యాంశాలలో కబీర్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఏడో క్లాస్ నుంచి ఇంటర్ వరకూ పలు టెక్ట్స్ బుక్స్ లో కబీర్ పై పాఠాలు ఉన్నాయి.