అనుదీప్ మరోసారి.. ఈసారైనా ఎక్కువ సేపు కనిపిస్తాడా?

అయితే ఇప్పుడు కాయదు లోహర్.. అనుదీప్ తో దిగిన పిక్ ను షేర్ చేశారు. దీంతో సినిమాలో డైరెక్టర్ ఓ రోల్ లో కనిపించనున్నట్టు టాక్ వినిపిస్తోంది.;

Update: 2025-09-18 11:55 GMT

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కేవీ అనుదీప్ గురించి తెలిసిందే. ఓవైపు దర్శకుడిగా సినిమాలు తెరకెక్కిస్తూనే.. మరోవైపు పలు చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ మిస్డ్ కాల్ ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత రచయితగా పలు చిత్రాలకు డైలాగ్స్ రాసే ఛాన్సులు అందుకున్నారు. అదే సమయంలో విరించి వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు.

 

2016లో పిట్ట గోడ మూవీ ద్వారా దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన అనుదీప్.. కామెడీ ఎంటర్టైనర్ జాతిరత్నాలు మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. డెబ్యూ తర్వాత ఐదేళ్ల గ్యాప్ తీసుకున్న ఆయన.. జాతిరత్నాలుతో సంచలనం సృష్టించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీతో తీర్చిదిద్ది స్పెషల్ మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు.

రెండో చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుదీప్.. ఆ తర్వాత స్టార్ హీరో శివకార్తికేయన్‍ తో తెరకెక్కించిన ప్రిన్స్ మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆశించిన స్థాయిలో హిట్ మాత్రం అందుకోలేకపోయారు. ఇప్పుడు మాస్ కా దాస్ విశ్వక్‍ సేన్ తో ఫంకీ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా రూపొందుతున్న ఫంకీ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఆ మూవీలో హీరోయిన్ గా కాయదు లోహార్ యాక్ట్ చేస్తోంది. ఆ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించకపోయినా.. అదే కన్ఫర్మ్ అని సమాచారం.

అయితే ఇప్పుడు కాయదు లోహర్.. అనుదీప్ తో దిగిన పిక్ ను షేర్ చేశారు. దీంతో సినిమాలో డైరెక్టర్ ఓ రోల్ లో కనిపించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలు సినిమాల్లో యాక్ట్ చేసిన అనుదీప్.. ఇప్పుడు తన డైరెక్షన్ లోనే యాక్ట్ చేస్తున్నారని సమాచారం. అదే సమయంలో మరో విషయం వైరల్ గా మారింది.

ఈసారైనా మెరుపుతీగ లా కాకుండా కాస్త స్క్రీన్ పై ఎక్కువ సేపు కనిపిస్తారో లేదోనని అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అనుదీప్.. మ్యాడ్‌, మ్యాడ్‌ స్క్వేర్‌, కల్కి 2898 ఏడీ చిత్రాల్లో గెస్ట్ రోల్స్ లో కనిపించారు. రీసెంట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలోని ఓ సాంగ్ లో సందడి చేశారు.

అలా ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో కూడా జస్ట్ అలా కనిపించి ఇలా మాయమయ్యారు. అందుకే మెరుపుతీగలా కాకుండా ఇప్పుడు తాను దర్శకత్వం చేస్తున్న మూవీ కాబట్టి.. ఫంకీలో స్క్రీన్ టైమింగ్ ను పెంచుకుంటారా అని డిస్కస్ చేసుకుంటున్నారు. మరి అనుదీప్ ఏం చేయనున్నారో సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి.

Tags:    

Similar News